పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము
అర్జునుఁడు పరమేశ్వరుని స్తోత్రము సేయుట (సం. 3-40-56)
దండక. ‘శ్రీకంఠ, లోకేశ, లోకోద్భవస్థాన సంహారకారీ, పురారీ, మురారి ప్రియా, చంద్రధారీ, మహేంద్రాది బృందార కానంద సందోహ సంధాయి, పుణ్యస్వరూపా, విరూపాక్ష, దక్షాధ్వరధ్వంసకా, దేవ, నీదైన తత్త్వంబు భేదించి బుద్ధిం బ్రధానంబు గర్మంబు విజ్ఞాన మధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం బంచు నానాప్రకారంబులన్‌ బుద్ధిమంతుల్‌ విచారించుచున్‌ నిన్ను భావింతు రీశాన, సర్వేశ్వరా, శర్వ, సర్వజ్ఞ, సర్వాత్మకా, నిర్వికల్ప ప్రభావా, భవానీపతీ, నీవు లోకత్రయీవర్తనంబున్‌ మహీవాయుఖాత్మాగ్ని సోమార్కతోయంబులం జేసి కావించి సంసార చక్రక్రియా యంత్ర వాహుండవై తాదిదేవా, మహాదేవ, నిత్యంబు నత్యంత యోగస్థితిన్‌ నిర్మలజ్ఞాన దీప ప్రభాజాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్‌ జితక్రోధరాగాదిదోషుల్‌ యతాత్ముల్‌ యతీంద్రుల్‌ భవత్పాద పంకేరుహధ్యాన పీయూష ధారానుభూతిన్‌ సదా తృప్తులై నిత్యులై రవ్యయా, భవ్య, సేవ్యా, భవా, భర్గ, భట్టారకా, భార్గ వాగస్త్య కుత్సాది నానామునిస్తోత్ర దత్తావధానా, లలాటేక్షణోగ్రాగ్ని భస్మీకృతానంగ, భస్మానులిప్తాంగ, గంగాధరా, నీ ప్రసాదంబునన్‌ సర్వగీర్వాణ గంధర్వులున్‌ సిద్ధసాధ్యోరగేంద్రాసురేంద్రాదులున్‌ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులై రీశ్వరా, విశ్వకర్తా, సురాభ్యర్చితా. నాకు నభ్యర్థితంబుల్‌ ప్రసాదింపు కారుణ్యమూర్తీ! త్రిలోకైక నాథా! నమస్తే నమస్తే నమః’. 324
వ. అని యిట్లు స్తుతియించి కృతాంజలి యై కిరీటి వెండియు నిట్లనియె. 325
క. ‘ఎఱుకని యెఱుఁగక నీకున్‌ | మఱకువ నెదిరితిని; దీని మఱువుము; నన్నుం
గఱకంఠా! క్షమియింపుము; | నెఱి నెవ్వరి కెఱుఁగ నగునె నీ చరితంబుల్‌.’
326
వ. అనిన యప్పార్థుం గరుణారస ప్రీతి విస్తారిత విలోకనామృతమ్మున సంతర్పితుం జేసి నగుచు నీశ్వరుండు వాని చేయి పట్టుకొని ‘ధనంజయా! నీ చేసిన వ్యతిక్రమంబు క్షమియించితి; నతిమానుషంబైన నీ పరాక్రమంబునకు మెచ్చితిఁ; బూర్వజన్మంబున నీవు నరుండను దేవర్షివి; నారాయణ సఖుండవు; నరనారాయణు లనంగా మీరిద్దఱు బదరీవనంబున ననేకాయుతవర్షంబులు తపంబుఁ జేసిన మహావీర్యవంతులరు; మీ తేజంబున జగంబులు రక్షితంబు లగుచున్నయవి; యిగ్గాండీవమ్ము దొల్లియు నీయదియ; దీనన చేసి శక్రాభిషేకమ్మునాఁ డసురుల జయించి; తది యిప్పు డక్షయశరధులతోడి మదీయమాయాగ్రస్తంబయ్యె నీగాండీవమ్మును నక్షయశరధులు నీ కిచ్చితిం గొను; మింక నీకిష్టంబైన వరమ్ము వేఁడు మిచ్చెద’ ననిన నర్జునుం డిట్లనియె. 327
క. ‘త్ర్యంబక! నాకు నభీష్ట వ | రంబుఁ బ్రసాదించెదేని రౌద్రము దివ్యా
స్త్రంబనఁ బరఁగిన పాశుప | తంబుఁ బ్రసాదింపు మిందుధర! దయతోడన్‌.
328
వ. ఇదియును బ్రహ్మ శిరంబను నస్త్రంబును యుగాంతకాలంబునందుఁ బ్రయుక్తమ్ములై జగత్సంహారమ్ము సేయు; దీనివలన నభిమంత్రితమ్ములై యనేక శత సహస్ర సంఖ్యల శూలంబులు గదలు నాశీవిషంబుల యట్టి యమ్ములు నుద్భవిల్లునని విందు; నీ కారుణ్యంబున దీనిం బడసి దైత్య దానవ యక్షరాక్షస పిశాచోరగమ్ముల జయింతు; నతివీరులైన భీష్మ ద్రోణాదులను జయింతు; సహజకుండలుండైన కర్ణుని వధియింతు’ ననిన నీశ్వరుండుఁ గరుణించి విశుద్ధాత్ముండైన పార్థునకు మంత్రధ్యాన జపహోమ పూర్వకంబుగా సంధాన మోక్షణ సంహార సహితంబుగాఁ బాశుపతాస్త్రం బిచ్చి ‘దీనికి నసాధ్యం బెద్దియును లే, దల్పులయందుఁబ్రయుక్తంబైన జగత్సంహారము సేయు. 329
క. దీని విధానం బెఱుఁగం | గా నింద్రకుబేర వరుణ కాలాదులకుం
దా నతి గహనం బనినను | మానవులకు నెఱుఁగు టఘటమానము గాదే.
330
వ. ఈ దివ్యబాణమ్మున నీ వఖిలలోకమ్ములు జయింతు’ వని కౌంతేయునకు వరం బిచ్చి పురాంతకుం డంతర్హితుండయ్యె నంత. 331
చ. అవిరళ సూర్యమండల సహస్ర సమప్రభమై, ధనంజయ
ప్రవరు కరమ్మునన్‌ వెలుఁగు పాశుపతాస్త్రముఁ జూచి దైత్యదా
నవ సుర యక్ష రాక్షస గణమ్ము గరమ్ము భయమ్ముఁ బొందె; నం
దవనియు దిర్దిరం దిరిగె నబ్ధిశిలోచ్చయసంచయంబుతోన్‌.
332
క. త్రినయనగాత్రస్పర్శన | మున నిజగాత్రము పవిత్రమును, ముక్తాఘం
బును, నతితేజోవీర్యం | బును నైనఁ బృథాసుతుండు ముదితుం డగుచున్‌.
333
క. మంటి, హరుదేహ మంటం | గంటి; నుమాధీశు నమరకంటకహరు ము
క్కంటిఁ గఱకంఠుఁ జూడం | గంటిఁ; గృతార్థుండ నైతిఁ గడుఁ బుణ్యమునన్‌.
334
క. ఇమ్ముల ధర్మజునకు జన | సమ్మతునకు రిపుజయంబు సకల మహీ రా
జ్యమ్ము సమకూరె నేఁడు ఘ | నమ్ముగ సర్వప్రయోజనమ్ములతోడన్‌.
335
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )