| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము |
| చ. |
‘వసుధ నధర్మవర్తు లగు వారల వర్ధన మెన్నడున్ సమం జసమయి నిల్వనేరదు; భృశంబుగ నాశము వొందు; దుర్మద వ్యసను లధర్మవర్తనఁ బ్రవర్ధితు లయ్యును నేము చూడ రా క్షసులును దైత్యదానవులుఁ గ్రాఁగరె తొల్లి సహస్రసంఖ్యలన్. |
310 |
| క. |
దేవతలు ధర్మవర్తులు | గావున నభివృద్ధిఁ బొంది ఘన మగు నిత్య శ్రీవిభవాన్వితు లయి ధర | ణీవల్లభ! యున్నవారు నిరుపమశక్తిన్. |
311 |
| క. |
ధర్మసుత! ధార్తరాష్ట్రుల | ధార్మికులై పెఱిఁగి రేనిఁ దడయక విధి చే నిర్మూలితు లగుదురు దు | ష్కర్మంబున నసురు లట్ల కడు నస్థిరులై. |
312 |
| వ. | అది యెట్లనిన నధర్మవర్తులయందు దర్పంబు పుట్టు; దర్పంబువలన మానంబు పుట్టు; మానంబువలనఁ గ్రోధంబు పుట్టుఁ; గ్రోధంబు వలనంజేసి లజ్జయు వృత్తంబునుం జెడు; నష్టలజ్జావృత్తులయినవారి నుపశమంబును లక్ష్మియు విడుచు. | 313 |
| క. |
మీ రమరసదృశులరు ధ | ర్మారంభవిశిష్టమతుల రగుటను సుచిర శ్రీరమ్యు లగుదు రాజి; జి | తారాతుల రగుదు రుద్ధతాహవములలోన్. |
314 |
| వ. | ధర్మవర్తులైన దేవతలు ఋషులు నాశ్రయించుటం జేసి తీర్థంబులు పవిత్రంబులై సర్వకామప్రదంబులై వర్తిల్లు చుండుఁ; దీర్థసేవను గ్రతువులను దానంబులను బ్రాహ్మణుల దీవనలను జనులు సర్వదుఃఖవిముక్తులయి శ్రేయఃప్రాప్తు లగుదు’ రని చెప్పిన నమ్మునివరునివలన నొండు ధర్మస్థితులు వించుఁబాండవు లరిగి నైమిశంబు, నశ్వతీర్థంబును, గంగాఘోషంబును, గన్యాతీర్థంబును, గోమతియును, బాహుదయును, మహానదియును, దేవ యజనం బయిన ప్రయాగయు, గంగా యమునా సంగమంబును నాడి, యందు బ్రాహ్మణులకు గో హిరణ్య దానంబులుసేసి, ప్రయాగం గొన్ని దినంబు లుండి, వేద విదులయిన బ్రాహ్మణులవలన వేదార్థంబు లెఱుంగుచుఁ జని, యనేక పుణ్యనదీసముద్భవం బయిన గయపర్వతంబును, రామసరంబును, బ్రహ్మసరంబును, వైవస్వత తీర్థంబునుం జూచి, గయయందు నక్షయవటంబున నార్షేయం బైన విధానంబునం జాతుర్మాస్యక్రతువులు సేసి, ఋషులవలనం బుణ్యకథలు వినుచున్న యవసరంబున శమఠుండను మహాముని ధర్మరాజున కిట్లనియె. | 315 |
| సీ. |
‘సరవి నాధూతరజః ప్రియపుత్త్రుండు | గయుఁ డను రాజర్షి క్రతువు లిందు బ్రహ్మసరంబునఁ బరఁగంగ మును చేసె; | నాతని యజ్ఞంబులందు సకల జనభుక్తశేషాన్నశైలంబు లిరువది | యేనగు సంఖ్య దా నెఱుఁగ నయ్యెఁ; దత్కృతక్రతుబహుదక్షిణాసంఖ్యయు | నుడు సికతా సంఖ్యయును నెఱుంగఁ |
|
| ఆ. |
గాదు జనుల; కట్టి గయునామమున గయ | యనఁగఁ బుణ్యతీర్థ మయ్యె నిదియుఁ; బితృహితార్థ మిందుఁ బిండప్రదానంబు | సేయఁ గనిన నిష్టసిద్ధి గలుగు’. |
316 |
| వ. | అని చెప్పిన శమఠువలన గయామాహాత్మ్యంబు విని యగస్త్యాశ్రమంబున కరిగి; రంత ధర్మరాజు రోమశున కిట్లనియె. | 317 |
| మధ్యాక్కర |
‘వాతాపి యనువాని నెట్లు సంపె సద్వంద్యుఁ డగస్త్యుఁ? డాతతతేజో -ధికుండు నా విందు నమ్మునినాథుఁ; బ్రీతిని దచ్చరితంబు వినఁగ నభీష్ట మిం’ దనిన నాతని కిట్లని చెప్పె రోమశుం డన్ముని పేర్మి. |
318 |
| క. |
‘వీతభయుఁ డిల్వలుండును | వాతాపియు ననఁగఁ బరఁగు వరదైత్యులు వి ఖ్యాతబలులు వసియింతు ర | రాతిహరుల్ మణిమతీపురంబున నొప్పన్. |
319 |
| వ. | అం దగ్రజుం డయిన యిల్వలుం డొక్కబ్రాహ్మణు నతిభక్తి నర్చించి, ‘నాకు సకలకామసిద్ధికరం బగు మంత్రం బుపదేశించు’ మని ప్రార్థించి విఫలప్రార్థనుండై యరిగి తన తమ్ముఁ గామరూపధరు వాతాపి నపుడు మేష రూపంబు సేసి వధియించి వాని మాంసం బిమ్ముగా వండించి దాని నా విప్రునకుఁ గుడువం బెట్టించి. | 320 |
| తే. |
విప్రుకడుపులో నున్న యవ్వీరు ననుజుఁ | బిలిచె ‘వాతాపి! ర’ మ్మని ప్రియముతోడ; జీవితుం డయి వాఁడు చెచ్చెరను విప్రు | కడుపు వ్రచ్చుచు వెలువడి క్రాఁచె విప్రు. |
321 |
| వ. | అది మొదలుగా నిల్వలుండు దనకడకు నతిథులై వచ్చు విప్రుల నప్పాట నంతకుపురంబున కతిథులం జేయు చున్నంత; నట నగస్త్యుండు బ్రహ్మచర్యాశ్రమంబునం బెద్దకాలం బుగ్రతపంబు సేయుచు వనంబునఁ బరిభ్రమించు వాఁ డొక్క సల్లకీపల్లవంబున నధోముఖులై వ్రేలుచున్న తన పితరులం జూచి’ యివ్విధంబున మీ రున్న కారణం బేమి?’ యని యడిగినఁ బితరు లిట్లనిరి. | 322 |
| తే. |
‘అయ్య! యేము నీ పితరుల; మధికనిష్ఠ | బ్రహ్మచారివై నీవు తపంబు సేయు చున్నవాఁడవు సంతతి నొల్ల; కదియ | కారణంబుగ మా కూర్ధ్వగతియు లేదు. |
323 |
| వ. | ఇంకనైనను నీవు వివాహంబై సంతానంబు వడసిన మాకుఁ బుణ్యగతి వడయ నగు’ ననిన ‘నట్ల చేయుదు’ నని యగస్త్యుండు తన తపశ్శక్తింజేసి పుత్త్రకాముండైన విదర్భరాజున కొక్కకూఁతుం బుట్టించిన నది లోపాముద్ర యను నామంబుతో జలంబులయందు నలినియుంబోలె వినీతునందు లక్ష్మియుంబోలె నుద్యుక్తునందు విద్యయుం బోలెఁ బెరిఁగి యౌవనంబు దాల్చి రూపవతియై వయోరూపంబుల ననురూప లయిన కన్యకా శతంబుతో నొప్పుచున్నంత. | 324 |
| క. |
తరుణి నగస్త్యుభయంబున | వరియింపఁగ నోడి రాజవరులు మనోజా తురు లగుచుండిరి; తగియెడు | వరు రోయుచునుండె సుతకు వైదర్భుండున్. |
325 |
| వ. | అంత నగస్త్యుండు విదర్భరాజుపాలికి వచ్చి ‘నాకు లోపాముద్ర నిచ్చునది’ యనిన, విదర్భేశ్వరుండు తన తనూజ నమ్ముని కీ నోపక మనంబున ననుతాపించి యక్కన్యకం జూచి యాత్మగతంబున. | 326 |
| ఉ. |
‘నారలు గట్టి కూర లశనంబుగ నుగ్రవనంబులోఁ దపో భారమునం గృశుం డయిన బ్రాహ్మణుఁ డీ లలితాంగిఁ బెండ్లియై నారలు గట్టి కూర లశనంబుగ నుగ్రవనంబులోఁ దపో భారము దాల్చియుండు మని పంపక మిన్నక యుండ నేర్చునే? |
327 |
| ఆ. |
ఎఱిఁగి యెఱిఁగి దీని నె ట్లీఁగ నగు భోగ | యోగ్యయైన యది పయోజనేత్ర; యీనినాఁడు శాప మిచ్చుఁ గా; కిమ్ముని | యేల సైఁచు? నింక నెట్టులొక్కొ!’ |
328 |
| వ. | అని వైదర్భుండు దానునుం బత్నియు వగచుచున్న వారిపాలికి వచ్చి లోపాముద్ర యిట్లనియె. | 329 |
| క. |
‘ఇమ్మునివరునకు నన్నుఁ బ్రి | యమ్మున నిచ్చునది; మీకు నతిచింతాభా ర మ్మేల?’ యనిన నిరువురు | నమ్ముదితకు సంతసిల్లి యధికవిభూతిన్. |
330 |