పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము
రోమశుఁడు ధర్మరాజునకు సౌకన్యాఖ్యానంబు సెప్పుట (సం. 3-122-1)
క. ‘ఇక్కొలని సమీపంబునఁ | బెక్కగు వేలేండ్లు తపము భృగుసుతుఁడు గరం
బక్కజముగ నొనరించెను | వెక్కస నియమమున నిరతవీరాసనుఁడై.
174
క. అమ్మునిదేహము వల్మీ | కమ్మునఁ గప్పంగఁబడి నికటవల్లీ గు
ల్మమ్ములు పైఁ బ్రాఁకిన నన | యమ్మును నేర్పడక యుండె నవ్వనభూమిన్‌.
175
వ. అంతం బెద్దకాలంబునకు శర్యాతి యనురాజు దన చతుస్సహస్ర దేవీనివహంబుతోడఁ దత్సరోవరంబున విహరింప నరిగిన నాతని కూఁతురు సుకన్య యనునది యిష్టసఖులతోఁ గ్రుమ్మరుచున్న నవ్వల్మీకంబునందు. 176
క. విద్యుల్లతాంగి భార్గవు | నుద్యన్నయనములు మెఱచుచున్నను విలసత్‌
ఖద్యోతద్యుతులొకొ యని | సద్యస్సంజాతబుద్ధి సంభ్రమ యగుచున్‌.
177
వ. అప్పు డప్పుట్ట గ్రొప్పించిన నలిగి నిమీలితనయనుండై చ్యవనుండు శర్యాతిసైన్యంబుల కెల్ల మూత్రపురీష నిరోధంబుఁ జేసిన, నది దనసైన్యాపరాధంబున నయ్యెఁగా వగచి, వాఁ డెల్లవారి నడిగి తత్కారణం బెఱుంగ నేరక చింతాపరుండై యున్నఁ, దండ్రికడకు వచ్చి సుకన్య యిట్లనియె. 178
తే. ‘మిన్న మిడుఁగుఱు లట్టులై మెఱసి రెండు | మెఱుఁగు లొక పుట్టలో నున్న నెఱుఁగ కేను
బుట్ట గ్రొప్పించి యారెంటి పొడవుఁ గాన | కుడిగి వచ్చితి విస్మయపడి మనమున.
179
వ. ఈ సైన్య నిరోధంబున కిది నిమిత్తంబగునో?’ యనిన, శర్యాతి యప్పు డా పుట్టయొద్దకు వచ్చి, యందుఁ దపః క్లేశంబునఁ గృశత్వగస్థీభూతశరీరు నతివృద్ధు భార్గవుం గని నమస్కరించి యిట్లనియె. 180
క. ‘అమితంబగు మీ తపము మ | హిమ యెఱుఁగక యిట్లు చేసె నిది; దీని సహిం
పుము; దయ మత్సైన్యనిరో | ధము వాపుమ; యెఱుక గలరె తరుణులు ధరణిన్‌.’
181
వ. అనిన భార్గవుండు కరుణించి ‘యతిశయ రూపయౌవన గర్వితయైన యాకన్యకం బరిగ్రహించి కాని సహింప’ ననిన శర్యాతి తన కూఁతు నమ్మునివరున కిచ్చి నిజసైన్యనిరోధంబుఁ బాచిగొని చనిన. 182
ఆ. పతికిఁ బరమభక్తిఁ బరిచర్య సేయుచు | నొనరఁగా సుకన్య యుండునంత
నా లతాంగికడకు నాశ్విను లేతెంచి | త మ్మెఱుంగఁ జెప్పి దాని కనిరి.
183
వ. ‘అవ్వా! నీ వెవ్వని కూఁతుర? వెవ్వని భార్య?’ వని యడిగిన ‘నేను శర్యాతికూఁతుర; భార్గవుం డయిన చ్యవనుని భార్య’నని చెప్పిన విని వారలు నగి ‘యక్కటా! యిట్టి రూపవిభవంబులు వడసి కామభోగబాహ్యుఁ డయిన వృద్ధు భార్గవుని వరియించి నీ జవ్వనం బెల్ల వృథచేసి; తింకనైనను నీవయోరూపంబులకుం దగిన వరు వరియింపు; మేము వానిఁ దెచ్చెద’ మనిన నప్పలుకులు సహింపక సుకన్య యాశ్వినుల కిట్లనియె. 184
ఆ. ‘చ్యవనునందు నాకు సంతతప్రీతియై | యుండ నిట్లు పలుకు టుచిత మగునె?’
యని నిజేశ్వరునకు నప్పుడ వారల | పలుకు లెఱుఁగఁ జెప్పెఁ బంకజాక్షి.
185
వ. చ్యవనుండు దాని పతివ్రతాత్వంబునకు సంతోసిల్లి ‘వారల పలుకుల కొడంబడు’ మని పంచిన నది పతి చేత ననుజ్ఞాతయై చని’ నాకు నవయౌవనవరుం గావింపుం’ డనిన నాశ్విను లప్పుడక్కొలను సొచ్చిరి; భార్గవుండును వారితోడ సరఃప్రవేశంబు సేసె; నిట్లమ్మువ్వురు నవయౌవను లయి సుకన్యకడకు వచ్చి నిలిచి ‘మాయందు నీ వలచువానిని వరియింపు’ మనిన నది తనపతియైన భార్గవుని వరియించె; నంత నయ్యాశ్వినుల కతిప్రీతుండై చ్యవనుం డిట్లనియె. 186
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )