పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము
నలుండు గలిచేత విముక్తుం డయి విదర్భకుఁ బోవుట (సం. 3-72-7)
క. నలుఁ దొల్లి యాక్రమించిన | కలి గర్కోటకవిషంబు గ్రక్కుచు నొడలన్‌
వెలువడి, నలునకు విహితాం | జలియై త న్నెఱుఁగఁ జెప్పెఁ జంచలుఁ డగుచున్‌.
179
ఆ. వానిఁ జూచి నలుఁడు దా నల్గి శాప మీ | నున్నఁ, గలి యెఱింగి ‘నిన్నుఁ బొంది
యహివిషంబుచేత ననిశంబు దగ్ధుండ | నైతి; నింక నాకు నలుగ వలదు.’
180
వ. ‘నిన్నును నీ చెలువను గీర్తించిన జనంబులు నావలని భయంబు బొరయరు; నాకుం గరుణింపు’ మనిన నలుండు గోపం బుడిగెఁ; గలియు నవ్విభీతకవృక్షంబు నాశ్రయించె; నది మొదలుగా విభీతకం బప్రశస్తం బయ్యె; నట్లు నలుండు వికృత రూప మాత్రంబు దక్కఁ దక్కిన దుష్కృతంబులవలన విముక్తుండై రథం బెక్కి యతివేగంబున ఋతుపర్ణ వార్‌ష్ణేయ సహితుండై విదర్భకుం జనియె; నంత సాయాహ్నంబున. 181
క. మానుగ ఋతుపర్ణుఁడు భీ | మానుజ్ఞాతుఁడయి చొచ్చె నా ప్రోలు రథ
ధ్వానంబు మ్రోయుచుండఁగ | నానాదిఙ్ముఖములను ఘనధ్వనివోలెన్‌.
182
సీ. దమయంతి యా రథధ్వని విని, యిది నలు | రథఘోష మని యనురాగ మొంది,
‘నలు నిషధేశుఁ బుణ్యశ్లోకు లోకోప | కారకుఁ జూడంగఁ గాంతు నేఁడు;
ఘనభుజుఁ జూడంగఁ గాననినాఁడుఁ ద | ద్భుజ పరిరంభణోద్భూత సుఖముఁ
బడయని నాఁడును బ్రాణముల్‌ విడుతు నే’ | నని తలంచుచుఁ గమలాయతాక్షి
 
ఆ. యా రథాధిరూఢుఁడై వచ్చు ఋతుపర్ణుఁ | జూచి యప్పు డధికశోకతప్త
యగుచు నుండె; నంత నా ఋతుపర్ణుండు | భీముఁ గాన వచ్చెఁ బ్రియముతోడ.
183
వ. భీముండును వానిం బూజించి యొక్క రమ్యహర్మ్యంబున విడియించిన, ఋతుపర్ణుం డప్పురంబున స్వయంవరం బను శబ్దంబు మొదలుగా వినం గానక యాత్మగతంబున. 184
క. ‘ధరణిఁ గల రాజు లిట యె | వ్వరు వచ్చినవారు లేరు; వైదర్భి యొరున్‌
వరియించు నంత ధర్మే | తరచరితయె?’ యనుచు నుండెఁ దద్దయు లజ్జన్‌.
185
వ. బాహుకుండును రథశాల రథాశ్వంబుల బంధించి రథసమీపంబున విశ్రమించియుండె; నంత దమయంతి బాహుక వార్‌ష్ణేయులతోడ వచ్చిన ఋతుపర్ణుం జూచి విఫలమనోరథయై, యుండనోపక, కేశిని యను దానిం బిలిచి’ ‘ఋతుపర్ణు నయోధ్యాపతింగా వార్‌ష్ణేయు సూతపుత్త్రుంగా నెఱింగితి; బాహుకుం డను వాఁ డెవ్వండో? వానియందు నా హృదయంబు ముదితం బగుచున్నయది; మన పర్ణాదునకుఁ బ్రతివచనం బిచ్చినవాఁడు వాఁడ కావలయు; వానికడకుం బోయి యెఱింగి ర’ మ్మని పంచిన, నదియును బోయి బాహుకుం, గని ‘దమయంతి నీ కుశలం బడుగఁ బుత్తెంచె; నిందుల కేమి కారణంబున వచ్చి?’ తనిన దానికి బాహుకుం డిట్లనియె. 186
క. ‘ప్రియమున దమయంతి పున | స్స్వయంవరము సేయఁ గడఁగి సకలక్షత్త్రా
న్వయవీరుల రావించిన | నయనిధి ఋతుపర్ణుఁ డొక్కనాఁటన వేడ్కన్‌.
187
క. వినవె శతయోజనంబులు | సనుదెంచె నయోధ్యనుండి సరి నిందుల; కా
తని రథసారథినై యే | నును వచ్చితి నతనితో మనోవేగమునన్‌.’
188
వ. అనిన ‘మూఁడవవాఁ డెవ్వఁ?’ డని యడిగిన, నక్కేశినికి బాహుకుం డిట్లనియె. 189
క. ‘నలు రథచోదకుఁ; డతఁ డ | త్యలఘుఁడు వార్‌ష్ణేయ నాముఁ’ డనవుడు వాఁ డ
న్నలభూపాలకు పోయిన | వల నెఱుఁగండొక్కొ!’ యనిన వాఁ డిట్లనియెన్‌.
190
వ. ‘వార్‌ష్ణేయుండును నలుపుత్త్రుల విదర్భేశ్వరునొద్దఁ బెట్టిపోయి, నడుమ నలురాజ్యభ్రంశంబు విని ఋతుపర్ణుం గొలిచి యుండె; నాతండును నలు నెఱుంగఁడు. 191
క. నలుతో నొక్కట నరిగిన | నలినాయతనేత్ర భీమనందన యొండెన్‌
నలుఁ డొండె నెఱుఁగుఁగా; క | న్నలు నొరులకు నెఱుఁగఁ గారణము గలదె మహిన్‌.’
192
వ. అనిన విని కేశిని యిట్లనియె. 193
సీ. ‘అడవిలో వస్త్రార్ధహారియై దయలేక | ప్రాణేశ్వరుఁడు దనుఁ బాసి చనిన
నాఁటి వస్త్రార్ధంబు నలినాక్షి యిప్పుడుఁ | బరిధానముగఁ బాంసుపటల మలిన
మగుచున్న తనువుతో ననయంబు జడగొన్న | యలకావలులతోడ నవనితలము
శయనంబుగా ధర్మచారిణి దమయంతి | యనఘవ్రతం బిట్టు లాచరించు
 
ఆ. చున్న’ దనిన నవిరళోద్గత బాష్పపూ | ర్ణంబు లైన లోచనంబు లెఱుక
వడకయుండ వదనపద్మంబు వాంచి తా | నొండువలను సూచుచుండె నలుఁడు.
194
వ. కేశినియును బాహుకు పలుకులు నాకారంబును దమయంతి కెఱింగించిన, నది యాతని నలుంగా శంకించి ‘యింకను వాని కడ కేఁగుము; వాఁడు ఋతుపర్ణు వంటలవాఁడఁటె; పచనసమయంబున వాని చరితం బిమ్ముగా నెఱింగి ర’మ్మని పంచిన నప్పుడ చని కేశినియు బాహుకునందుల దైవమానుష నిమిత్తాద్భుత క్రియలు సూచి వచ్చి దమయంతి కిట్లనియె. 195
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )