| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - అష్టమాశ్వాసము |
| మాలిని |
అసితపథుఁడు విప్రుం డై మహాశ్రాంతలీలన్ మసృణకపిలకేశశ్మశ్రు లొప్పంగఁ దేజం బెసఁగ ముదముతో నయ్యిద్దఱన్ డాయవచ్చెన్ వసునిభు లగు వారిన్ వాసవిన్ వాసుదేవున్. |
234 |
| వ. | వారు న వ్విప్రు నతిభక్తిఁ బూజించిన, వారలకు నవ్విప్రుం డి ట్లనియె. | 235 |
| క. |
ఏ నమితభోజనుండ న | హీనాగ్నిబలుండ నాకు నిష్టాన్నము స మ్మానముగఁ బెట్టుఁ డోపుదు | రేని సుతృప్తుండ నగుదు నే న ట్లయినన్. |
236 |
| వ. | అనిన ‘నీ కెద్దిభోజనం బిష్టంబు, దానిన పెట్టెద’ మడుగు; మనిన వారికి నవ్విప్రుం డి ట్లనియె. | 237 |
| ఆ. |
అగ్ని నేను; నాకు నాహార మయ్యింద్రు | ఖాండవంబు; దీనిఁ గాల్పఁ గడఁగి యెగువఁ బడితి ముంద రింద్రుపంచిన మహా | దారుణాంబుధరశతంబుచేత. |
238 |
| వ. | తక్షకుం డను పన్నగేంద్రుఁ డింద్రున కిష్టసఖుం డయి ఖాండవంబునం దుండుటంజేసి దీని నమృతంబు రక్షించున ట్లతిప్రయత్నంబున నింద్రుండు రక్షించుకొనియుండు; నది నిమిత్తంబుగా సర్వసత్త్వంబులు నిందు సుఖం బుండు; మీరు మహాసత్త్వుల రఖిలాస్త్రవిదుల; రమరేంద్రుండు గావించువిఘాతంబులు మీయస్త్రబలంబున వారింపనోపుదు; రేనును దీని ననాకులంబున నుపయోగించి కృతార్థుండ నగుదు. | 239 |
| క. |
అని యగ్నిదేవుఁ డయ్య | ర్జునదామోదరుల శౌర్యశోభితులఁ బ్రియం బునఁ బ్రార్థించెను బలసూ | దనరక్షితఖాండవప్రదాహోత్సుకుఁ డై. |
240 |
| వ. | అనిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె. | 241 |
| ఆ. |
‘ఏమి కారణమున నింద్రుఖాండవ మగ్ని | దేవుఁ డట్లు గాల్పఁ దివిరె? దీని విప్రముఖ్య నాకు వినఁగ వేడుకయయ్యె; | నెఱుఁగఁ జెప్పుమయ్య యిదియు’ ననిన. |
242 |