| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము |
| వ. | తొల్లి యిక్ష్వాకు వంశంబున సగరుం డనురాజు హైహయుల నిర్జించి నిఖిల మహీరాజ్యంబు సేయుచు నపుత్త్రకుండై వైదర్భియు శైబ్యయు నను నిద్దఱు భార్యలతోడం గైలాసంబున కరిగి, యందు. | 48 |
| క. |
దక్షమఖక్షయకరు నిట | లాక్షజహుత భక్ష్యభక్షితానంగు విరూ పాక్షు మహోక్షధ్వజుఁ బ్ర | త్యక్షము గావించె నుగ్రతపమున పేర్మిన్. |
49 |
| తే. |
హరుఁడు వానికిఁ బ్రత్యక్షమయి వరంబు | వేఁడు మనవుడుఁ ‘ద్రైలోక్యవిభుఁడ! నాకు దయ యొనర్పుము సంతానదాన’ మనుచు | వేఁడెఁ బుత్త్రార్థియై కడువేడ్కతోడ. |
50 |
| వ. | ఈశ్వరుండు వానికి వైదర్భియం దఱువదివేవురు గొడుకులును, శైబ్యయం దొక్క కొడుకుంగా వరం బిచ్చి, యయ్యఱువదివేవురు నతిదర్పితులై యేకకాలంబునఁ గాలగోచరు లగుదు రనియు, నయ్యొక్క కొడుకు వంశకర్త యగుననియుం జెప్పి యదృశ్యుం డైన. | 51 |
| క. |
కొడుకులఁ బలువురఁ బడసియుఁ | బడయనియట్టి దయి ధర్మపత్నులుఁ దానుం గడు సంతసపడ కరిగెను | దడయక సగరుండు మగుడి తన పురమునకున్. |
52 |
| వ. | అంతఁ గొంతకాలంబునకు నయ్యిద్దరు గర్భిణులైన నందు వైదర్భికి నొక్కి యలాబూ ఫలంబును, శైబ్యకు నసమంజసుండను కొడుకునుం బుట్టిన. | 53 |
| ఆ. |
‘వరదుఁడైన యీశువరమున నిది యొక్క | వదరు పుట్టె; నెట్టివరమొ!’ యనుచు దానిఁ బాఱవైవఁ దా రున్న నాకాశ | వాణి యిట్టు లనియె వసుమతీశ! |
54 |
| తే. |
సాహసం బిట్టు సేయంగఁ జనునె? దీని | బీజములు ఘృతఘటములఁ బెట్టి రక్ష సేయు; మఱువదివేవు రూర్జితులు సుతు లు | మేశు వరమునఁ బుట్టుదు రిందు నీకు.’ |
55 |
| వ. | అనినం దద్వచనానురూపంబు సేసి రక్షించుచున్న రెన్నెలలకు. | 56 |
| క. |
సుతషష్టి సహస్రక ము | ద్గతమై వర్ధిల్లి గగనగతిఁ బఱచి శత క్రతులోకముఁ దొట్టి మదో | ద్ధతిఁ జేసె సమస్తలోకతతులకు బాధల్. |
57 |
| క. |
సగరసుతు లట్లు జగముల | కొగి బాధలు సేయుచున్న నోడి మరుత్ప న్నగవరు లరిగిరి నాలుగు | మొగములు గల వేల్పుకడకు మునిసంఘముతోన్. |
58 |
| ఆ. |
వారిజాసనుండు వారల వచ్చిన | విధ మెఱింగి ‘మీకు వెఱవ నేల? సగరసుతులు దగ్ధు లగుదురు; దర్పితు | లైనవారి పేర్మి యధ్రువంబు.’ |
59 |
| వ. | అని కమలసంభవుం డానతిచ్చిన నరిగి యమరవరు లాదిగా నఖిలలోకనివాసు లెల్ల సగరుసుత పరిక్షయం బపేక్షించి యుండునంత. | 60 |
| సీ. |
అశ్వమేధంబు సేయంగ దీక్షితుఁ డయ్యె | సగరుండు; వాని యశ్వంబు సగర తనయులచే రక్షితంబై వసుంధర | యెల్లఁ గ్రుమ్మరి తోయహీన మైన జలధిలోపల నదృశ్యం బైనఁ గానక | సగరున కెఱిఁగించి, సగరసుతులు జనకు శాసనమునఁ జని భూతలమునందుఁ | దడయక రోసి పాతాళతలము |
|
| ఆ. |
నందు రోయఁ గడఁగి యఱువదివేవురు | నొక్క మొగిన గ్రొచ్చి రుదధిలోన జలధిపంకమగ్న సత్త్వముల్ నిశితకు | ద్దాలహతి విదారితములు గాఁగ. |
61 |
| వ. | ఇట్లు గ్రొచ్చి గ్రొచ్చి సగరసుతులు సముద్రపూర్వోత్తరదేశంబునం గపిలుం డను మహాముని యాశ్రమ సమీపంబునందుఁ దమగుఱ్ఱంబుఁ గని సంతోసిల్లి. | 62 |
| ఆ. |
అశ్వమేధమునకు నర్చితంబైన యీ | యశ్వరాజు నిట్టు లపహరించి మ్రుచ్చు గొఱక యీ సముద్రదేశంబున | నోట మెడఁద లేక యున్నవాఁడు. |
63 |