| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - అష్టమాశ్వాసము |
| వ. | అని యుధిష్ఠిరుండు వారి యనుమతంబు వడసి, తమ్ములు దానును హస్తిపురంబునకుఁ బోవ నిశ్చయించి, ద్రుపదు వీడ్కొని ప్రయాణోన్ముఖుం డయ్యె; నిట్లు విదురుండు పాండవులఁ బాంచాలిని గుంతీదేవినిం దోడ్కొని వాసుదేవ ధృష్టద్యుమ్ను లపరిమిత సేనాసమన్వితు లై తోడ రాఁగా వచ్చునంత, వారలరాక విని ధృతరాష్ట్రుండు వికర్ణ చిత్రసేన ద్రోణ కృపాచార్యుల నెదురు పుత్తెంచినం దత్‌సైన్యసమేతులయి మహోత్సవంబుతోఁ బాండవులు గజపురప్రవేశంబు సేయునప్పుడు వారలం జూచి. | 62 |
| సీ. |
పుర జను లెల్లను గర మనురక్తు లై | ‘ధర్మస్వరూపుఁ డీ ధర్మతనయుఁ డనుజులుఁ దానును జనుదెంచెఁ; బాండుభూ | జనపతి జీవించి మనలఁ గావఁ బ్రీతితోఁ దా నిప్పు డేతెంచె, మే లయ్యె; | నిమ్మహాత్ములకు దైవమ్ముఁ బురుష కారంబుఁ గలుగంగ ధారుణీరాజ్యంబు | వాయునే యాపదల్ వాయుఁగాక; |
|
| ఆ. |
దాన హోమ జప విధానముల్ మన కివి | గలవయేని ధరణివలయరాజ్య మింద యుండి ధర్మనందనుఁ డొనరించు | చుండుఁ గావుతమ యఖండితముగ. |
63 |
| వ. | అని పౌరులెల్ల దీవించుచుండఁ బౌరవకులనందను లయిన పాండునందనులు వచ్చి, భీష్మధృతరాష్ట్రాది కురువృద్ధులకు మ్రొక్కి, సకలజనానురాగం బొనరించుచు దుర్యోధనాదులతోఁ గలసి యెప్పటియట్ల రాజ్యవిద్యా వినోదంబుల నేను సంవత్సరంబు లుండు నంత, నొక్కనాఁడు ధృతరాష్ట్రుండు భీష్మవిదురద్రోణ దుర్యోధనాదుల సమక్షంబునఁ బాండవుల కి ట్లనియె. | 64 |
| ఆ. |
సర్వలోక కర్మసాక్షి, యీకృష్ణుండు | సాక్షి గాఁగ మీకు సకలవృద్ధ రాజు లొద్ద నర్ధరాజ్య మిచ్చితిఁ బాండు | రాజవిభవ మెల్ల రమణఁ గొనుఁడు. |
65 |
| వ. | అని ధర్మరాజు నభిషిక్తుం జేసి. | 66 |
| క. |
‘నెమ్మిఁ జని ఖాండవప్ర | స్థమ్ము నివాసమ్ముఁ జేసి తద్దయు ననురా గ మ్మెసఁగ నుండుఁ డందుఁ ది | రమ్ముగ’ నని పనిచెఁ బాండురాజాత్మజులన్. |
67 |
| వ. | పాండవులును ధృతరాష్ట్రుశాసనంబునను, భీష్మాదులయనుమతంబునను వాసుదేవసహితు లయి ఖాండవప్రస్థమ్మునకుం జని రంత. | 68 |