పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము
అగస్త్యు చరిత్రము (సం. 3-98-1)
వ. అక్కథకుండు శౌనకాది మహామునులకుం జెప్పె; నట్లు ధర్మతనయుం డగస్త్యు మాహాత్మ్యంబు విని వెండియుఁ దచ్చరిత్రంబు రోమశు నడిగిన, నమ్ముని యిట్లనియె. 2
సీ. ‘కృతయుగంబునఁ గాలకేయగణంబుతో | వృత్రుఁ డన్నసుర గర్వించి యమర
పతిఁ దొట్టి వేల్పుల బాధించుచున్నఁ ద | ద్భయమున నమరులు బ్రహ్మకడకుఁ
జని ‘పోరిలో వృత్రుఁ జంప నుపాయ మె | య్యదియొ మా కానతి’ మ్మన నజుండు
‘దివిరి సరస్వతీ తీరంబునందు ని | శ్చింతుఁడై తప మొప్పఁ జేయుచున్న
 
ఆ. యా దధీచికడకు నరిగి వేఁడుండు, ని | జాస్థు లిచ్చు మీకు నమ్మహాత్ముఁ;
డవి జయించు వజ్ర మాదిగా నిఖిలది | వ్యాయుధంబులై సురారివరుల.
3
వ. అందు వజ్రంబున నింద్రుండు వృత్రు వధియించు’ ననిన నమరు లెల్లం గమలాసను శాసనంబున దధీచి పాలికిం జని కృతప్రణాము లై యిట్లనిరి. 4
క. ‘భువనజనస్తుత! నిజగౌ | రవ మెసఁగఁగ నమరపతి పురస్కృతు లగు ని
ద్దివిజుల కెల్ల హితంబుగ | భవదస్థిచయంబు లిమ్ము పరమమునీంద్రా!’
5
వ. అనిన విని దధీచి సంతసిల్లి ‘కృతార్థుండ నైతి’ నని దేవహితార్థంబుగా నిజప్రాణంబుల విడిచె; నమరులెల్ల నమ్మహాముని యస్థు లాయుధంబులుగాఁ బరిగ్రహించి; రందు. 6
ఆ. త్వష్ట యంత నూఱుధారల రమ్యమై | యనలకణ కరాళ మైన వజ్ర
మొనరఁ జేసి ‘దీన నోర్వుము దైత్యుల’ | ననుచు నిచ్చె దాని నమరపతికి.
7
వ. అవ్వజ్రంబున నింద్రుండు వృత్రు వధియించె నంత. 8
చ. అనుపమదివ్యశస్త్రధరులైన యమర్త్యుల కాహవంబులో
మొనయక కాలకేయులు సముద్రముఁ జొచ్చి దివంబు లెల్ల న
వ్వనధి నడంగి యుండి బలవంతులు వెల్వడి రాత్రులెల్ల భూ
జనులకు బాధసేయుచు భృశంబుగ నుండిరి క్రూరచిత్తులై.
9
వ. మఱియు ‘విద్యాతపోయుక్తులై ధర్మచరితులైన వారి కారణంబున జగంబు లపాయంబు నొందక సుఖంబున్న యవి; గావున నట్టి వారిన రోసి వధియించి జగంబుల కపాయంబు సేయుద’ మని యసురులు వసిష్ఠాశ్రమంబున నూటతొంబదియేడ్వురను, జ్యవనాశ్రమంబున నూర్వురను, భరద్వాజాశ్రమంబున నిరువదుండ్రనుంగాఁ బలువురు బ్రాహ్మణుల బ్రహ్మమయుల వధియించి, భక్షించి, యిప్పాట ననవరతంబు నఖిల మునిగణాశ్రమంబుల కుపద్రవంబు సేయుచున్న. 10
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )