| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము |
| వ. | అని సంతుష్ట హృదయుండై యున్నంత. | 336 |
| సీ. |
హరుచేత సంప్రాప్తవరుఁడయ్యె నరుఁ డని | యెఱిఁగి యింద్రుండు ధనేశ ధర్మ వరుణాశ్వినులతోడ సురగణ సహితుఁడై | దివ్యవిమానముల్ దివమునందు వెలుఁగంగఁ గౌరవకులవీరు పాలికి | వరదుఁ డై గరుణతో వచ్చె; నట్టి యవసరమ్మున ఘనరవగభీరం బైన | మధురవాక్యమున ధర్మప్రభుండు |
|
| ఆ. |
ప్రీతి నిట్టులనియె బీభత్సునకు ‘ధర్మ | నిత్య! పాండుపుత్త్ర! నీకు మెచ్చి వరము లిచ్చు వేడ్క వచ్చిరి నెయ్యురై | యమరనాథుఁ దొట్టి యమరులెల్ల. |
337 |
| వ. | వీరలం జూడు’ మని దివ్యదృష్టి యిచ్చి ‘నీవు నరుండను పూర్వఋషివి; బ్రహ్మనియోగంబున మనుష్యుండవై యుత్తమ క్షత్త్రియకులంబున నుద్భవిల్లితి; మఱి సూర్యాంశజుండైన కర్ణుని, దేవ దైత్య దానవ గంధర్వ యక్ష రాక్షసాంశజులైన రాజులను వధియింతు; నీ కక్షయకీర్తి యగు’ నని దండధరుం డప్రతివారణం బైన దండంబు విధియుక్తంబుగా నిచ్చిన. | 338 |
| క. |
ఘోరారిదారుణము లగు | వారుణపాశంబు లిచ్చె వరుణుఁడు, మఱి కౌ బేరాస్త్ర మిచ్చె నపుడు కు | బేరుఁడు విజయునకు నహితభేదికిఁ బ్రీతిన్. |
339 |
| వ. | ఇట్లు దివ్యపురుషుండైన పార్థుండు లబ్ధదివ్యదృష్టియై యమర్త్యరూపధరులైన పితృదేవతలతోడం దనముందట నిలిచిన మహానీలవర్ణుండైన వైవస్వతుని, వైడూర్యవర్ణుండై యర్ణవ నదీ శైల సేవింతుడైన వరుణేశ్వరుం, జాంబూనద వర్ణుండై యక్ష రాక్షస గణంబుతో నున్న కుబేరునిం జూచి, వారివలన దివ్యాస్త్రంబులు వడసి వాక్పుష్ప ఫల జలంబుల నందఱం దృప్తులం జేసి వెండియు. | 340 |
| ఆ. |
అమరగణసమేతు నైరావణారూఢు | వజ్రధరుఁ ద్రిలోకవంద్యు నింద్రు వృత్రశత్రు నమరవిభుఁ జూచి యెద నాది | మునివరుండు నరుఁడు ముదము నొందె. |
341 |
| ఉ. |
ఇందుధరప్రసాదమున నిష్టవరంబులు గాంచి బాంధవా నంద విధాయి యైన నిజనందును దండితశత్రు సద్గుణా నందితుఁ జూచి వేడ్క నయనంబులు వేయును గన్న తత్ఫలం బందెఁ బురందరుండు పరమాద్భుత సమ్మదపూరితాత్ముఁడై. |
342 |
| వ. | ఇట్లు దేవేంద్రుండు ధనంజయుం జూచి సంతసిల్లి ‘నీవు పరమేశ్వరువలనఁ బరమసిద్ధి వడసితివి; దేవకార్యంబు దీర్ప నర్హుండవు గాన నా రథంబుఁ బుత్తెంచెద; నమరావతికి రమ్ము. నీకు దివ్యాస్త్రంబు లంద యిచ్చెద’ నని దేవేంద్రుండు దేవగణంబులతో నమరావతికి నరిగె; నర్జునుండును దద్రథాగమనంబు ప్రతీక్షించుచుండు నంత. | 343 |
| సీ. |
వారిదమార్గంబువలన మహానీల | వైజయంతీ విభవంబు వెలయ, నాబద్ధవివిధరత్నావళిప్రభఁ జేసి | రమ్యమై రోదోంతరంబు వెలుఁగ, నురునేమిరవమున నుర్వరాధర దరీ | ముఖములు ప్రతిశబ్ద ముఖరితంబు లగుచుండ, నానావిధాయుధంబులు దాల్చి, | యశనివిద్యుత్సహస్రాభిశోభి |
|
| ఆ. |
తాభ్రసదృశమై మహాజవాశ్వాయుత | వాహ్యమాన మైన వరరథంబు మఘవునాజ్ఞఁ జేసి, మాతలి యుక్తమై | యింద్రతనయుఁ డున్నయెడకు వచ్చె. |
344 |
| వ. | మాతలియు నర్జునుఁజూచి ‘సురాసురకిరీటతటఘటితరత్నప్రభాభాసురపదుండైన మహేంద్రుండు మీయయ్య భవద్దర్శనం బపేక్షించి నిన్ను నమరావతికి రాఁబనిచె, రాజసూయాశ్వమేధ శతంబులం జేసిన వారికైనను దుర్లభం బీరథంబు, దీని నెక్కు’ మనిన నర్జునుండును గంగాస్నాన పవిత్రీకృత గాత్రుండై దేవఋషి పితృతర్పణంబులు చేసి మాతలి ప్రయుక్తంబైన యా దివ్యరథం బెక్కి. | 345 |