| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము |
| వ. | అని చెప్పి బృహదశ్వుం డరిగినం; బాండవులు గాండీవిరాకయ కోరుచుఁ దదాలోకనప్రీతి నుండునంత నంతరిక్షం బెల్లఁ దనతేజంబున వెలుంగుచుండ నారదుండు వచ్చి యనుజసహితుండైన ధర్మరాజుచేతం బూజితుండై యిట్లనియె. | 232 |
| ఆ. |
‘ధర్మపుత్త్ర! నీ యుదారచరిత్రకు | ధర్మమతికిఁ దృప్తతముఁడ నైతి; నడుగు మిష్ట మెద్ది?’ యనినఁ గృతాంజలి | యై మహీశుఁ డిట్టు లనియె భక్తి. |
233 |
| వ. | ‘మునీంద్రా! నీవు తృప్తుండవైనం ద్రిజగంబులకుం దృప్తియగు; నిన్నుం జూచి కృతార్థుండ నైతి; నా కెప్పుడు నొక్క ధర్మసందేహంబు గలదు; దాని నిర్ణయించి యానతీయవలయు. | 234 |
| చ. |
ధరణిఁ బ్రదక్షిణంబుగ ముదంబునఁ గ్రుమ్మఱి తీర్థసేవనా పరు లగుచున్న ధన్యులు శుభస్థితి నెట్టి ఫలంబు నొందఁ గాం తురు బహుతీర్థకీర్తనముతో నెఱిఁగింపుము దీని’ నావుడున్ నరవరుఁ డైన పార్థునకు నారదుఁ డిట్లని చెప్పెఁ బ్రీతితోన్. |
235 |
| క. |
ధీరుఁడు భీష్ముఁడు గంగా | ద్వారమునం దొల్లి పితృహితమ్ముగ శుభక ర్మారంభుఁ డగుచు నుండె ను | దారుం డధ్యయన సంతతవ్రతపరుఁడై. |
236 |
| వ. | అతని పితృదేవతాభక్తికిఁ బరమధర్మచరితంబునకు మెచ్చి తద్దర్శనాపేక్షం బులస్త్యుండను మహాముని వచ్చిన నతిభక్తుండయి యా భీష్ముం డమ్మునిఁ గుశపీఠంబున నునిచి యర్ఘ్యపాద్యాదివిధులం బూజించి యతని యడుగులు తల నిడుకొని దక్షిణజానుస్పృష్ట మహీతలుండయి’ యేను భీష్ముండ భవద్దాసుండ’ నని ముకుళిత హస్తుం డయి యున్న వానికిఁ బులస్త్యుం డిట్లనియె. | 237 |
| క. |
‘పితృదేవభక్తిఁ బుణ్య | వ్రతచర్యను నీవ యెల్లవారికి నత్యు న్నతుఁడవు గావున నీచే | ధృతిఁ గానఁగఁబడితి నేఁ బ్రతీపకులేశా! |
238 |
| వ. | నీ యిష్టంబు సెప్పు; మే నమోఘదర్శనుండ’ ననిన భీష్ముండు ముదితహృదయుండై ‘మునీంద్రా! నాయందు నీకుఁ బ్రసాదబుద్ధి గలదేనిఁ జెప్పు’ మని. | 239 |
| క. |
‘మనుజేంద్ర! నన్ను నీ యడి | గిన యట్ల పులస్త్యుఁ బుణ్యకీర్తను గంగా తనయుం డడిగిన నతనికి | ననఘచరిత్రునకు నిట్టు లని ముని సెప్పెన్. |
240 |
| సీ. |
కడఁగి బుద్ధీంద్రియ కర్మేంద్రియంబుల | యందు సంయతచిత్తు లైనవారు ధృతి నహంకారప్రతిగ్రహాపేక్షల | యందు నివృత్తాత్ము లైనవారు నల్పభోజనులు ననారంభకులు నయ్యు | నత్యంతసంతోషు లైనవారు సత్యవ్రతులు శుభాచారు లక్రోధను | లగుచు ధర్మాన్వితు లైనవారు |
|
| ఆ. |
నఖిలతీర్థశతము లాడిన ఫలములు | నఖిలయజ్ఞవిధుల నైన ఫలముఁ బడయుదురు విహీనభాగ్యదుష్కృతులకుఁ | బరమతీర్థసేవఁ బడయ నగునె? |
241 |
| క. |
తిల గో సువర్ణ దానం | బులు నుపవాసములుఁ దీర్థముల సేవయు ని మ్ములఁ జేయనివారు దరి | ద్రులు రోగులు నగుదు రాత్మదోషము పేర్మిన్. |
242 |
| క. |
క్రతుఫలములు వడయఁగ దు | ర్గతులకు దొరకొనదు తీర్థగమనంబునఁ ద త్క్రతుఫలము లందుదురు దు | ర్గతులును నిది మునులమతము కౌరవవృషభా! |
243 |
| వ. | తీర్థగమనఫలం బెల్లపుణ్యంబులకు విశేషంబు; దీని వినుము. | 244 |
| చ. |
నమితవిరోధి! పుష్కర మనంగ జగద్విదితంబు పుణ్య తీ ర్థము మునిసిద్ధసేవ్యము; ముదంబున నందుఁ బయోజసంభవుం డమరులతోడ సన్నిహితుఁడై వసియించుఁ; ద్రిపుష్కరంబులున్ సమములు; వాని నెప్పుడును సంస్మృతి సేసినఁ బాయుఁ బాపముల్. |
245 |
| క. |
పదివేలకోట్లతీర్థము | లుదితములై పుష్కరముల నుండు మునీంద్ర త్రిదశవరు లందుఁ జేసిరి | మదిఁ గృతకృత్యు లయి తపము మఖములుఁ బ్రీతిన్. |
246 |
| వ. | అందుఁ గృతస్నానులై దేవర్షిపితృతర్పణంబులు సేసినవారు దశాశ్వమేధఫలంబులు వడయుదురు; కార్తిక మాసంబున నొక్కదివసంబు పుష్కరసేవ సేయుటయు నొకయేఁ డగ్నిహోత్రంబు వేల్చుటయు సమంబు. | 247 |
| క. |
అమరవరులందుఁ ఋరుషో | త్తముఁ డెట్లు విశేషుఁ డట్లు ధరణిం గల తీ ర్థములందుఁ బుష్కరత్రిత | యము గరము విశేష మభిమతార్థప్రదమై. |
248 |
| వ. | పుష్కరంబునఁ బదియేండ్లు వసియించినవారికి సర్వక్రతుఫలంబును బ్రహ్మలోకప్రాప్తియు నగు; మఱియు జంబూమార్గంబు దండులికాశ్రమంబున నగస్త్యవటంబను తీర్థంబు లాడి యశ్వమేధఫలంబు వడయుదురు; కణ్వాశ్రమంబును ధర్మారణ్యంబును యయాతి పతనంబునుం జూచిన సర్వపాపక్షయంబగు; మహాకాళంబును గోటితీర్థంబును నశ్వమేధ ఫలప్రదంబులు; భద్రవటంబను రుద్రస్థానంబున రుద్రుం బూజసేసి గణపతిత్వంబు వడయుదురు; నర్మదాస్నానంబున దక్షిణసింధుస్నానంబునఁ జర్మణ్వతీ తీర్థ స్నానంబున నగ్నిష్టోమ ఫలంబు లగు. | 249 |
| క. |
అనవద్య వసిష్ఠాశ్రమ | మున నొక దివసంబు శాకమూలాశనులై జను లుండి పడయుదురు బహు | ధనసంపద గోసహస్రదాన ఫలంబుల్. |
250 |
| వ. | మఱి పింగం బను తీర్థంబు సేవించి శతకపిలగోదానఫలంబు వడయుదు; రెందేని నగ్నిదేవుండు ప్రత్యక్షంబై యుండునట్టి ప్రభాసతీర్థం బాడి యగ్నిష్టోమాతిరాత్రఫలంబు వడయుదురు; దుర్వాసునకు విష్ణుదేవుండు వరం బిచ్చుటంజేసి వరదానం బనంబరఁగిన తీర్థం బాడియు, సరస్వతీసాగరసంగమం బాడియు గోసహస్రదాన ఫలంబు వడయుదురు. | 251 |
| క. |
ద్వారవతీపురమునఁ బిం | డారక మను తీర్థమును బెడంగై ముద్రా కారంబులై త్రిశూలా | కారములై పంకజములు గానంగఁబడున్. |
252 |
| వ. | అందుఁ బరమేశ్వరుం బూజించి పాపవిముక్తు లగుదురు; సాగర సింధు సంగమ స్నాతులైనవారు వరుణలోక గతు లగుదురు; శంకుకర్ణేశ్వరంబున నీశ్వరుం బూజించి దశాశ్వమేధ ఫలప్రాప్తు లగుదురు; వసుధారయును వసుసరంబు నను తీర్థంబు లాడి వసుప్రాప్తు లగుదురు; సింధూత్తమస్నానంబున బహుసువర్ణదానఫలం బగు; బ్రహ్మతుంగసేవనంబున బ్రహ్మలోకప్రాప్తి యగు; శక్రకుమారీ విలోకనంబున శక్రలోకగతి యగు; శ్రీ కుండంబునఁ బితామహునకు నమస్కరించియు, సౌవర్ణరాజితంబులైన మత్స్యంబులు గల విమలం బను తీర్థంబాడియు వాసవసాయుజ్యంబు వడయుదురు; బడబ యను తీర్థంబున నగ్నిదేవునకు నైవేద్యం బిచ్చిన నది యక్షయంబై పితృదేవతలకుఁ దృప్తిఁ జేయు, గోసహస్ర దానంబునకు నశ్వమేధ సహస్రంబునకు విశేషంబు. | 253 |
| క. |
దేవిక యను తీర్థంబున | దేవసమూహంబుతోడఁ ద్రినయనుఁ డుండున్; సేవితమై జనులకు నది | గావించు ననూనధర్మకామార్థంబుల్. |
254 |
| వ. | అర్ధయోజన విస్తృతంబై పంచయోజనాయామంబైన యద్దేవికానదియును, గామాఖ్యంబును, రుద్రతీర్థంబును, యజన యాజన బ్రహ్మ వాలుకంబులును, బ్రహ్మాది దేవతల దీర్ఘ సత్రస్థానంబైన దీర్ఘసత్రంబును సేవించినవారికి నిష్టసిద్ధి యగు; వినశనంబను తీర్థంబున నదృశ్యంబై మేరువునకుం బోవు నెడ నాగోద్భేద, శివోద్భేద, చమసోద్భేదంబుల నెందేని సరస్వతి గానం బడియె నట్టి సరస్వతియందు నభిషిక్తులైనవారు నాగలోకంబు వడయుదురు; శశరూప పుష్కరంబులు గల శశయానం బను తీర్థంబున స్నానంబును గోసహస్రదానంబును సమంబు. | 255 |
| మధ్యాక్కర |
ఏ మేమ మున్ను పూజింపుదుము రుద్రు నిం దని వేడ్క తో మునికోటి దారున్న, నీశుఁ డందొఱకును బ్రీతి గా మతిలోఁ గోటిరుద్రరూపముల్ గావించె నదియు భూమిఁ బ్రసిద్ధమై రుద్రకోటి నాఁ బొలిచి వెలింగె. |
256 |
| వ. | అందు రుద్రుఁ బూజసేసి రుద్రలోకప్రాప్తు లగుదురు. | 257 |
| క. |
నరనుత! నైమిశమునఁ బు | ష్కరముల మూఁటను జగత్ప్రకాశితమై యి ద్ధరణిఁ గురుక్షేత్రము దు | స్తరదురితౌఘముల కెల్ల దవ్వగుచుండున్. |
258 |
| తే. |
అమరలోకనివాసుల యండ్రు విబుధు | లా కురుక్షేత్రవాసుల; నదియు వినఁగ నుత్తమంబు దృషద్వతి యుత్తరమునఁ | దపనతేజ! సరస్వతి దక్షిణమున. |
259 |
| వ. | అక్కురుక్షేత్రశమంత పంచకంబుల నడుమ రామహ్రదంబు నడుమఁ బితామహు నుత్తరవేది యనంబడునట్టి కురుక్షేత్రంబు ముట్టిన వారికిఁ, గురుక్షేత్రంబునకుం బోయెద మనిన వారికిఁ, గురుక్షేత్రంబున వసియించెదమని తలంచినవారికి సర్వపాపక్షయం బగుఁ; దదనంతరంబున విష్ణుస్థానంబున విష్ణువు నర్చించిన నశ్వమేధ ఫలం బగుఁ; బారిప్లవం బను తీర్థమాడి యగ్నిష్టోమఫలంబు వడయుదురు; పృథివీతీర్థం బాడిన గోసహస్ర దానఫలం బగు; శాలూకిని యను తీర్థం బాడిన దశాశ్వమేధ ఫలం బగు; సర్పతీర్థం బాడి యందుఁ దరండకుం డను ద్వారపాలకునిం జూచినవారి కిష్టసిద్ధి యగు; నెందేని విష్ణుం డాదివరాహం బయ్యె నట్టి వరాహతీర్థం బాడినవారికి నగ్నిష్టోమ ఫలంబగు; నశ్వినీతీర్థం బాడిన రూపవంతు లగుదురు; జయంతి యందు సోమతీర్థ స్నానంబును, గృతశౌచతీర్థస్నానంబును రాజసూయ పౌండరీక సమంబు; లగ్నివటంబున, ముంజవటంబున నీశ్వరుం బూజించి గాణపత్యంబు వడయుదురు; యక్షిణీతీర్థమాడి యిష్టఫలంబులు వడయుదురు; కురుక్షేత్ర ద్వారంబుఁ బ్రదక్షిణంబు సేసినం బాపక్షయం బగు. | 260 |
| క. |
వీరుండు క్షత్త్రియులఁ దన | దారుణ పరశువున జామదగ్న్యుఁడు రౌద్రా కారుఁడు వధియించి తదీ | యారుణమున నేనుమడువు లాపాదించెన్. |
261 |
| వ. | అందుఁ బితృతర్పణంబు సేసినం బితృదేవత లాతనికిం బ్రత్యక్షంబయి ‘ నీ కిష్టంబైన వరంబు వేఁడు’ మనినఁ బరశురాముండు వారల కిట్లనియె. | 262 |
| తే. |
‘క్షత్రవధనైన పాపంబు గ్రాఁగవలయుఁ; | గడఁగి సద్గతియును నాకుఁ బడయవలయు; నివియుఁ బుణ్యతీర్థంబులై యిద్ధరిత్రిఁ | బరఁగుచుండంగవలయు మీ కరుణఁ జేసి.’ |
263 |
| వ. | అని పితృదేవతల వరంబునం బుణ్యతీర్థంబులఁ జేసె; నట్టి రామహ్రదంబు లాడినవారికి నశ్వమేధ ఫలంబగుఁ; గాయశోధనం బను తీర్థం బాడి కాయశుద్ధు లగుదు; రెందేని విష్ణుదేవుండు లోకంబుల నుద్ధరించె నట్టి లోకోద్ధారం బను తీర్థమాడి కులం బుద్ధరింతురు; శ్రీతీర్థం బాడి శ్రీమంతు లగుదురు; కపిలతీర్థం బాడి కపిల గో సహస్ర దాన ఫలంబుఁ బడయుదురు; సూర్యతీర్థం బాడి యం దుపవసించిన సూర్యలోక ప్రాప్తులగుదురు; గో భవనంబను తీర్థంబాడి గోసహస్రసమృద్ధు లగుదురు; శంఖినీ తీర్థంబాడి యుత్తమరూపంబు వడయుదురు; యక్షేంద్ర తీర్ధం బాడి తరండకుం డను ద్వారపాలకుం జూచినవారు సరస్వతీ స్నాతులైనవారు నగ్నిష్టోమఫలంబు వడయుదురు; మాతృతీర్థ దర్శనంబునం బ్రజావృద్ధి యగు; బ్రహ్మావర్తంబును, శరవణంబునుం జూచిన, సర్వవ్యాధి విముక్తు లగుదురు; శ్వావిల్లోమాపహం బను తీర్థంబునం దేకాదశతీర్థంబులు గల; వందుఁ బ్రాణాయామంబు సేసిన విప్రులకు స్వలోమాపనయనం బగు; నెఱుకుచేత నేయంబడి కృష్ణమృగంబు లెందేని నొక్కతీర్థంబు సొచ్చి మానుషత్వంబు వడసె నట్టి మానుష తీర్థం బాడి సర్వదురిత విముక్తులై దేవత్వంబు వడయుదురు; దాని తూర్పున నొక్కయిరవున నాపగ యను మహానదిం బితృతర్పణంబు సేసి పితృదేవోద్దేశంబున నొక్కబ్రాహ్మణునకుం గుడువం బెట్టినఁ గోటిబ్రాహ్మణులు గుడిచిన ఫలంబగుఁ, బితృదేవతలు దృప్తియు నొందుదురు; బ్రహ్మోదుంబరంబు సప్తర్షి కుండంబుఁ గేదారంబును జూచి బ్రహ్మలోకంబు వడయుదురు; కపిల కేదారంబుఁ జూచి పాపవిముక్తులై యదృశ్యు లగుదురు; సరకం బను తీర్థంబాడి కృష్ణచతుర్దశి నాఁ డీశ్వరుం బూజించి యెల్ల కోర్కులం బడయుదురు; మూఁడుకోట్ల కూపహ్రదంబులు గల యిలాస్పదం బను తీర్థంబాడి పితృతర్పణంబులు సేసినవారికి వాజపేయఫలం బగుఁ; గిందాన కింజప్యంబు లను తీర్థంబులందుఁ జేసిన దాన జపంబు లక్షయంబు లగు; నారదతీర్థం బైన యంబాజన్మంబునందుఁ బ్రాణత్యాగంబు సేసినవారు సర్వలోకంబులం బడయుదురు; శుక్లదశమిం బుండరీకం బను తీర్థంబాడి పౌండరీక ఫలంబు వడయుదు; రందు వైతరణీస్నాతులై రుద్రునకు నమస్కరించి సర్వపాపవిముక్తు లగుదు; రెందేని దేవత లనేకసహస్రవర్షంబులు దపంబు సేసి రట్టి ఫలకీవనం బను తీర్థంబాడి యగ్నిష్టోమాతిరాత్రఫలంబులు వడయుదురు; ద్వైపాయనుం డనేకతీర్థంబులు మిశ్రీకరించుటం జేసి మిశ్రకం బనఁబరఁగిన తీర్థం బాడినవారికి సర్వతీర్థస్నానఫలం బగు; వ్యాస వనంబును మనోజవంబును మధువటియు నను తీర్థంబుల నాడిన గో సహస్రదాన ఫలంబు వడయుదురు; కౌశికీ దృషద్వతీ సంగమంబున స్నాతులై సర్వపాప విముక్తు లగుదురు; కిందత్తంబునఁ దిలప్రస్థదానంబు సేసి పితరుల ఋణంబు నీఁ గుదు; రహస్సుదిన తీర్థంబుల నాడి సూర్యలోకప్రాప్తు లగుదురు; మృగధూమంబున గంగాస్నాతులై మహాదేవు నర్చించిన మహాత్ము లశ్వమేధ ఫలంబు వడయుదురు; వామనం బను తీర్థంబాడి వామను నర్చించినవారు విష్ణులోకప్రాప్తు లగుదురు; పావనంబను తీర్థంబాడి కులంబు పవిత్రంబు సేయుదురు; శ్రీకుంజంబున సరస్వతీ స్నాతులై యగ్నిష్టోమ ఫలంబు వడయుదురు; ఋషు లెందే నుండి యాత్రాపరులై కురుక్షేత్రంబునకుం బోదు రట్టి నైమిశకుంజం బాడి ఋషితృప్తి సేయుదురు; బ్రహ్మతీర్థం బాడి వర్ణాంతరులు బ్రాహ్మణు లగుదురు; బ్రాహ్మణులు బ్రహ్మలోక ప్రాప్తు లగుదురు. | 264 |
| సీ. |
అనఘుఁడు మంకణుం డను నొక్క బ్రహ్మర్షి | తన చేయి వ్రయ్యంగ దర్భఁ గొనిన సాంద్రమై శాకరసం బందు నిర్గతం | బగుడును హర్షించి యాడుచున్నఁ జూచి సహింపక సురలును మునులును | హరుపాలి కరిగి ‘దేవాదిదేవ! మునినృత్త మే విధంబున నివృత్తం బగు | నట్లుగాఁ జేయవే’ యనిన హరుఁడు |
|
| ఆ. |
దపసిరూప మపుడు ధరియించి యమ్ముని | కడకు వచ్చి, ‘యేమి కారణమున నాడె? దేమి విస్మయం బిందుఁ జూచితి? | చెప్ప నుచిత మేనిఁ జెప్పు’ మనిన. |
265 |
| వ. | ‘నా కరంబున శాకరసంబు వెలువడిన విస్మితుండ నయి హర్షించి యాడెద’ ననిన ‘నిది యేమి విస్మయంబు; దీనిం జూడు’ మని హరుండు తన యంగుష్ఠంబున యంగుళి తాడనంబు చేసిన నందు హిమసన్నిభం బయిన భస్మంబు వెలువడినం జూచి, లజ్జితుం డయి ‘నీవు పరమేశ్వరుండ’ వని నమస్కరించి, వేదమంత్రంబుల స్తుతియించి. ‘దేవా! నీ ప్రసాదంబున నాకుఁ దపోవర్ధనంబు గావలయు’ ననిన, నమ్మునివరునకు నీశ్వరుండు గరుణించి ‘నీకుఁ దపోవర్ధన మగు; నేను నీ యాశ్రమంబున నుండుదు’ ననియె; నట్టి సప్తసారస్వతతీర్థంబు లాడినవారికి సారస్వతసిద్ధి యగు; బ్రహ్మాదిదేవతలచే నధిష్ఠితంబు లయిన యౌశనసతీర్థంబును గపాలమోచనంబు, విశ్వామిత్రంబుఁ గార్తికేయంబు ననియెడు తీర్థంబుల నాడి పాపవిముక్తు లయి బ్రహ్మలోకంబు వడయుదురు. | 266 |
| క. |
వేదములయందు వినఁగఁ బృ | థూదకతీర్థంబ యుత్తమోత్తమము సురేం ద్రాది సురవరులకును వ్యా | సాది మహాయోగివరుల కాస్పద మగుటన్. |
267 |
| వ. | అందు శరీరత్యాగంబు చేసినవార లపారపాపవిముక్తులై ముక్తు లగుదురు; సురకన్యా సరస్వతీ సంగమ స్నాతులైనవారు బ్రహ్మహత్యాది పాతకంబులవలనఁ బాయుదురు; దర్భినిర్మితంబైన యర్థకీల తీర్థం బాడిన శూద్రులు బ్రాహ్మణు లగుదురు, బ్రాహ్మణులు పరమసిద్ధు లగుదురు; శతంబును సహస్రంబును నను తీర్థంబు లందుఁ జేసిన జపదానోపవాసంబులు శతసహస్రగుణంబులగు; వేల్పు లెల్లం గుమారు సేనాపతింగా నెందే నభిషేకించి రట్టితైజసం బను తీర్థంబును దాని తూర్పున నుండు కురుతీర్థంబును స్వర్గద్వారం బను తీర్థంబును జూచినవారికి స్వర్గద్వారంబు వివృతం బగు; రుద్రపత్ని యను తీర్థంబున శంకరనారాయణుల నర్చించి సర్వదుఃఖ విముక్తు లగుదురు; స్వస్తిపురంబుఁ బ్రదక్షిణంబు సేసి గో సహస్ర దాన ఫలంబు వడయుదురు; గంగమడువున నొక్క కూపంబున మూఁడుకోట్ల తీర్థంబుల సన్నిహితంబులై యుండు; నందుఁ గృతస్నాను లయినవారికి సర్వతీర్థస్నానఫలం బగు; బదరీవనంబునందు వసిష్ఠాశ్రమంబునం ద్రిరాత్రంబులు బదరీఫల భక్షణంబు సేసి పాపవిముక్తు లగుదు; రేకరాత్రం బను తీర్థంబున నేకరాత్రోపవాసంబు సేసి బ్రహ్మలోకంబు వడయుదు; రాదిత్యాశ్రమం బను వనంబున నాదిత్యుం బూజించి యాదిత్యలోకగతు లగుదురు; దధీచి తీర్థంబునం గన్యాశ్రమంబునందుఁ ద్రిరాత్రంబు వసియించినవారికి స్వర్గఫలం బగు. | 268 |
| క. |
జలరుహసంభవుఁ డాదిగఁ | గల వేల్పులు ఋషులు సిద్ధ గరుడోరగులున్ నెలనెల సేవింతురు భూ | తలమున సన్నిహిత యనఁగఁ దగు తీర్థంబున్. |
269 |
| వ. | సూర్యగ్రహణంబున దాని నాడినవారు శతాశ్వమేధ ఫలంబు వడయుదురు; ధర్ముఁడు తపంబు సేసిన ధర్మతీర్థం బాడి ధర్మశీలు రగుదురు; జ్ఞానపావనంబును సౌగంధికంబును నను తీర్థంబుల నాడినం జూచిన సర్వపాప విముక్తు లగుదురు; దేవశ్రవ యను సరస్వతీహ్రదంబునందు వల్మీకంబున వెలువడు జలధార లాడి పితృతర్పణంబు సేసిన వా రశ్వమేధ ఫలంబు వడయుదురు; సుగంధయు, శతకుంభయుఁ, బంచయక్షయుఁ, ద్రిశూల ఖాతయు నను తీర్థంబు లాడి దుర్గతులవలనం బాయుదురు; తొల్లి పార్వతి యెందేని శాకాహారిణియై దివ్యసహస్రవర్షంబులు తపంబు సేసె నట్టి శాకంభరీతీర్థం బాడి యొక్కదివసంబు శాకాహారులైనవారు పండ్రెండేండ్లు శాకాహార తపంబు సలిపినవారి ఫలంబు వడయుదురు; సువర్ణాఖ్యం బను తీర్థంబున రుద్రుం బూజించి రుద్రలోక గతు లగుదురు; ధూమావతి యను తీర్థంబును రథావర్తం బను తీర్థంబును ధార యను తీర్థంబు నాడి శోకవిముక్తు లగుదురు. | 270 |
| క. |
ధారుణిలోపల స్వర్గ | ద్వారం బయి ఋషినిషేవితం బగు గంగా ద్వారం బాడిన ధన్యులఁ | జేరును శతకోటితీర్థసేవాఫలముల్. |
271 |
| వ. | మఱియు సప్తగంగా సంగమంబును ద్రిగంగా సంగమంబును శక్రావర్తంబును గనస్వలంబును గంగా సరస్వతీ సంగమంబు నాదిగాఁ గల పుణ్యతీర్థంబుల నాడి పుణ్యలోకంబులు వడయుదురు; భద్రకర్ణేశ్వరంబున రుద్ర పూజయు నరుంధతీవటంబును సింధుప్రభవంబును యమునాప్రభవంబు నను పుణ్యతీర్థంబుల సేవయు సర్వసిద్ధికరంబులు; వేదిక యను తీర్థంబును ఋషికుల్య యను తీర్థంబును గృత్తికా మఘ తీర్థంబులును విద్యాతీర్థంబును వేతసిక యను తీర్థంబునుం జూచి దురితంబులవలనం దొలంగుదురు; బ్రహ్మతీర్థం బాడి పద్మవర్ణయానంబుల బ్రహ్మలోకగతు లగుదురు. | 272 |
| చ. |
సురుచిరకీర్తి! నైమిశముఁ జూచిన మాత్రన పాయుఁ బాప మ చ్చెరువుగ; నందు మాసము వసించి యనంతఫలంబు లొందఁ గాం తురు; బహుతీర్థసేవనముతోడ సమానము నైమిశంబునం దరుదుగ నొక్కనాఁడు శుచియై యుపవాసము సేయఁ గాంచినన్. |
273 |
| వ. | మఱియు గంగోద్భేద తీర్థంబు నిందీవర తీర్థంబు గంగాద్వారంబు దిశాపతి తీర్థంబు లనియెడు తీర్థంబుల నాడి వాజపేయఫలంబుఁ బడయుదురు; బాహుద యను తీర్థం బాడిన ననేకసత్రయాగఫలం బగు; నెందేని రాముండు స్వర్గగతుం డయ్యె నట్టి సరయూప్రదేశంబున గోప్రదానం బాడియు, దేవతలకు ఋషులకు యజ్ఞ భూమియయిన తీరంబులు గల గోమతి నాడియు నశ్వమేధ ఫలంబు వడయుదురు; కోటితీర్థంబునం గుమారు నర్చించియు, వారణాసియందు రుద్రు నర్చించియుఁ, గపిలాహ్రదం బాడియు రాజసూయ ఫలప్రాప్తు లగుదురు; మార్కండేయ తీర్థం బయిన గంగాగోమతీ సంగమం బాడియు బ్రహ్మకల్పితం బయిన యూపంబుఁ బ్రదక్షిణంబు సేసియు వాజపేయఫలంబు వడయుదురు. | 274 |
| సీ. |
పలువురఁ గొడుకులఁ బడయంగ వలయు; నం | దొక్కరుం డయినను నోపి గయకు నరుగునో యనియును, నశ్వమేధం బొప్పఁ | జేయునో యనియును, శ్వేత మైన యాఁబోతు విడుచునో యనియును గోరుదు | రనవద్యు లైన గృహస్థు లట్టి గయ కేఁగి యుభయ పక్షములు వసించిఁ | గడుఁ బుణ్యు లుభయపక్షములవారి |
|
| ఆ. |
నుద్ధరింతు; రంద యొగిఁ బిండ మిడిన వా | రనఘ! పితృదయను గృతార్థు లగుదు; రందు ఫల్గుతీర్థ మాడినవారికిఁ | బరమసిద్ధితో శుభంబు పెరుఁగు. |
275 |
| వ. | మఱి యక్షిణీతీర్థంబునందు జలపానంబు సేసి బ్రహ్మహత్యాది దోష విముక్తు లగుదురు; మణినాగం బను తీర్థం బాడినవారికి నాశీవిషవిషంబు లొందవు; గౌతమవనంబునం దహల్యాహ్రదం బాడి యుదపానం బను తీర్థం బాడియు నశ్వమేధ ఫలంబుఁ బడయుదురు; రాజర్షి జనక కూపం బాడి విష్ణులోకప్రాప్తు లగుదురు; కంపనయు మహానదియు నను తీర్థంబుల నాడినవారు పౌండరీక ఫలంబు నొందుదురు; దేవపుష్కరిణిని మహేశ్వరధారను మహేశ్వరపదంబున నాడిన నశ్వమేధఫలంబు వడయుదురు; తొల్లి కూర్మరూపుం డయిన యసురచేతం గోటితీర్థంబు లపహృతంబు లయిన వానిఁ దెచ్చి, విష్ణుఁ డెందేని నిలిపె నట్టి మహేశ్వరపథం బను తీర్థంబాడియు, విష్ణుస్థానం బయిన సాలగ్రామం బను తీర్థంబాడి విష్ణు నర్చించియు, నందు సన్నిహిత చతుస్సముద్రం బయిన కూపంబు నాడియు విష్ణులోకగతు లగుదురు; భరతాశ్రమంబునఁ, జంపకారణ్యంబున దేవీసహితు నీశ్వరుం బూజించి మిత్రావరుణలోకంబు వడయుదురు; కన్యాసంవేద్యం బను తీర్థంబునఁ గన్యాదానంబు చేసి యక్షయఫలప్రాప్తు లగుదురు; దేవకూటం బను తీర్థంబాడి బ్రహ్మలోకం బుఁబడయుదు; రెందేని విశ్వామిత్రుండు సిద్ధింబొందె నట్టి కౌశికహ్రదం బాడియుఁ, గుమారవీరాశ్రమంబున నొక్కమాసంబు వసించియు నశ్వమేధ ఫలంబు వడయుదు; రగ్నిధారయుఁ బితామహ సరంబునం బుట్టిన కుమార ధారయు నాడి, త్రిరాత్రోపవాసంబు సేసినవారు బ్రహ్మహత్యాది దోషవిముక్తు లగుదురు; గౌరీశిఖరకుండం బాడిన నందినీకూపం బాడిన నశ్వమేధఫలం బగుఁ; గాళికా కౌశికా సంగమంబునందుఁ ద్రిరాత్రోపవాసంబు సేసినవారు సర్వపాప విముక్తులగుదు; రూర్వశీతీర్థం బాడిన సర్వపూజార్హు లగుదురు; గోకర్ణంబను తీర్థంబాడి జాతిస్మరణంబు వడయుదురు; సరస్వతీ తీర్థస్నాతులయి వృషభ ద్వీపంబునం గుమారుఁ బూజించి దేవవిమానగతు లగుదురు; నందయు, నౌలకమును, గరతోయంబును, గంగాసాగరసంగమంబు నను తీర్థంబు లాడి శతాశ్వమేధ ఫలంబు వడయుదురు; శోణా నర్మదాప్రభవంబును, బదరీతీర్థంబును నాడి యాయుష్మంతు లగుదురు; మహేంద్రంబును రామతీర్థంబును, మతంగ కేదారమ్మును, వంశగుల్మంబు నను తీర్థంబుల నాడి యశ్వమేధఫలంబు వడయుదురు. | 276 |
| తే. |
పరమమైన తీర్థంబు శ్రీపర్వతంబు | నందు దేవహ్రదం బాడి యాదిదేవు నీశు నర్చించి వడయుదు రిష్టఫలము | నశ్వమేధఫలంబును నవనిజనులు. |
277 |
| వ. | తొల్లి శతక్రతుండు నూఱుక్రతువులు సేయుటంజేసి పవిత్రంబయిన కృష్ణవేణియందు దేవహ్రదం బాడిన సర్వపాపవినాశనం బగుఁ; బాండ్యపర్వతంబునం గావేరీతీర్థంబును, దుంగభద్రయు, సముద్రతీర్థంబును, గన్యాతీర్థంబును నాడి యశ్వమేధఫలంబు వడయుదురు; గాయత్రీస్థానంబునం ద్రిరాత్రంబు గాయత్రీజపంబు చేసినవారికి జన్మ దుఃఖంబులు లేవు; పెన్న యను మహానది నాడిన మయూరహంస విమానగతు లగుదురు; గోదావరీ స్నానంబు సేసిన దశాశ్వమేధ ఫలంబు వడయుదురు; పయోష్ణియు, దండకారణ్యంబును, శరభంగాశ్రమంబును, శుక్రాశ్రమంబును, జమదగ్నిసేవితంబయిన శూర్పారకంబును, సప్తగోదావరీ తీర్థంబును నాడిన పుణ్యులు పుణ్యలోకప్రాప్తు లగుదురు. | 278 |
| సీ. |
అసురుల భయమున నడఁగిన వేదంబు | లోంకారపూర్వమై యుండ నాంగి రసుఁ డుద్ధరించి సారస్వత ప్రముఖులఁ | జదివించె నెందేని శాశ్వతముగ నమరనియుక్తుఁడై యజియించె నెందేని | భృగుఁ డెల్లవారికిఁ బేర్మి నట్టి రమణీయతుంగకారణ్యంబు సూచిన | మాత్రన దురితకర్మంబు లెల్లఁ |
|
| తే. |
బాయుఁ; గాలంజరం బను పర్వతంబు | నందు దేవహ్రదం బాడి యభిమతములు వడయుదురు; మేధికంబునాఁ బరఁగు తీర్థ | మాడి మేధాసమన్వితు లగుదు రెందు. |
279 |
| వ. | మఱి చిత్రకూటంబున మందాకిని సేవించి, పితృస్థానంబునం గుమారులం బూజించి, జ్యేష్ఠస్థానంబున రుద్రు నర్చించి రామనివాసం బైన శృంగిబేరపురంబున గంగాస్నాతు లయి గంగాధరు నర్చించియు సర్వపాప విముక్తు లగుదురు. | 280 |
| క. |
యాగశతంబులకంటెఁ బ్ర | యాగ నివాసము విశేష మని మునులు మహా యోగులు సిద్ధులు సాధ్యులు | నాగులు నందుండుదురు మనఃప్రియ మెసఁగన్. |
281 |
| వ. | అది ప్రజాపతి యజ్ఞవేది గావున నందు మూఁడగ్ని కుండంబు లెప్పుడుఁగానంబడు; మఱి వేదంబులు యజ్ఞంబులు మూర్తిమంతంబులై యఱువదికోట్లపదివేలు తీర్థంబులు సన్నిహితంబులై గంగా యమునా సంగమంబు సేవించియుండు; నందుఁ గృతస్నాను లైనవారు రాజసూయాశ్వమేధులయు సత్యవాదులయుఁ జతుర్వేదాధ్యయనులయుఁ బుణ్యలోకంబులు వడయుదురు; భోగవతియు వాసుకియు హంసవ్రతంబు నను తీర్థంబుల నాడి దశాశ్వమేధఫలంబులు వడయుదురు. | 282 |
| క. |
విదితముగఁ దీర్థకీర్తనఁ | జదివిన ధన్యులకు వినిన సజ్జనులకు న భ్యుదయ మగు సర్వతీర్థస | ముదయ స్నాన బహుయాగముల ఫలము లగున్. |
283 |
| క. |
సకలదురితముల వాయుదు | రకలంకమనస్కు లగుదు రార్యోత్తమవ ర్తకు లగుదురు సజ్జనగుణ | నికరంబుల వెలయుదురు సునిశ్చితమతులై. 283 (ఆ) |
|
| చ. |
వ్రతములు లేనివారు, నుపవాస పరాఙ్ముఖు లైనవారు, దు ర్మతులు, విహీనశౌచులుఁ గ్రమంబునఁ దీర్థము లాడనోప; రా తతగుణశాలి వీ వఖిలధర్మవిదుండవు గావునన్ శుభ స్థితిఁ జని తీర్థసేవనము సేయుము నీకు నభీష్టసిద్ధిగన్. |
284 |
| వ. | అని సకల తీర్థ కథనంబు సెప్పిన, పులస్త్యువచనంబున భీష్ముండు దొల్లి యెల్ల తీర్థంబులు సేవించి కృతార్థుం డయ్యెఁ; గావున నీవును దీర్థసేవ చేసి. | 285 |
| క. |
పూరు పురూరవు లట్లు భ | గీరథ రఘుపతుల యట్లు కృతకృత్యుఁడ వై ధారుణి రక్షింపుము వి | స్తారగుణాధార! ధీర! ధర్మతనూజా! |
286 |
| వ. | రోమశుం డను దేవర్షి దేవలోకంబుననుండి నీకడకు వచ్చుఁ; దదుపదేశంబున ధౌమ్యానుమతుండ వయి తీర్థసేవనఁ జేయు’ మని చెప్పి నారదుం డరిగిన, నజాతశత్రుండు ధౌమ్యుం జూచి యిట్లనియె. | 287 |
| చ. |
‘అలయక మాకు నందఱ కహర్నిశముం బ్రియకారి యైన య త్యలఘుపరాక్రమాన్వితు మహాభుజు నర్జును దివ్యసాయకం బులు వడయంగ నొక్కరున పుచ్చితిఁ దద్దయు వేడ్క నెద్దియుం దలఁపక; యిప్డు దద్విరహితమ్మగు కామ్యక మొప్ప దయ్యెడిన్. |
288 |
| వ. | అంబుదాగమనం బపేక్షించు చాతకంబు లట్లు మన మందఱ మర్జునాగమనంబు ప్రతీక్షించుచున్నవారము; వాఁడును దన పూనిన కార్యంబు నిర్వహించి కాని నివృత్తుండు గాఁ; డవశ్యంబును దివ్యాస్త్రంబులు వడసి యాతని వచ్చునంతకుఁ దీర్థసేవ చేయుద’ మనినఁ, ‘గరంబు లగ్గ్గగు, నట్ల చేయుద’ మని. | 289 |