| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము |
| ఉ. |
నాలుగుదిక్కులందును వినన్ విదితంబగుచున్న పుణ్యతీ ర్థాలి తెఱం గెఱుంగఁగ మహాత్ముఁడు ధౌమ్యుఁ డజాతవైరి కం దోలిన చెప్పుచున్న తఱి నొప్పుగ రోమశుఁ డేఁగుదెంచెఁ దే జోలలితుండు నిర్మలయశుం డగు ధర్మతనూజుపాలికిన్. |
290 |
| వ. | ఇట్లు వచ్చిన మహాముని నతిభక్తి ననుజ బ్రాహ్మణ సహితుండై ధర్మజుండు పూజించి ‘మునీంద్రా! యెందుండి వచ్చితి?’ రని యడిగిన నాతనికి రోమశుం డిట్లనియె. | 291 |
| తే. |
‘ఎల్లలోకంబులును జూచి యింద్రలోక | లోకనార్థినై యే నింద్రలోకమునకుఁ బోయి సురరాజుచేఁ బ్రీతిఁ బూజితుండ | నై, మహీనాథ! యందు నీ యనుజు ననఘు. |
292 |
| ఉ. |
ఈసున నీశుఁ దొట్టి సురలెల్ల నభీష్టవరంబు లిచ్చుటం జేసి కృతార్థుఁ డైన కురుసింహము నూర్జితశౌర్యు నర్జునున్ భాసురతేజు విశ్వపరిపాలకుఁ డైన మహేంద్రుతోడ నే కాసన మెక్కియున్న మహిమాస్పదు నింద్రతనూజుఁ జూచితిన్. |
293 |
| క. |
బలవంతు లైన భీష్మా | దుల నర్జునుఁ డోర్చు నూర్జితుండై; మఱి పో రులఁ గర్ణుండు పదారవ | కళకు సమానుండు గాఁడు కవ్వడితోడన్. |
294 |
| వ. | అతని యున్న విలాసంబు సూచి విస్మితుండ నయిన నాకు నింద్రుండు తత్ప్రభావంబు సెప్పి ‘వీఁ డమృత సంభవం బయిన పాశుపతం బను దివ్యాస్త్రంబుఁ బరమేశ్వరుచేతను, నాచేతను యమ వరుణ కుబేరాదుల చేతను దివ్యాయుధంబులఁ బడసె; నితండు మనుష్యుండు గాఁడు; దివ్యపురుషుం; డన్యుల కశక్యం బయిన దేవకార్యంబు దీర్చి మసలక వచ్చు నని మర్త్యలోకంబునకుం బోయి భ్రాతృసహితుం డయిన ధర్మరాజునకుం జెప్పు’ మనిన వచ్చితి’ నని వెండియు నిట్లనియె. | 295 |
| క. |
‘నిరతముగఁ దీర్థసేవా | పరులగు శాంతాత్ములకుఁ దపస్వులకును దు ష్కర మెద్దియు లే దని చె | చ్చెర ధర్మజుఁ దీర్థసేవ సేయింపు మొగిన్. |
296 |
| క. |
అని పనిచిన నమరేశ్వరు | పనిఁ దత్పార్శ్వమున నుండి పన్నుగ నిట యేఁ జనుదెంచితి నీ కార్యము | ధనంజయున కభిమతంబు ధరణీనాథా! |
297 |
| క. |
అనవద్య తీర్థసేవన | మును గపిలా స్వర్ణ దానములు నుగ్రతపం బును జేయనివానికిఁ బో | లునె పడయఁగఁ బేర్మి నుభయలోకసుఖంబుల్. |
298 |
| వ. | ఏను దొల్లి భూమిం గల తీర్థంబు లెల్ల నినుమాఱు సూచితి; నిప్పు డింద్రు నియోగంబున నీతోడన వచ్చి యఖిల తీర్థసేవ సేసెద’ ననిన ధర్మజుం డతని కిట్లనియె. | 299 |
| ఉ. |
