పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము
కేశిని యను దూతి దమయంతితో నలుని గుణంబులు సెప్పుట (సం. 3-73-8)
క. ‘అతని చరితంబు సెప్పఁగ | నతిమానుష మపగతప్రయాస మదృష్ట
శ్రుతపూర్వము; పరమార్థమ | యతనిని వే ల్పనఁగవలయు నంబుజనేత్రా!
196
సీ. వినవమ్మ! తృణముష్టిఁ గొని వాఁడు వీచుడు | నం దగ్ని యుదయించి యతని వంట
లమరునంతకు నింధనము లపేక్షింపక | యుడుగక మండుచునుండు; మఱియుఁ
గడఁకతో నంజుళ్ళు గడుగంగ సమకట్టి | జల మపేక్షించుడు సంభవిల్లి
కుంభముల్‌ నిండి దివ్యాంభఃప్రవాహ మ | క్షయ మగుచుండుఁ దత్‌క్షణమ చూడ;
 
ఆ. నతని కరతలద్వయావమర్దితములై | కందియును మహాసుగంధకుసుమ
తతులు దొంటియట్ల తమకంపు విడువక | యుండు; నతని తేజ మున్నతంబు.’
197
వ. అనిన విని దమయంతి వెండియుఁ గేశినిం బంచి బాహుకు వండిన నంజుళ్ళు తెప్పించి యాస్వాదించి, బాహుకునందు నలు లక్షణంబులు గలుగు టెఱింగియు, నూఱడనోపక వానిపాలికిం గొడుకునుం గూఁతునుం గేశినితోడం బుచ్చిన నక్కుమారులం జూచి. 198
ఆ. వశము గాక బాష్పవారి యొల్కుచు నుండఁ | గొడుకుఁ గూఁతు నెత్తికొని నలుండు
హర్షపులకితంబు లయిన నిజాంకంబు | లందు వారి నునిచి యాదరమున.
199
వ. అక్కేశినిం జూచి ‘యిక్కుమారు లిద్దఱు నా కొడుకునుం గూఁతునుం బోలిన వీరి నెత్తికొని దుఃఖించితి’ నని తన్నేర్పడకుండం బలికి దాని కిట్లనియె. 200
క. ‘నీ విట పలుమఱు వచ్చుచుఁ | బోవుచు నున్కిఁ గని చిత్తముల నొండుగ నన్‌
భావింతు రితరజనములు | గావున రావలవ దింకఁ గార్యార్థినివై.
201
వ. ఏము దేశాంతరంబున నుండివచ్చిన అతిథులము; నీకు మాతోడి దేమి?’ యనినఁ గేశిని గ్రమ్మఱి వచ్చి, బాహుకు మార్గంబంతయు దమయంతికిం జెప్పిన, నది సంతసించి నిజజనని కిట్లనియె. 202
ఉ. ‘సందియ మేల? సర్వగుణసంపదఁ జూడఁగ బాహుకుండు భూ
వందితుఁడైన నైషధుఁ డవశ్యముఁ దా నగు; నా మనంబు నా
నందముఁ బొందుచున్నది ఘనంబుగ; వాఁ డిట వచ్చువాఁడొ? యే
నందుల కేఁగుదాననొ? రయంబున నాపని నిశ్చయింపుమా!’
203
వ. అనిన నది యప్పుడ భీము ననుమతంబున దమయంతియొద్దకు బాహుకు రావించిన. 204
క. చనుదెంచి యందు దీనా | నన నవిరళపంకమలిననతగాత్రఁ దప
స్విని నతికృశ దమయంతిం | గనియె నలుం డుదితబాష్పకణకలితముఖిన్‌.
205
క. దమయంతి నలుని వికృతాం | గముఁ జూచియు నతని నన్యుఁగా వగవక నె
య్యమునను లజ్జను నతిసం | భ్రమమున వివశాత్మ యగుచుఁ బతి కిట్లనియెన్‌.
206
వ. ‘విజనంబైన విపినంబునందు నలసి నిద్రవోయినదాని నబల నతిసాధ్వి ననువ్రత నగ్నిసన్నిధిఁ బాణిగ్రహణవిధి లబ్ధ యైన దానిం బాసి నలునట్లు నిర్దయులై యరిగినవా రొరు లెవ్వరు లేరు. 207
క. సురవరులఁ దొఱఁగి తన్నున్‌ | వరియించితి; నన్నుఁ బుత్త్రవతి నేలొకొ చె
చ్చెర విడిచె? నాతనికి ని | ష్కరుణున కే నేమి యెగ్గు గావించితినో?
208
వ. ‘నిన్ను విడువ నోడకుండు’ మని పలికిన యప్పలుకు లేల మఱచెనో?’ యని శోకతప్తంబైన తన హృదయంబు దడుపుచున్నయదియునుంబోలె బాష్పధారలం గుచమండలంబు దడుపుచునున్న దమయంతిం జూచి శోకాకులుండై నలుం డిట్లనియె. 209
తే. ‘కలిసమావిష్టమతి నయి కష్టవృత్తి | నట్టి యిడుమలఁ బడితి నే; నవి మదీయ
తపము బలమున, నీ దుఃఖదాహమునను | నష్టమై పోయెఁ; గలి యిప్డు నన్ను విడిచె.
210
వ. ఏ నిందులకు నీ తదర్థంబ వచ్చితి; నది యట్లుండె; నన్ను ననురక్తు ననువ్రతుఁ దలంపక యన్యాపేక్షంబున స్స్వయంవరంబు రచియించుట యిది కులస్త్రీధర్మంబు గాదు; రాజుల నెల్ల నీ స్వయంవరంబునకు రావించుటం జేసి కాదే ఋతుపర్ణుండు వచ్చె’ ననిన వెఱచి కృతాంజలియై దమయంతి యిట్లనియె. 211
తే. ‘నిన్ను రోయంగ విప్రులు నెమ్మి నరిగి | పలికి రెల్లచో నాచేతఁ బనుపఁబడియ;
యందుఁ బర్ణాదుఁ డను విప్రుఁ డయ్యయోధ్య | కేఁగి ప్రతివచనంబుల నెఱిఁగె నిన్ను.
212
వ. ఆ పర్ణాదువలన ని న్నెఱింగినదానినై ని న్నిట రావించునుపాయంబు దలంచి, యెల్లి దమయంతీ ద్వితీయ స్వయంవరం బగు నని ఋతుపర్ణునందుఁ బ్రకాశింప సుదేవుం డను బ్రాహ్మణుం బుత్తెంచితి. 213
క. నరవరుఁడు నలుఁడు గా కె | వ్వరు శతయోజనము లొక్కవాసరమున వ
త్తురు నరు లొరు? లని దీనిం | బరికింపఁగఁ గడఁగి యిట్ల వంచితి నధిపా!
214
ఉ. ఏ నతిపాపభావమును నెగ్గుఁ దలంపక యుండునట్లుగా
నానతవైరి! నీ యడుగు లంటఁగ నోపుదు; నట్టిదైన న
న్నీ నలినాప్తుఁ డీ యనలుఁ డీ మృగలాంఛనుఁ డీ సురోత్తముల్‌
జాను సెడంగ నీ క్షణమ చంపరె! కోపపరీతచిత్తులై.’
215
వ. అనుచున్న యవసరంబున నఖిలభూతాంతర్గతుం డయిన వాయుభట్టారకుం డెల్లవారలు విన నాకాశంబున నుండి నలున కిట్లనియె. 216
చ. ‘అమలచరిత్ర నిట్లు దమయంతిఁ బతివ్రతఁ బల్కుదే? నృపో
త్తమ! విను దీనియందు విదితంబగు శీలవిధిన్‌ సుధాంశుఁడున్‌
గమలహితుండు నేను నయి కాచితి మొక్కట మూఁడువర్షముల్‌;
గొమరుగ దీనిఁ జేకొనుము కోమలి నీ కనురక్త’ నావుడున్‌.
217
క. కురిసె మరుద్వచనానం | తరమున సురపుష్పవృష్టి; దడయక మ్రోసెన్‌
సురదుందుభి నాదంబులు; | గరము ప్రసన్నుఁడయి వీచె గంధవహుండున్‌.
218
వ. ఇ ట్లెల్ల వారికి నాశ్చర్యంబుగా వాయుదేవుండు దన్నెఱింగించి, దమయంతి పతివ్రతాగుణంబులును బతియందుల యకృత్రిమానురాగంబునుం జెప్పిన విని నలుండు పరమ ప్రమోద పరిపూర్ణ హృదయుండై తత్‌క్షణంబ కర్కోటకుం దలంచి వాని యిచ్చిన పుట్టంబు పైఁబెట్టుకొని నిజరూపంబు దాల్చిన. 219
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )