పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము
ఊర్వశి యర్జును నపుంసకునిఁగా శపించుట
వ. జగంబులు పుట్టింపను మనుపను సమయింపను గర్తలైన దేవతలకు నెట్లు నడచిన నెగ్గు లేదు; నేను గర్మభూమిని జనియించితి; సత్కర్మపరుండ నైన నాకు నిచ్చటి యాచారం బుచితంబు గాదు; మదీయ వంశకర్త యైన పురూరవునకుఁ బత్నివైన కారణంబునను, బురందరునకుఁ బరిచర్య యొనర్చుటం జేసియు నాకు జనని వగుట సందియంబు లేదు; తల్లీ! నన్నుం బుత్త్రవాత్సల్యంబునం జూడు’ మనిన మదనబాణపీడితయై కోపారుణిత నయనంబుల నర్జునుం జూచి యూర్వశి ‘యేను గామించి వచ్చిన నా మనోరథంబు విఫలంబుఁ జేసిన వాఁడవు; నీవు మర్త్యలోకంబున మానవర్జితుండవై మానినీమధ్యంబున నపుంసకుండవై యుండు’ మని శాపం బిచ్చి నిజగృహంబునకుఁ జనియె; నంతఁ బ్రభాత సమయంబునఁ దద్వృత్తాంతం బంతయు విని సురపతి కొడుకున కిట్లనియె. 365
క. ‘నీయట్టి ధైర్యవంతుని | నే యుగముల నైనఁ గాన మెన్నండును; ధ
ర్మాయత్తమతివి; మునులకు | నీ యింద్రియజయము గీర్తనీయము తండ్రీ!
366
తే. అనఘ! యూర్వశి యిచ్చిన యట్టి శాప | మనుభవింపంగ వలయు నీ కవనియందు;
నింక మీ పదుమూఁడవయేఁడు సత్య | సరణి నజ్ఞాతవాసంబు సలుప వలయు.
367
వ. అక్కాలంబున నీవు షండరూపంబునఁబ్రచ్ఛన్నుండవై, రాజకన్యకలకు నృత్యంబు గఱపుచుండి, తదంత్యంబున శాపమోక్షంబు వడయు’ మని యనుగ్రహించె; ‘నీ యాఖ్యానంబు విన్న పుణ్యపురుషులు సకలదురిత విముక్తు లగుదు’ రని చెప్పి వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె. 368
సీ. వజ్రాస్త్ర మాదిగా వరదుఁడై వివిధ ది | వ్యాస్త్రముల్‌ పార్థున కమర నిచ్చి,
తత్ప్రయోగంబులుఁ దద్రహస్యంబులుఁ | దన్నివర్తనములుఁ దడయ కపుడ
దయ నుపదేశించి ‘దారుణాహవములం | దవిజేయ వీర్యుండ వగుము పేర్మి’
నని మహాసౌహార్దుఁడై చిత్రసేనుఁడన్‌ | గంధర్వపతితోడ గారవమున
 
ఆ. వజ్రధరుఁడు గీతవాద్యనృత్యంబులు | గఱవఁ బంచెఁ బార్థుఁ గడఁగి, యిట్టు
లమరనాథునొద్ద నర్జునుం డుండ నే | నేఁడు లరిగె నిట మహీతలమున.
369
వ. అంత నొక్కనాఁడు రోమశుం డను మహాముని యింద్రునొద్దకు వచ్చి సురగణపూజితుండై సురేంద్రుతో నేకాసనంబున నున్న యర్జునుం జూచి యాశ్చర్యం బంది యింద్రున కిట్లనియె. 370
క. ‘కోరి యనేకయుగంబు ల | పారతపోయుక్తు లైనవారికిఁ బడయన్‌
దూరము నీ సభ, మఱి నీ | కారుణ్యం బంతకంటెఁ గడు ద వ్వెందున్‌.
371
వ. అట్టియందు నీతో నొక్కట నేకాసనం బెక్కి నీ రెండవమూర్తియుంబోలె నున్న యిమ్మనుజుం డెందులవాఁడెవ్వఁ’ డనిన నమ్మునీంద్రునకు దేవేంద్రుం డిట్లనియె. 372
క. ‘నరుఁ డను మహర్షి యీతఁడు | నరలోకమునందుఁ బుట్టె నా యంశమునన్‌
గురుమతిఁ గౌంతేయుఁడు, భా | సుర తేజుఁ డుపేంద్రసఖుఁడు సువ్వె! మునీంద్రా!
373
తరలము శివుఁడు వీనికిఁ బ్రీతుఁడై దయ సేసెఁ బాశుపతాస్త్ర; మా
దివిజముఖ్యులతోడ నేనును దివ్యబాణము లిచ్చితిం;
దివిరి యీతఁడు మత్ప్రియంబుగ దేవకార్యము దీర్పఁగా
సవినయస్థితి నున్నవాఁడు నిజప్రతాపబలోన్నతిన్‌.
374
వ. మఱియు వసుమతీ ఖాత గర్వితులైన సగరసుతులం దనదృష్టితీవ్ర దహనంబునం జేసి దహించిన కపిలుం డను మహాముని నారాయణుండయ్యె; నట్టి నరనారాయణు లాదిమునులు జగదుపకారులు జగతీ భారావతరణ కారణులై దైత్యదానవవధార్థంబు మర్త్యంబునం బుట్టినవారు గావున. 375
క. దేవతలకు నపకారము | గావించిన యన్నివాతకవచులఁ బాతా
ళావాసుల దానవుల మ | హావీరుఁడు వీఁ డభేద్యుఁ డై వధియించున్‌.’
376
వ. అని తత్ప్రభావంబు సెప్పి యింద్రుండు రోమశున కిట్లనియె ‘మునీంద్రా! నీవు మర్త్యలోకంబునకుం బోయి ధర్మజుం గని యతనికిం దత్సహోదరులకు సంతోషంబుగా నా యొద్దం బార్థుండున్న కుశలవార్త యెఱింగించి, భీష్మ ద్రోణ కర్ణాది వీరుల నోర్చునట్టి దివ్యాస్త్రంబులు వడసె, నతండు మీ యొద్దకు వేగంబ వచ్చు, వగవకుండుం డని చెప్పి నా వచనంబున ధర్మజు నఖిలతీర్థసేవ సేయం బంపు; మట్లయిన నపేతదురితుండై యఖిల మహీరాజ్యంబు వడయు; నతండు తీర్థాభిగమనంబు సేయునపుడు నీ వాతనికి సహాయుండవు గ’మ్మని యింద్రుండు రోమశుం బనిచె; నిట ధృతరాష్ట్రుం డర్జును దివ్యాస్త్రలాభంబుఁ బారాశర్యువలన నెఱింగి పరమవ్యాకులహృదయుండై సంజయున కిట్లనియె. 377
సీ. ‘సురసమూహంబుతో సురరాజు నోడించి | ఖాండవం బెక్కటి కాల్చియున్న
వీరున, కఖిలాబ్ధివృతవసుంధరఁ గల | రాజుల నోర్చి పరాక్రమమున
నగ్రజు రాజసూయాధ్వర మనిచిన | యధికసమర్థున, కర్జునునకుఁ,
బ్రబలసింహమునకుఁ బక్కెర వెట్టిన | యట్లు దేవతలు నెయ్యంబుతోడఁ
 
ఆ. బరముఁ దొట్టి పాశుపత మాదిగా దివ్య | శరము లిచ్చి రట్టె! శౌర్య మెసఁగ
నట్టి నరుఁడు యోధుఁడై యున్న పాండవ | వరులఁ జెనయు నంత వారుఁ గలరె?
378
క. వారికి, ధర్మువు దప్పని | వారికి, దృఢవచను లైన వారికి, విమలా
చారుల కెద్దియుఁ బడయఁగ | దూరమె, పాండవులఁ బోలుదురె వీరు లొరుల్‌.
379
వ. వారలతో విగ్రహించి దుర్యోధనుండు దనకుఁ దన బాంధవులకు సుహృజ్జనంబులకు హాని సేసికొనియె. 380
ఆ. పర్వతములు వజ్రపాతాహతిని బోక | తక్కునేని, నింద్రతనయు దివ్య
నిశితబాణతతుల నిశ్శేష మగుననఁ | బరుల సైన్య మెట్లు బ్రదుక నేర్చు?
381
వ. లయకాలోదిత సహస్రకరు కిరణంబులం జరాచరంబులు దప్తంబులగునట్లు పార్థు బాణంబులం జేసి దుర్యోధనాదులు దుస్సహతాపంబుఁ బొందుదు’ రని దుఃఖితుం డైన ధృతరాష్ట్రునకు సంజయుం డిట్లనియె. 382
క. ‘ఈసున దుర్యోధన దు | శ్శాసను లొగిఁ బాండవులకు సభలో నెగ్గుల్‌
సేసిన విని వారల నను | శాసింపక వగలఁ బొగులఁ జనునే నీకున్‌?
383
వ. నీయుపేక్షం జేసి దుర్యోధనుచేత దుర్ద్యూత పరాజితులై రాజ్యంబు విడిచి పాండవు లరిగి కామ్యకవనంబున నున్నఁ, గృష్ణుం డనేకరాజసమన్వితుండై వారి యొద్దకు వచ్చి నీ కొడుకులు సేసిన నికారంబునకుం గృష్ణాపరిభవంబునకు దుఃఖితుండై కడు నలిగి, మీకు నెగ్గు సేసిన దుర్యోధనాదుల దూషించి గజపురంబున ధర్మరాజు రాజ్యాభిషిక్తుం జేయుదు ననియు, రాజసూయంబు సేయు నాఁడింద్రప్రస్థంబుననైన విభూతికంటె విశేషవిభూతి గావింతు ననియు, ద్రుపద సృంజయ కేకయ ధృష్టద్యుమ్న బలదేవ సాంబ సాత్యకి ప్రభృతుల సమక్షంబునం బలికి, సత్యసమయులైన పాండవులచేత సంరంభ నివారితుండై, పార్థుసారథ్యంబునకుఁ బ్రార్థితుం డయ్యె నని వింటిమి. 384
క. పదుమూఁడేండ్లుం బోయినఁ | బదునాల్గగు నేఁడు ఘనులు పాండవులు జగ
ద్విదితముగ నుత్సహింతురు | వదలక రణమునకుఁ గేశవపురస్కృతులై.
385
క. వరములు వేల్పులచే దు | ష్కర తపమునఁ బడయుదురు జగంబున నొరు; లీ
శ్వరుచే వరములు వడసెం | గరుణ ధనంజయుఁడు తనదు కార్ముకశక్తిన్‌.
386
వ. అయ్యర్జును దివ్యశర సంఘాతంబును, భీమసేను చిత్ర గదా ఘాతంబును, నీ యుపేక్షానిర్ఘాతంబును గౌరవ పరిక్షయంబునకుఁ గారణభూతంబు’ లనిన సంజయునకు ధృతరాష్ట్రుం డిట్లనియె. 387
క. ‘వృద్ధని, జాత్యంధుం డని, | బుద్ధివిహీనుఁ డని నన్నుఁ బుత్త్రుఁడు బల ద
ర్పోద్ధతుఁడై, మెచ్చఁ, డసం | బద్ధంబులె కాని వినఁడు పలికిన పలుకుల్‌.
