| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - అష్టమాశ్వాసము |
| వ. | ఇట్లు పాండవులు ద్రుపదుపురంబున నఖిలరాజ్యవిభవసమన్వితు లయి యొక్క సంవత్సరం బుండునంత నంతయు నెఱింగి దుర్యోధనగూఢచారు లరిగి కర్ణదుశ్శాసనసౌబలసోమదత్తపరివృతుం డయి యున్న దుర్యోధనునకు మ్రొక్కి యి ట్లనిరి. | 9 |
| సీ. |
కర్ణశల్యులు మొదల్‌గాఁ గల భూపతు | లత్యంత బలవంతు లస్త్రవేదు లుద్ధతుల్ మోపెట్టనోపని చాప మ | శ్రమమున మోపెట్టి, చదలఁ దిరుగు నయ్యంత్ర మేసి, మీయందఱముందరఁ | గృష్ణఁ దోడ్కొని యొక్క కృష్ణవర్ణుఁ డెక్కటి రణములో నేపునఁ గానీను | నోడించి జయలీల నున్న యాతఁ |
|
| ఆ. |
డర్జునుండు; మఱిమహాబాహుబలమున | శల్యుఁ ద్రెళ్ల వైచి శత్రువరుల నెల్లఁ దల్లడిల్ల నెగచిన యాతండు | భీమసేనుఁ డమితభీమబలుఁడు. |
10 |
| చ. |
‘అనిమొన నట్లు దాఁకిన మహారథులన్ ధృతరాష్ట్రరాజనం దనుల బలాఢ్యులన్ దళితదర్పులఁ జేసినవారు ధర్శనం దనయము లుగ్రవీరు’ లని తద్విధమంతయు నేర్పడంగఁ జె ప్పిన విని కౌరవప్రభుఁడుఁ బెల్కుఱి తద్దయు దుఃఖితాత్ముఁ డై. |
11 |
| వ. | ‘అక్కట! పురోచనుం డొక్కరుండ లక్కయింట దగ్ధుం డయ్యెం గా కేమి; దైవానుకూల్యంబు లేక మానుషం బెంతయయ్యు నేమి సేయుఁ; బాండవు లేమిదైవసంపన్నులైరో యని వగచి, యీ యవసరంబున ద్రుపదు భేదించి పాండవుల నుత్సాదింపవలయు నె ట్లనిన. | 12 |
| ఉ. |
యాదవవృష్ణిభోజవరు లందఱుఁ బాండవపక్షపాతు; ల చ్చేదివిభుండు వారలన చేకొనువాఁడగు; వీరలెల్ల నా త్మోదయవృద్ధి పొంటెను దదున్నతిఁ గోరుదు; రట్లు గావునన్ భేదము సేయఁగావలయుఁ బెల్చన యందఱుఁ గూడకుండఁగన్. |
13 |
| వ. | అని దుర్యోధనుండు పాండవ పాంచాల విభేదనోపాయంబుఁ జింతించుచుండె; నంత విదురుండు పాండవాభ్యుదయంబును బాంచాలీస్వయంవరంబును దుర్యోధనాదులు భగ్నదర్పు లగుటయు విని సంతసిల్లి, పాండవులు ద్రుపదరాజపుత్త్రిం బెండ్లి యై ద్రుపదుపురంబున సుఖంబున్న వా రని ధృతరాష్ట్రునకుం జెప్పిన నతం డి ట్లనియె. | 14 |
| ఆ. |
యజ్ఞసేనుకూఁతు నభిజాత నాతని | యజ్ఞవేది నుదిత యయినదాని ననఘవిధి వివాహ మయి పాండునందనుల్ | మిగుల మిత్రబలసమృద్ధు లయిరి. |
15 |
| క. |
కొడుకుల యభ్యుదయము విని | కడు సంతస మయ్యె నిపుడు; కౌరవకుల మే ర్పడ వెలిఁగె నెల్లరాజుల | నొడిచిన భుజవీర్యమున మహోత్సాహమునన్. |
16 |
| వ. | అని విదురునకు మనఃప్రియంబుగాఁ బలికి, యంతఃపురంబునకుం జని యంతస్తాపం బేర్పడకుండ నుండునంత; గర్ణ దుర్యోధనులు ధృతరాష్ట్రు పాలికిం జని యి ట్లనిరి. | 17 |