| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - షష్ఠాశ్వాసము |
| వ. | అనుచు సమీరణసుతుండు దన సమీపంబున నున్న విశాలసాలవృక్షంబు పెఱికికొని రక్కసునిపై వైచిన వాఁడును దన చేతివృక్షంబున దాని భగ్నంబుఁ జేసె; ని ట్లిరువురు నొక్కవడి వృక్షయుద్ధంబు సేసి యాసన్న మహీరుహంబులు సమసిన మల్లయుద్ధసన్నద్ధులై. | 298 |
| చ. |
పరువడి నొండొరుం బెనఁగి పట్టుచుఁ ద్రోచుచు నీడ్చుచుం బర స్పరజయకాంక్షులైన బక పాండవవీరుల పాదఘట్టనన్ ధరణితలంబు గ్రక్కదలెఁ, దన్నికటద్రుమవల్లు లెల్ల జ ర్జరితము లయ్యె, నిష్ఠురవిశాలశిలల్ నుఱుమయ్యె నయ్యెడన్. |
299 |
| ఉ. |
ఇద్దఱ హుంకృతిధ్వనులు నిద్దఱ భూరిభుజారవంబు న య్యిద్దఱముష్టిఘాతజనితేరితదారుణనిస్వనంబు న య్యిద్దఱపాదఘట్టితమహీరవమున్ విని చూప ఱెల్లనుం దద్దయు భీతి నచ్చటికిఁ దా రెడగల్గఁగఁ బాఱి రొక్కఁడై. |
300 |
| వ. | ఇట్లు భీమ బకాసురు లాసురంబునం బెనంగి మల్లయుద్ధంబు సేయునెడ. | 301 |
| క. |
కడఁగి వృకోదరుఁ డసురం | బడఁగా ధర వైచి వామపాదంబునఁ జే డ్పడ వానిఱొమ్ముఁ దాఁచెం | గడుకొని యసురయును లేచి కడునుద్ధతుఁ డై. |
302 |
| క. |
అనిలసుతుఁ బట్టికొని పె | ల్చన త్రోచి కడంగి కనకశైలనికుంజం బునుబోని వానివక్షముఁ | దనదృఢతరముష్టిఁ బొడిచెఁ దద్దయు నలుకన్. |
303 |
| వ. | భీముండును వాని హీనసత్త్వుంగా నెఱింగి సుర హస్తి హస్తానుకారంబు లైన సవ్య దక్షిణ హస్తంబుల న మ్మనుజ కంటకు కటి కంఠ ప్రదేశంబులు వట్టికొని. | 304 |
| ఉ. |
దారుణ జానుదండమున దండధర ప్రతిముండు భీకరా కారుఁడు వానివీఁపు విఱుగంబొడిచెం బిశితంబుతో నవ ద్వారములన్ మహారుధిరధారలు బోరన నొల్కి మాంస పం కారుణవారిఘోరనదు లై పఱవన్ విపినాంతరంబునన్. |
305 |
| వ. | ఇట్లు బకాసురుండు భీముచేత నిహతుం డయి విగతజీవితుం డగుచుండి యఱచిన నమ్మహాధ్వని విని, వాని బాంధవు లైన రక్కసులు పెక్కండ్రు పఱతెంచిన వారలం జూచి భీముం డి ట్లనియె. | 306 |
| తే. |
‘ఇంక నెన్నండు రక్కసు లిద్దురాత్ము | నట్లు మనుజులఁ దినకుండుఁ; డడరి మనుజ భక్షణము సేసితిరయేని బకుని యట్లు| చత్తు’ రని రక్కసుల కెల్లఁ జాటె వినఁగ. |
307 |
| వ. | అంత నారాక్షసులు భీతు లై భీము సేసిన సమయంబున కొడంబడి నాఁటంగోలె నేకచక్రనివాసులకు నుపద్రవంబుఁ చేయనోడి; రట్లు భీముండు బకాసురుం జంపి, వానిం జంపుట జగద్విదితంబుగాఁ దత్కళేబరం బీడ్చుకొని వచ్చి, నగర ద్వార సమీపంబున వైచి, యందుల విప్రులకు సంతోషంబు సేసి, నిజ నివాసంబునకుం జని త ద్వృత్తాంతం బంతయుఁ దల్లికి సహోదరులకుం జెప్పి యున్నంత. | 308 |
| ఉ. |
వీఁ డొక మంత్రసిద్ధుఁ డగు విప్రుఁ; డసాధ్యబలున్ బకాసురున్ నేఁ డనిఁ జంపెనట్టె! యితనిం జని చూతమ యంచుఁ జెచ్చెరం బోఁడిగ వేత్రకీయమున భూసురు లాదిగ వచ్చి చూచి ర వ్వాఁడిమగంటిమిన్ వెలయువాని వృకోదరు నెల్లవారలున్. |
309 |
| క. |
అని యిట్లు పాండునృపనం | దనుల చరిత్రంబు సెప్పెఁ దా వైశంపా యనుఁడు జనమేజయున కని | జనవినుతచరిత్రపాత్ర! సౌజన్యనిధీ! |
310 |