388
వ. దుర్యోధనుండు దుర్బుద్ధి యని యేమి సెప్పవలయు? భీష్మ ద్రోణ విదురాదుల నాదరింపక కర్ణశకునుల నాప్తులం జేసికొని వారి వచనంబుల నెగడు, నేనేమి సేయుదు?’ నని ధృతరాష్ట్రుండు మిన్నకుండె; నిట పాండవులు పార్థు మసలుటకు దుఃఖితులై. 389
ఉ. ‘పాండవసింహ మర్జునుఁడు పాండుయశంబు వెలుంగుచుండ నా
ఖండలుదొట్టి నిర్జరనికాయముచేత వరంబు గాంచి యె
న్నం డిట వచ్చునొక్కొ? సుజనస్తుతు నాతనిఁ బ్రీతిఁ జూడ నె
న్నండొకొ కాంతు’ మంచును మనంబునఁ గోరుచు నుండి రెంతయున్‌.
390
వ. అట్టి యవసరంబున యుధిష్ఠిరునకు భీముం డిట్లనియె. 391
మధ్యాక్కర ‘నీ నిదేశంబున నరిగి పార్థుండు నిష్ఠతోఁ దపము
మానుగాఁ జేయుచునున్నవాఁ డేల మసలెనో రాక?
వాని ధర్మస్థితుఁ బాసియున్న యివ్వర్షముల్‌ యుగ స
మానంబు లైనవి మనకు నతని సమాగమకాంక్ష.
392
వ. మఱి పాండవ పాంచాల వీరుల జీవనంబు లాతనియంద నిలిచినవి; తదీయ భుజాశ్రయబలంబునం బరుల జయించి ధరణీరాజ్యంబుఁ బరిగ్రహింత మని యున్నవారము; గావునం గాలయాపనంబు సేయక యర్జునుం దోడ్కొని తేర జనార్దను రాఁ బనిచి నియోగింపుము. 393
మ. సమయాబ్దంబులకంటె ముందర మహోత్సాహంబునన్‌ బాహువి
క్రమ మొప్పన్‌ విజయుండు నేనుఁ దగ సంగ్రామంబులో నేక కా
లమునం దా ధృతరాష్ట్రజాధముల నెల్లం జంపి భూచక్ర రా
జ్యము సేకొందుము కౌరవేంద్ర! మురజిత్సఖ్యప్రసాదంబునన్‌.
394
వ. సత్యభంగభీతుండవు గావున నీ వింద యుండి పదుమూఁడేండ్లుం జలిపి పదంపడి కరిపురంబునకు వచ్చి రాజ్యాభిషిక్తుండ వగుము; దుష్టద్యూతంబున మనరాజ్యం బపహరించిన సుయోధనుండు సుచిర ప్రతిష్ఠితుండు గాకుండ నిప్పుడ యద్దురాత్ము దూషింతుము; నికృతిపరుల నికృతిన చేసి నిర్జించినఁ బాపంబు లేదు; సర్వ ప్రకారంబులను శత్రువుల జయించి రాజ్యంబు సేకొనుట రాజులకు విధిచోదితంబైన రాజధర్మంబ’ యనిన భీమసేను మహాసంరంభంబునకు సంతోషించి ధర్మనందనుండాతనిం దనపైకిం దిగిచికొని మూర్ధాఘ్రాణంబు సేసి యిట్లనియె. 395
తే. ‘అనలునకు గాడ్పు దోడైన యట్టు లింద్ర | తనయునకు నీవు దోడైనఁ దడయ కాజిఁ
బోరి రిపులకు బ్రదుకంగఁ బోల; దైన | ననఘ! యిది కోపమునకు ననవసరంబు.
396
క. పదుమూఁడేండ్లుం బోయినఁ | బదపడి పార్థుండు నీవుఁ బరనృపతుల దు
ర్మదుల వధియించి విజయా | స్పదబాహుల రగుఁడు ధర్మపరిరక్షకులై.
397
వ. ఏ నెట్లును సత్యభంగంబు సేయుట కొడంబడ నోప’ నని ధర్మతనయుం డనుజు ననునయించె నని జనమేజయునకు వైశంపాయన కథితంబైన పుణ్యకథ యతిరమణీయంబుగాను. 398
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )