| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - అష్టమాశ్వాసము |
| వ. | అ ప్పాండవులతోడి విగ్రహంబుసేఁత కెన్నండును నొడంబడనేరఁ; బితృపైతామహం బయిన రాజ్యంబునకు నీయట్లు వారు నర్హులు; గావున వారికి నర్ధరాజ్యం బిచ్చిన నీకును నీ బాంధవులకును లోకంబులకును బ్రియం బగు; నట్లు గానినాఁ డపకీర్తి యగుఁ; గీర్తి నిలుపుటయ కాదె రాజులకు జన్మఫలంబు. | 30 |
| ఆ. |
కీర్తి లేనివానికిని జీవనంబు ని | రర్థకంబ చూవె! యవనిమీఁద నిత్య మయిన ధనము నిర్మల కీర్తియ; | యట్టి కీర్తి వడయు టశ్రమంబె? |
31 |
| క. |
ఇలఁ గీర్తి యెంత కాలము | గలిగి ప్రవర్తిల్లె నంతకాలంబును ని త్యుల కారె కీర్తి గల పు | ణ్యులు; కీర్తివిహీనుఁ డెందునుం బూజ్యుండే. |
32 |
| వ. | ‘కీర్తియు నపకీర్తియు జనులకు స్వర్గ నరక నిమిత్తంబులు గావున, నపకీర్తి పరిహరించి, కీర్తిం బ్రతిష్ఠించి, పైతృకం బగు రాజ్యంబు పాండవుల కిచ్చి, వారితోడ బద్ధప్రణయుండవయి కీర్తి నిలుపు’ మనిన భీష్ముపలుకులకు సంతసిల్లి ద్రోణుండు దుర్యోధనున కి ట్లనియె. | 33 |
| చ. |
బహుగుణ ముత్తమోత్తమము పథ్యము ధర్మ్యము సాధుసమ్మతం బహిత బలప్రమాథివిపులార్థయుతం బగుటన్ భవత్పితా మహువచనంబుఁ జేకొనుము; మానుగ వారలతోడ నీవు వి గ్రహ మొనరింప నేమిటికిఁ గౌరవసౌబలకర్ణశిక్షలన్. |
34 |
| మ. |
విలసద్ధర్మవిశుద్ధవృత్తులు వయోవృద్ధుల్ కుశాగ్రీయబు ద్ధులు మధ్యస్థులు కార్యనిర్ణయసమర్థుల్ మానమాత్సర్యదూ రులు నాఁ జాలినవారిపల్కులకు వైరుద్ధ్యంబు గావించున జ్ఞులు భూనాథున కాప్తులున్ సఖులు నై శోషింతు రత్యంతమున్. |
35 |
| చ. |
తనరుచు దైవయుక్తి మెయి ధర్మువు సత్యముఁ దప్పకున్న య య్యనఘుల పైతృకం బయిన యంశము మిన్నక వజ్రపాణి కై నను గొనఁబోలు నయ్య కురునందన! పాండుతనూజు లున్న వా రని విని వారికిం దగు ప్రియం బొనరింపక యున్కి ధర్మువే? |
36 |
| వ. | ‘వారితో విగ్రహించుట కార్యంబు గాదు; ‘కావునఁ బాండవద్రుపదధృష్టద్యుమ్నకుంతీద్రౌపదులకుఁ బ్రియపూర్వకంబున నుచితభూషణాంబరావళులు వేఱు వేఱ యిచ్చిపుచ్చి, పాండవుల నిందులకుఁ దోడ్కొనివచ్చువారుగా దుశ్శాసనవికర్ణ ప్రభృతుల సమకట్టి పంపు’ మనిన ద్రోణుపలుకు లవకర్ణించి కర్ణుం డి ట్లనియె. | 37 |
| తే. |
ముదుసళులు దమ కిమ్ముగాఁ జదివికొండ్రు | గాక పతులకు హిత మగు కర్జ మేల యొలసి చెప్పుదు? రహితుఁ గలపికొనుట | ధర్ము వని; రిది నయవిరుద్ధంబు గాదె? |
38 |
| వ. | ‘మంత్రులు దమ తమ బుద్ధిదోషంబులు నెట్లునుం బలుకుదురు. వారల సాధుత్వంబును నసాధుత్వంబును నెఱుంగవలయు; నె ట్లనినఁ దొల్లి నితంతు వను మగధరాజు వికలేంద్రియవర్గుం డయి శ్వాసమాత్రంబ తక్కి రాజ్యతంత్రంబునం దసమర్థుం డై యున్న నాతనిమంత్రి యేకప్రధానుం డయి రాజ్యతంత్రం బెల్లఁ దనవశంబ యగుటంజేసి వాని నవమానించి తదీయరాజ్యవిభవం బెల్లఁ జేకొనియె; వాఁడును విక్రమహీనుం డయి రాజ్యంబు గోల్పడియెం; గావున మంత్రులు హితులపోలె నుండి యహితం బాచరింతురు; మీ యిద్దఱపలుకులు మాకుం జూడ నహితంబు’ లనిన నలిగి వానికి ద్రోణుం డి ట్లనియె. | 39 |
| క. |
ఉడుగక యే మహితముఁ బలి | కెడు వారము; నీవు హితవు క్రియ గొనఁగాఁ బ ల్కెడు వాఁడవు; మాకంటెను | గడు హితుఁడవు నీవ కావె కౌరవ్యులకున్. |
40 |
| క. |
నీకఱపుల నిక్కురుకుల | మాకులతం బొందు టేమి యాశ్చర్యము? సౌ మ్యాకృతులు గానివారల | వాకులు శిక్షలు నుపద్రవంబుల కావే! |
41 |
| వ. | అనుచున్న సమయంబున నయ్యిద్దఱ వారించి విదురుండు ధృతరాష్ట్రున కి ట్లనియె. | 42 |
| సీ. |
ధర్మార్థవిత్తముల్ తథ్యవాదులు వయో | వృద్ధులు మధ్యస్థవిమలమతులు ద్రోణగాంగేయులు దురితవిదూరులు | ని న్నెద్దిగఱపిరి నెమ్మితోడ దానిన చేయుట ధర్మువు; వారల | కంటె హితుల్ నీకుఁ గలరె యొరులు; దుర్యోధనుండును దుశ్శాసనుండును | గర్ణుండు శకునియుఁ గరము బాలు; |
|
| ఆ. |
రెఱుఁగ రిదియు ధర్ము విది యధర్మం బని; | యట్టివారిపలుకు లాదరించి వినక పాండుసుతుల వేగ రావించి వా | రలకుఁ బ్రీతి నర్ధరాజ్య మిమ్ము. |
43 |
| మ. |
తమకుం దార యజేయు లెవ్వరికి దోర్దర్పంబునన్, దానిపై శమితారాతి బలుండు వారలకుఁ బాంచాల ప్రభుం డిప్డు సు ట్టము దా నయ్యెఁ; దదాత్మజుండయిన ధృష్టద్యుమ్నుడున్ వారితో సమవీర్యుం డొడఁగూడె నిష్ట సఖుఁ డై సంబంధబంధంబునన్. |
44 |
| మ. |
బలదేవాచ్యుతసాత్యకుల్ దమకు నొప్పన్ మిత్రులుం గూర్చు మం త్రులుఁగా దైవము మానుషంబుఁ గల నిత్యుల్, నీకు దుర్యోధనా దులకంటెం గడుభక్తు లెంతయు వినీతుల్, వీరు లప్పాండుపు త్త్రులు నీపుత్త్రుల కారె! వారిఁ దగునే దూరస్థులం జేయఁగన్. |
45 |
| ఉ. |
ఆహవభూమిలోనఁ బరమార్థము పార్థుఁడు వైరివాహినీ వ్యూహము వ్రచ్చుచోట మఘవుండును వానికి మార్కొనంగ ను త్సాహముసేయఁ డన్న; లఘుసారు లధీర లసాహసుల్ నిరు త్సాహులు ద్రోహులై యెదిరి చత్తురొ మందురొ మానవేశ్వరా! |
46 |
| ఉ. |
ఆయతబాహుఁ డాతనికి నగ్రజుఁ డగ్రణి పోరులందు నా గాయుతసత్త్వుఁ డుద్ధతయుగాంతకృతాంతనిభుండు భీముఁ డ వ్వాయుజసవ్యసాచుల నవార్యబలోన్నతిఁ బోలుచున్న మా ద్రేయు లజేయు లెవ్వరికి దేవసముల్ సమరాంతరంబునన్. |
47 |
| క. |
తమ్ములయట్టుల తనకు వ | శమ్మయి ధర్మువును ధృతియు సత్యముఁ గారు ణ్యమ్మును నొప్పఁగఁ బేర్మి ని | జమ్ముగ మను ధర్మజున కసాధ్యము గలదే! |
48 |
| వ. | ‘వారల బలపరాక్రమంబు లెల్లవారికి దృష్టపూర్వంబుల; యట్టివారితోడ విగ్రహంబు సేయు దుర్బుద్ధులుం గలరె? నీపుణ్యమ్మున నమ్మహాత్ములు జననీసహితంబు లక్కయింట బ్రతికిరి; నీయందుఁ బురోచనదిగ్ధం బయిన దుర్యశః పంకంబుఁ బాండవానుగ్రహజలంబులం జేసి కడిగికొనుము; దుర్యోధనాపరాధంబున నఖిల మహీప్రజకు నపాయం బగు నని తొల్లియు నీకుం జెప్పితి; నట్లు గాకుండ రక్షింపు’ మనిన ధృతరాష్ట్రుండు విదురున కి ట్లనియె. | 49 |
| క. |
నీవును భీష్ముఁడు ద్రోణుఁడు | భూ వినుత విశుద్ధ ధర్మబుద్ధుల రగుటన్ మీ వచనమున కవజ్ఞత | గావింపఁగ నంత కార్యగతి మూఢుఁడనే? |
50 |