| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - షష్ఠాశ్వాసము |
| సీ. |
ఏ నేమి సెప్పుదు దీని నెవ్వరికిని | మానుషంబునఁ దీర్పరాని దాని; నయినను జెప్పెదఁ బ్రియహితవచన యీ | ప్రోలికి నామడనేల నల్ల యమునానదీగహ్వరమున బకుం డను | రక్కసుం డుండి వాఁ డక్కజముగ నిందుల కాఁపుల నందఱఁ దొల్లి యి | ల్వరుస మ్రింగుచు నున్నఁ బరమసాధు |
|
| ఆ. |
లగు ధరామరేంద్రు లగణితజపహోమ | దానవిధులఁ జేసి వానివలనఁ గ్రమము వడసి యొక్క సమయంబుఁ జేసిరి; | యొనర దాని తెఱఁగు వినుము తల్లి! |
267 |
| వ. | నిత్యంబు నిలువరుస నొక్కమానిసి రెం డెనుపోతులం బూన్చిన శకటంబున నపరిమితభక్ష్యపిశిత మిశ్రాన్నంబు నించికొని పోయిన దానిని, వానిని, నయ్యెనుపోతులను భక్షించుచు. | 268 |
| ఆ. |
మనుజభక్షుఁ డిదియ తనకు నప్పనముగా | నొరులవలనిబాధ నొరయకుండ దీనిఁ గాచుచుండు నీనాఁటిరాజును | దలఁపఁ డసుర నోర్వ బలిమిలేమి. |
269 |
| ఉ. |
పోలఁగ ధర్మశీలుఁ డయి భూరిబలాధికుఁ డైన ధారుణీ పాలకు రక్ష ము న్వడసి భార్యను బుత్త్రుల నర్థయుక్తితో నోలిన మేలుగాఁ బడసి యూళ్ళను నున్నది యట్లుగాని నాఁ డేల గృహస్థవృత్తి సుఖ మేఁగి వనంబున నున్కి కష్టమే. |
270 |
| క. |
అరి యని విప్రులచేతను | ధరణీశులు పోఁకయును మొదలుగాఁ గొన రె వ్వరు నిప్పాపుఁడు మానిసి | నరిగొనియెడు భక్షణార్థి యై విప్రులచేన్. |
271 |
| వ. | ‘పెద్దకాలంబునకు నీ యిలువరుస నేఁడు మాకు వచ్చె; ని చ్చిఱుత వాని నా రాక్షసునకు భక్ష్యంబుగాఁ బుచ్చనోప; నేన పోయెద’ నని దుఃఖించి పలికిన బ్రాహ్మణునకుఁ గుంతి యి ట్లనియె; ‘నయ్యా! దీనికి సంతాపింపవలవ; దీయాపద దలఁగునట్టి యుపాయంబు గంటి; నీకుం గొడు కొక్కరుండ; వాఁడును గడుబాలుండు; బలిగొనపోవ నర్హుండు గాఁడు; నా కేవురుగొడుకులు గలరు; వారలలో నొక్కరుం డారక్కసునకు భవదర్థంబుగా బలి గొని పోయెడు’ ననిన దాని విననోడి బ్రాహ్మణుండు చెవులు మూసికొని యి ట్లనియె. | 272 |
| మధ్యాక్కర |
అతిథి యై వచ్చిన బ్రాహ్మణున్ జీవితార్థి నై నాకు హితముగా రక్కసువాతఁ ద్రోవ నే నె ట్లొడంబడుదు? మతి నవమానింపఁగా దనిన విప్రుమరణంబు దలఁచు టతిపాతకము; పాతకములలో బ్రహ్మహత్యయ పెద్ద. |
273 |
| క. |
ధృతి సెడి వేఁడెడువానిని | నతిథిని నభ్యాగతుని భయస్థుని శరణా గతుఁ జంపఁగ నొడఁబడు దు | ర్మతి కిహముం బరముఁ గలదె మదిఁ బరికింపన్. |
274 |
| వ. | ‘మఱి యాత్మఘాతంబు మహాపాతకంబు; దాని కెట్లొడంబడి తంటేని యది యనతిక్రమణీయం బయి యప్రతీకారం బయి యొరులచేతం జేయంబడుటంజేసి నాకుం బాతకంబు లేదు; దానిం జేసినవానికి మహాపాతకం బగుం గావున బ్రాహ్మణహింస కే నొడంబడ నోప’ ననినఁ గుంతి యి ట్లనియె. | 275 |