| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - సప్తమాశ్వాసము |
| క. |
భువనోపప్లవసమయో | ద్భవ భానునిభప్రభావిభాసితుఁ డయి భా ర్గవుఁ డూరుదేశమున ను | ద్భవించె మహి వెలుఁగుచుండఁ బ్రభ నౌర్వుఁ డనన్. |
135 |
| మ. |
అమితౌజుం డగు వానిఁ జూచి కృతవీర్యామ్నాయజ క్షత్త్రియా ధములెల్లన్ హతదృష్టు లై కృపణతం దత్పర్వతారణ్యదే శములం గ్రుమ్మరుచుండి రంధు లయి; నిశ్శంకం బ్రతిక్రూరక ర్మములం దుద్యతు లైన వారికి నశర్మప్రాప్తి గాకుండునే. |
136 |
| వ. | అ ట్లా క్షత్రియు లందఱు నంధు లై భృగుపత్ని యొద్దకు వచ్చి, మాకు దృష్టిదానంబుఁ బ్రసాదింపవలయు నని వేఁడిన నది వారల కి ట్లనియె. | 137 |
| మధ్యాక్కర |
ఏను మీ దృష్టులు గొన్నదానఁ గా; నిక్కుమారుండు భానుతేజుండు మీచేఁ దనగురులు పరిభూతు లయిన దానికి నలిగి మీ పాపబుద్ధికిఁ దగ నిట్లు సేసె; వీని మే రెఱుఁగరె భార్గవకులము వెలిఁగించువాని. |
138 |
| వ. | ‘ఇ క్కుమారుండు నూఱు సంవత్సరములు నా యూరు గర్భంబున నుండి సకల వేదవేదాంగంబులు నేర్చినవాఁడు, మహాతపోనిధి; మీకుం గరుణించు నితనిం బ్రార్థింపుం’, డనిన, నాక్షత్త్రియులు నతిభక్తులై యౌర్వుం బ్రార్థించి తత్ప్రసాదంబున దృష్టులు వడసి చని; రంత నౌర్వుండు దన పితృబంధుజనులెల్ల నొక్కటం బరలోక గతు లగుటకు దుఃఖించి, సకలలోక ప్రలయార్థంబుగా ఘోరతపంబు సేయందొడంగిన. | 139 |
| చ. |
అతని తపంబు పెంపునఁ జరాచరసంభృతమైన విష్టప త్రితయము భీతిఁ బొందిన, ధృతిం బితృలోకనివాసు లైన త త్పితృవరు లెల్ల వచ్చి కడుఁ బ్రీతి నపాకృత గర్వు నౌర్వు న ప్రతిమతపోవిభాసిఁ గని పల్కిరి తద్దయు శాంతచిత్తులై. |
140 |