| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - అష్టమాశ్వాసము |
| క. |
రేయును బగలును విదురుఁడు | నీయొద్దన యునికిఁజేసి నేరము పలుకన్ మాయిష్టం బెఱిఁగింపఁగ | ధీయుత! యెడఁ గంటి మిన్ని దివసంబులకున్. |
18 |
| క. |
విదురుఁడు పాండవహితుఁ డని | మొదలన యెఱిఁగియును నతి విమోహంబున న వ్విదురువచనంబ నిలుపుదు | హృదయంబున; నతఁడు పెద్దయిష్టుఁడు మీకున్. |
19 |
| వ. | అనిన వారలకు ధృతరాష్ట్రుం డి ట్లనియె. | 20 |
| సీ. |
‘పలుకులఁ జెయ్వులఁ బాండవులకుఁ బ్రీతి | గలయట్ల యుండుదుఁగాని నాదు హృదయంబు విదురున కెన్నండు నెఱిఁగింప | నేను మీతలఁచిన యివ్విధంబ తలఁచుచు నుండుదు; దైవసంపద గల | వారలఁ బాండవవరుల నేమి సేయంగ నగు? నెద్ది చెప్పుఁ డిష్టం బింక?’ | ననిన విచిత్రవీర్యాత్మజునకు |
|
| ఆ. |
దుష్టచేష్టితుండు దుర్యోధనుం డిట్టు | లనియెఁ ‘జిత్తగింపు మవనినాథ! పాండురాజసుతులఁ బాంచాలపతియొద్ద | నుండకుండఁ జేయు టుచిత మిపుడు’ |
21 |
| వ. | అది యె ట్లనినం బుత్త్ర మిత్త్ర బాంధవ బలసంపన్నుం డైన ద్రుపదునొద్దఁ బాండవు లుండువా ‘రైన వారలం గృష్ణబలదేవులు యదువృష్ణిభోజాంధకవర్గములతో వచ్చి కూడిన నెవ్వరు సాధింపనోపరు; గావున, నెడసేయక ద్రుపదుండు పాండవుల విడుచునట్లుగా భేదింత; మొండె, వలనుగలవారలం బంచి కౌంతేయమాద్రేయులను దమలో విరక్తు లగునట్లుగాఁ జేయింత; మొండె నతిలలితప్రమదాజనంబులఁ బ్రత్యేకంబ యేవురకుం బ్రయోగించి ద్రౌపదివలన విరక్తిఁ బుట్టింత; మొండె, నేవురకు నొక్కతియ యా లగుట కష్టం బని ద్రోవదిఁ బాండవులవలన విగత స్నేహఁ గావింత; మొండె, నుపాంశుప్రయోగంబుల భీము వధియించి తక్కినవారల బలహీనులం జేయుదము. | 22 |
| ఆ. |
గాడ్పుచూలి పిఱుఁదుఁ గావంగ నర్జును | నోర్వ నమరులైన నోప రాజి; నతఁడు నిహతుఁ డగుడు నశ్రమంబునఁ | బార్థు నొక్కరుండ కర్ణుఁ డోర్వ నోపు. |
23 |
| వ. | ‘ఈ యుపాయంబులలో నెయ్యది యుచితంబును నపగతదోషంబును నదీర్ఘసూత్రంబును నగు నట్టి దానిం జెచ్చెర ననుష్ఠించు నది’ యనినఁ గర్ణుం డి ట్లనియె. | 24 |
| సీ. |
ఆర్యవృత్తుండు రాజాన్వయసమ్మతుఁ | డభిమతసంబంధుఁ డయినవాఁడు గుణవంతు లగుచున్న కొడుకులు గలవాఁడు | పాంచాలుఁ డేల యప్పాండుసుతుల వినయసంపన్నుల విడుచువాఁడగు?; మఱి | పాండునందను లేకపత్నియంద కర మనురక్తులు గావునఁ దమలోన | నేల భేదిల్లుదు?; రెన్నఁడయ్యు |
|
| ఆ. |
నొక్కసతికిఁ బతులు పెక్కండ్రు రగు టిది | సతులకోర్కిగాన యతివ కృష్ణ సుందరాంగి వారియం దేల యపరక్త | యగు మనోముదంబుఁ దగులుఁ గాక. |
25 |
| వ. | మఱి భీమసేనుండు దొల్లి మీచేసిన యుపాంశువధల నేమి యయ్యె? నింకను నట్ల కావున నీ యుపాయప్రయోగంబు లన్నియు నుడిగి యిప్పుడ పాండవులయందు విక్రమంబు ప్రయోగించుట కార్యంబు. | 26 |
| చ. |
ఘన మగు విక్రమంబునన కాదె జగత్త్రితయంబుఁ బాకశా సనుఁడు జయించె; భూతలము సర్వము మున్ భరతుండు విక్రమం బునన జయించె; విక్రమము భూరి యశఃప్రియు లైన రాజనం దనులకు సర్వసాధనము, ధర్మువు శత్రునిబర్హణంబులన్. |
27 |
| వ. | ‘కావునఁ జతురంగ బల సాధనసన్నద్ధుల మయి యుద్ధంబునం బాంచాలు భంజించి పాండవుల నొండుగడ నుండనీక తోడ్కొనితెత్త’ మనినఁ గర్ణుపలుకు లాకర్ణించి ధృతరాష్ట్రుం ‘డిది యకార్యం బగు; నయినను మతిమంతులతో విచారించి చేయుద మని భీష్మద్రోణవిదురశల్యకృపాశ్వత్థామసోమదత్తాదులం బిలువంబంచి యంతయు నెఱింగించిన భీష్ముండు దుర్యోధనుం జూచి యి ట్లనియె. | 28 |
| మత్తకోకిల |
ధీరు లౌ ధృతరాష్ట్రపాండు లతిప్రశస్తగుణుల్ ప్రసి ద్ధోరుకీర్తులు; నాకు నిద్దఱు నొక్కరూప; తలంపఁగా వీరు వా రను నట్టిబుద్ధివిభేద మెన్నఁడు లేదు గాం ధారిపుత్త్రశతంబునందుఁ బృథాతనూజులయందునున్. |
29 |