| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - అష్టమాశ్వాసము |
| ఉ. |
ధన్యుల కా సుభద్రకు శతక్రతుపుత్త్రున కుద్భవించె స మ్మాన్య యశుండు పుత్త్రుఁ డభిమన్యుఁడు వైన్యనిభుం డనన్యసా మాన్యపరాక్రమప్రబలమాన్యుఁడు పుణ్యచరిత్రుఁ డన్యరా జన్యభయంకరుండు రణశౌర్యుఁడు పాండవవంశకర్త యై. |
224 |
| చ. |
సుతజననోత్సవంబున విశుద్ధయశుండు యుధిష్ఠిరుండు సం భృతహృదయప్రమోదుఁ డయి పెంపున నిచ్చె సువర్ణభూషణ ప్రతతులు గోధనాయుతము బ్రాహ్మణముఖ్యులకున్ నిరంతర వ్రతులకు వేదవేదులకు వారిజసంభవునట్టివారికిన్. |
225 |
| వ. | ఇ ట్లుదయించిన యభిమన్యుండు దల్లిదండ్రులకు సకల జనులకు నానందం బొనరించుచు ధౌమ్య నిర్మిత జాతకర్మ చౌలోపనయనుం డయి పెరుఁగుచు. | 226 |
| మత్తకోకిల |
ఆదిఁగోలెను గృష్ణుచే దయ నావృతుం డయి ధౌమ్యుతో వేద మంగయుతంబుగాఁ జదివెన్, ధనంజయుతో ధను ర్వేద మిమ్ముగ నభ్యసించెఁ; బ్రవీరవైరిపతాకినీ భేదమార్గము లెల్ల నేర్చె నభేద్యవిక్రమసంపదన్. |
227 |
| వ. | అంత ద్రుపదరాజనందనయుం గ్రమంబునఁ బాండురాజనందనులవలనఁ బ్రతివింధ్య శ్రుతసోమ శ్రుతకీర్తి శతానీక శ్రుతసేను లనువారిఁ బంచోపపాండవులను సుపుత్త్రులం బడసిన. | 228 |
| క. |
సుతవంతు లయి విశుద్ధ | శ్రుతనయవంతు లయి పాండుసుతు లతులగుణా న్వితులు జగజ్జన నుత వి | శ్రుతులు మహారాజ్యలీల సుఖ మున్నంతన్. |
229 |
| చ. |
ఉరుతర దావపావక శిఖోత్కలిత శ్వసనంబులున్, సితే తరగతి తీవ్రతిగ్మకరధామ సహస్రములున్, బహుప్రవా హరహితనిమ్నగాతతులు నై, కడుదీర్ఘము లై, నిదాఘవా సరములు సర్వజీవుల కసహ్యము లయ్యెను దారుణంబు లై. |
230 |
| వ. | అట్టి ఘర్మ దివసంబులు సహింప నోప కర్జునుం డొక్కనాఁడు కృష్ణున కి ట్లనియె. | 231 |
| చ. |
జలరుహనాభ! రమ్యగిరిసానువనంబుల వేఁటలాడుచున్ జలుపుద మీనిదాఘదివసంబుల నీవును నేను నున్మిష న్నలిన రజస్సుగంధి యమునాహ్రద తుంగ తరంగ సంగతా నిలశిశిరస్థలాంతరవినిర్మితనిర్మలహర్మ్యరేఖలన్. |
232 |
| వ. | అని పురందరనందనుండు గోవిందు ననుమతంబు వడసి మిత్రామాత్యభృత్యసమేతులయి యిద్దఱు నరిగి యథారుచి ప్రదేశంబుల విహరించుచు నొక్కనాఁడు ఖాండవవనసమీపంబున నొక్కచందనలతాభవన చంద్రకాంతవేదికయందు మందశీతలసురభిమారుతం బనుభవించుచు నిష్టకథావినోదంబుల నుండునంత. | 233 |