| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - సప్తమాశ్వాసము |
| వ. | ‘అయ్యా! నీ తపో మహత్త్వంబుఁ జూచి లోకంబు లెల్ల భయంపడియెడు; లోకానుగ్రహంబుగా నీరోషంబు విడువుము; మే మసమర్థుల మై క్షత్రియులచేత వధియింపం బడిన వారము గాము; ధనలుబ్ధుల మయి ధనంబు దాఁచినవారము గాము; ధనము వలసినం గుబేరుండు దాన మాకుఁ దెచ్చి యిచ్చుం; దపోమహత్త్వంబున మాకు నాయువు గడుంబెద్దయైన నిర్వేదించి మనుష్యలోకంబున నుండ నొల్లక యాత్మఘాతంబునం బుణ్యలోకంబులు లేమిం జేసి దానిం బరిహరించి యా క్షత్త్రియులతో వైరం బమర్చికొని తన్నిమిత్తంబున దేహంబులు విడిచితిమి; భార్గవులతేజంబు నొరులు పరిభవింప నోపుదురె? కావున నీవు దీనికింగా సర్వజనోప్రదవంబు సేయవల; దిది మా కభీష్టం’ బనిన నౌర్వుండు వారల కి ట్లనియె. | 141 |
| మత్తకోకిల |
మానితం బగు నా తపోమహిమం ద్రిలోక పరాభవం బేను జేయఁగఁ బూని చేసితి నిట్టి దొక్క ప్రతిజ్ఞ మున్, దీని నెట్టులు గ్రమ్మఱింతు మదీయ భాషిత మెన్నఁడు న్నేని మోఘము గాదు దిగ్ధరణీరవీందు లెఱుంగఁగన్. |
142 |
| క. |
మతి మఱచి యనిస్తీర్ణ | ప్రతిజ్ఞుఁ డగు వాని కోపపటుదహన మని ర్గత మయి వడి నరణి సము | త్థిత దహనమపోలె నాత్మదేహము నేర్చున్. |
143 |
| క. |
అలయక నిమిత్తజంబగు | నలుకను క్షమియించి శాంతుఁ డగు పురుషుం డి మ్ముల రక్షింపఁగ నోపునె | పొలుపుగ ధర్మార్థకామములు సమములుగన్. |
144 |
| తే. |
పాపు లై క్షత్త్రియాధముల్ భార్గవులకు | నట్లు హింస గావించు నాఁ డార్తనాద మూరుగర్భగతుండనై యుండి వినిన | నాఁడ కోప మసహ్యమై నన్నుఁ బొందె. |
145 |
| తే. |
ఎఱుక గలఁ డేని మఱి శక్తుఁ డేని యన్యు | లన్యులకు హింస గావించునపుడు దానిఁ బూని వారింపకున్న నప్పురుషుఁ డేఁగు | హింస చేసినవారల యేఁగుగతికి. |
146 |
| వ. | ‘కావున లోకంబులయందు సామర్థ్యంబు గలిగి పాప ప్రతిషేధంబు సేయని వారల నుద్దేశించి యలిగితి; నేనును మీ వచనంబతిక్రమింప నోడుదు; నఖిలలోకదహనోద్యతం బయిన నా కోపదహనంబు నిగృహీతం బయిన నన్ను దహించు; నేమి సేయు వాఁడ? మీరు సర్వలోకహితులరు; నాకును లోకంబులకును హితం బగునట్లుగా నుపదేశింపుఁ’ డనిన నౌర్వునకుం బితరు లి ట్లనిరి. | 147 |
| ఆ. |
జలములంద యుండు సర్వలోకంబులు | గాన నీ మహోగ్ర కలుష వహ్ని జలధిలోన విడిచి సత్యప్రతిజ్ఞుండ | వగుము; జలధి జలము నది దహించు. |
148 |
| వ. | ‘అనిన నౌర్వుండు పితృదేవతాదేశంబునఁ దన కోపానలంబు సముద్రంబులో వైచిన, నది యౌర్వానలంబు నా నశ్వముఖంబున నబ్ధిజలంబులఁ ద్రావుచుండు; నిది వేదంబులయందు వినంబడియెడుకథ గావున నీవును నౌర్వునట్ల ధర్మవిదుండవు భువనపరిభావి యైన యీ క్రోధంబు విడువు’ మనిన వసిష్ఠు వచనంబునం బరాశరుండు గోపం బుపసంహరించి, రాక్షసవినాశార్థంబుగా సత్త్రయాగంబు సేయం గడంగిన. | 149 |