| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము |
| తే. |
‘ఏను మీ కారణంబున నిపుడు లబ్ధ | యౌవనుండనై ధన్యుండ నైతి; మిమ్ము సోమపీథులఁ జేసెద సురలరాజు | సూచుచుండఁగ శర్యాతిసుక్రతువున.’ |
187 |
| వ. | అని చెప్పిన నాశ్వినులు సంతసిల్లి యరిగి; రిట శర్యాతి భార్గవు జరాభార పరిత్యాగంబు విని విస్మితుండై యల్లునిం గూఁతుం జూడవచ్చిన, నాతని సత్కృతుం జేసి భార్గవుం డిట్లనియె. | 188 |
| క. |
‘విదితముగ నిన్నుఁ జేయిం | చెదఁ గ్రతువు ధరాధినాథ! చేయుము నీ క భ్యుదయం బగు సంభారస | ముదయము సమకట్టు’ మనిన మునివచనమునన్. |
189 |
| క. |
అనఘుఁడు శర్యాతి మఖం | బొనరించె విధిప్రయోగయుతముగ; నం దా శ్వినులకు సోమం బీఁ బో | యిన భృగుపుత్త్రునకు నలిగి యింద్రుం డనియెన్. |
190 |
| క. |
వీరిద్దఱు సోమార్హులు | గా; రమరుల వెజ్జు; లిది యకర్తవ్యము; బృం దారకులు గానివారికి | వారింపక సోమ మిచ్చువారుం గలరే? |
191 |
| వ. | అనిన నింద్రువచనం బాదరింపక చ్యవనుం డాశ్వినుల సోమపీథులం జేసిన, దాని సహింపక యింద్రుం డలిగి. | 192 |
| క. |
జృంభించి వజ్ర మెత్తిన | జంభాంతకు వజ్రయుత భుజాస్తంభము సం స్తంభించి యతనిఁ బటుసం | రంభంబునఁ జంపఁ గడఁగి రౌద్రాకృతితోన్. |
193 |
| క. |
చ్యవనుఁడు వేల్చిన నం దు | ద్భవ మయ్యె నపారఘోరబలయుతుఁడు మహా జవుఁడు మదుం డను రాక్షసుఁ | డవనిచర ద్యుచర భీకరాకారుండై. |
194 |
| వ. | ఇ ట్లుద్భవించి, దశ సహస్ర యోజనాయామంబులైన బాహుదండంబులయు, శత యోజనాయామంబులైన చతుర్దంష్ట్రలయు, దశ యోజనాయామంబులైన దశనంబులయు, శశిరవిమండల సదృశంబులైన నయనంబులయుఁ, గాలాగ్ని సన్నిభంబైన వక్త్రంబును, దిగ్భూనభోభాగసంకటంబైన శరీరంబునుందోడ భూమి నొక్కహనువును దివంబును నొక్కహనువుగా వదనగహ్వరంబు దెఱచి, జగజ్జనసంత్రాసనవ్యగ్ర సంచలనంబైన దీర్ఘ జిహ్వ నధరోష్ఠ పుటంబు నాకుచు నత్యుగ్రనాదంబున దిక్కులు వ్రచ్చుచు వచ్చు మహారాక్షసుం జూచి సురేంద్రుండు వెఱచి, భార్గవస్తంభితభుజుండు గావున వాని నెద్దియుం జేయనేరక చ్యవను నొద్దకు వచ్చి కృతాంజలియై ‘మునీంద్రా! నీ తపోవీర్య మహారంభంబు మిథ్య యగునే? యాశ్వినులు నేడు మొదలుగా సోమార్హు లగుదురు; నీవు నాకుఁ బ్రసన్నుండవై క్షమింపు’ మనిన. | 195 |
| క. |
మునినాథు నలుకతోడన | యనిమిషపతి వజ్రయుత మహాభుజ సంస్తం భన ముడిగె; నంత భృగునం | దను వీడ్కొని యింద్రుఁ డరిగెఁ దన పురమునకున్. |
196 |
| వ. | అమ్మద రాక్షసుండు నాక్షణంబ చ్యవను నుపదేశంబున మద్య స్త్రీ మృగయాక్షంబుల నాశ్రయించె; నాశ్వినులు సోమపీథులై దివంబున కరిగి; రిట భార్గవుండైన చ్యవనుండు దన దపోమహత్త్వంబునందుఁ బ్రకాశింపఁ జేయుటంజేసి నాటంగోలె నది యార్చీకపర్వతంబు నాఁ బరఁగె’ నని రోమశుండు సెప్పిన నందులఁ బుణ్య సరోవరంబునం గృతస్నానులై పాండవు లరిగి, యంత శంతను శునక నరనారాయణ విధాతృ తపోవన స్థానంబై దేవర్షినివాసంబైన సైంధవారణ్యంబునం జంద్రసరోవరంబునందు రోమశనియుక్తులై చరువులుసేసి యతిథులం బూజించి చని యమునానదిం గని; రంత వారలకు రోమశుం డిట్లనియె. | 197 |