‘నన్నుఁ దలంచి తీర్థగమనం బొనరింపఁగఁ బంచె నట్టె వి ద్వన్నుత! దేవవల్లభుఁడు; దానఁ గృతార్థుఁడ నైతి; దానిపై నిన్ను సహాయుఁగాఁ బడసి నెమ్మి నశేషవిశేషతీర్థముల్ పన్నుగఁ జూడఁ గాంచి కడుభవ్యుఁడ నైతి మునీంద్ర! నీదయన్. |
300 |
| ఆ. |
విజయుకుశలవార్త వేడుక నీచేత | వినినయంతకంటె విస్తరిల్లె; హృదయసంప్రమోద మీ రెంట నా’ కంచుఁ | దద్ద సంతసిల్లె ధర్మసుతుఁడు. |
301 |
| వ. | ‘మునీంద్రా! యేను దొల్లియు నారద ధౌమ్యుల వచనంబులం దీర్థగమనోన్ముఖుండనై యున్నవాఁడ; నిప్పుడు భవన్నిదేశంబునం దీర్థసేవ సేసి కృతార్థుండ నగుదు’ నని కృతనిశ్చయుండై భిక్షాభుజు లయిన బ్రాహ్మణులను యతులను రోమశువచనంబున నివర్తించి, ధౌమ్యపురస్కృత కతిపయ బ్రాహ్మణులతో ననుజులుం దానును గృష్ణాసహితుం డయి కామ్యకవనంబున మూఁడుదినంబులు వసియించి మార్గశీర్ష మాసావసానంబునం దీర్థసేవార్థంబు గృతప్రస్థానుం డయిన యుధిష్ఠిరునకు బ్రాహ్మణు లిట్లనిరి. | 302 |
| ఉ. |
‘నీ యనుజుల్ ధనుర్ధరు లనింద్యచరిత్రులు దీర్ఘ తీక్ష్‌ణకౌ క్షేయకపాణు లత్యమలకీర్తులు గావఁగ రోమశుండు తే జోయుతుఁ డెల్లతీర్థములుఁ జూపఁగఁ దీర్థము లాడువేడ్క ల క్ష్మీయుత! యిప్డు ని న్ననుగమింపఁగఁ గంటిమి పుణ్యసంపదన్. |
303 |
| వ. | రాక్షసపిశాచశ్వాపదంబుల కారణంబున నడవులలో నేకతంబ యరిగి తీర్థసేవ చేయ మాయట్టివారికి నశక్యంబు గావున మీతోడ వచ్చెద’ మని బ్రాహ్మణులు ధర్మరాజుచేత ననుజ్ఞాతు లై రంత. | 304 |
| క. |
పారాశర్యుఁడు బర్వత | నారదులును బాండురాజనందనుల గుణో దారుల ననఘులఁ దీర్థ | ప్రారంభులఁ గానవచ్చి పరమప్రీతిన్. |
305 |
| క. |
వారలచేఁ బూజితులై | భూరి తపోధనులు లోకపూజ్యులు ధర్మ ప్రారంభనిత్యమతులకు | వారల కిట్లనిరి సత్యవచనులు గరుణన్. |
306 |
| వ. | ‘శారీరనియమంబులు మానుష వ్రతంబు లనంబడు; మనోబుద్ధి శౌచంబులు దేవవ్రతంబు లనంబడు; నట్టి సౌమ్యవ్రత విశేషంబులు సలుపుచు ఋజుమార్గులరై తీర్థంబులు సేవించునది; తీర్థాభిగమనంబున మహాభిష నాభాగ భరత భగీరథ ముచుకుంద మాంధాతృ సగర సార్వభౌమాష్టక రోమపాదుల యట్ల శత్రుజయంబును సర్వలోకసుఖంబులు వడయుదు’ రని చెప్పి మునివరులు మువ్వు రరిగి; రంత నజాతశత్రుండు రోమశున కిట్లనియె. | 307 |
| క. |
‘ధరణి నధార్మికులగు కా | పురుషుల కభివర్ధనంబుఁ బుణ్యచరిత్రం బరఁగెడు ధార్మికులకు దు | ర్ధర మగు నవివర్ధనంబుఁ దగునె మునీంద్రా! |
308 |
| వ. | మఱియు నచేతనంబు లయ్యును గిరిసరిత్ సరోవరంబులు పుణ్యతీర్థంబులై జగత్పావనంబులై జనులకు దురితాపహరణంబు లైన కారణం బేమి?’ యని యడిగిన నతనికి రోమశుం డిట్లనియె. | 309 |