పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము
అగస్త్యుండు సముద్రోదకంబు పానంబు సేయుట (సం. 3-103-1)
వ. అనిన నగస్త్యుం ‘డట్ల చేయుదు’ నని యమరవరుల కెల్ల సంతోషంబుగా నప్పుడు. 37
సీ. రంగదుత్తుంగ తరంగ హస్తంబుల | నాడెడునది వోలె, నతుల వేగ
వాతావధూతమై వఱలెడునది వోలెఁ, | బర్వత కందరోపాంత తతులఁ
దొడరెడునదివోలె, ధ్రువఫేనవితతుల | నగియెడునది వోలె, నాగనక్ర
మకరకుల క్షుభ్యమాణమై తద్బాధ | కోపనియది వోలె, నుచ్చ భీమ
 
ఆ. నినద మగుచు నున్న నీరధి యొద్దకు | నమరగణముతో మహామునీంద్ర
గరుడ ఖచర సిద్ధ గంధర్వ పన్నగ | యక్షగణముతోడ నరుగుదెంచి.
38
ఉ. అందఱుఁ జూచుచుండఁగ మహాబ్ధిజలంబులఁ ద్రావె విష్టపా
నందకరుం డగస్త్యుఁ డఘనాశనుఁ; డట్లు పయోధి రిక్త మై
నం దిమి కూర్మ కర్కటక నక్ర భుజంగచయంబుతో భయం
బందుచుఁ గాలకేయులు బయల్పడి తోఁచిరి దానిలోపలన్‌.
39
వ. అంత. 40
క. గీర్వాణప్రభుఁ డాదిగ | గీర్వాణగణంబు గాలకేయులతోడన్‌
గర్వించి రణము సేసి ర | ఖర్వపరాక్రములు గడిమిఁ గడు నుద్ధతులై.
41
క. అనిమిషదివ్యాయుధహతి | ననిఁ గొందఱు వడిరి, గొంద ఱధికవిభీతిం
జని పాతాళముఁ జొచ్చిరి | దనుజులు దైత్యులును వీర్యదర్పచ్యుతులై.
42
వ. ఇట్లు కాలకేయులందొట్టి యసురుల నెల్ల నిశ్శేషంబుఁజేసి జగంబుల యుపద్రవం బుడిపిన, దేవత లగస్త్యునిం గీర్తించి యిట్లనిరి. 43
క. ‘మునినాథ! నీ యనుగ్రహ | మున నుడిగెను బాధ నిఖిలభువనంబుల కి
వ్వనధిఁ బయఃపూర్ణముఁగా | నొనరింపుము; నీవ కాని యొరు లోప రిలన్‌.
44
వ. ఇది యనేక సత్త్వాశ్రయంబు గావున రిక్తంబై యుండఁ దగ’ దనిన నగస్త్యుం డిట్లనియె. 45
సీ. ‘మున్న జీర్ణం బయ్యె మున్నీటి నీరు నా | కడుపున; నే నింకఁ బడయనేర
జలరాశి నిండంగ జల మొండు’ నావుడు | నమరులు మునులును గమలగర్భుఁ
గానంగఁ జని ‘దేవ! మీనాకరం బేమి | తెఱఁగున నిండు? మా కెఱుఁగఁ జెపుమ!’
యని విన్నపంబు సేసినఁ, బెద్దప్రొద్దు చిం | తించి వారలకు విరించి యనియె
 
ఆ. ‘వనధిఁ బెద్దకాలమున భగీరథుఁ డను | వాఁడు నించుఁ గాని వసుధ నొరులు
పూని దీని నింపఁగా నోప’ రనవుడు | నమరవరులు మునులు నరిగి రనిన.
46
క. ‘వనరాశి యేమి కారణ | మున నెట్లు భగీరథుండు భూరిజలౌఘం
బున నించె? దీనిఁ జెప్పుమ’ | యని యడిగిన ధర్మజునకు నమ్ముని సెప్పెన్‌.
47
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )