| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము |
| వ. | ఇక్కొలనం జైత్రమాసంబునందు మహామునులచేతం బూజితుండై యుమాసహితుం డీశ్వరుండు వారికిం బ్రత్యక్షంబగుటయు నరుంధతీ సహితుండై వసిష్ఠుం డిందుల వసియించె; నిది భృగుతుంగం బను పర్వతం; బిందు నుశీనరపతి శిబియను వాఁడు దొల్లి యజ్ఞంబు సేయుచున్న నింద్రాగ్నులు వాని మహాగుణంబు లెఱుంగవేఁడి యింద్రుండు శ్యేనం బైన, నగ్ని కపోతంబై శ్యేనభయంబునఁ బఱతెంచి శిబిమఱువు సొచ్చిన దాని నెగిచికొని వచ్చి శ్యేనంబు శిబి కిట్లనియె. | 227 |
| ఆ. |
‘నిన్ను సత్యధర్మనిర్మలుఁగా విందు; | నట్టి నీకుఁ బాడియయ్య యిప్పు డతిబుభుక్షితుండనై యున్న నాకు నా | హారవిఘ్న మిట్టు లాచరింప? |
228 |
| వ. | సర్వభూతంబులు నాహారంబున జీవించి వర్ధిల్లు; నిది నాకు భక్ష్యంబు గానినాఁడు బుభుక్షావేదనం జేసి ప్రాణ వియోగం బగు; నట్లయిన నా పుత్త్రులు భార్యయు జీవింపనేర; రొక్కకపోతంబు రక్షించి పెక్కు జీవులకు హింస సేయుట ధర్మవిరోధంబు. | 229 |
| క. |
ధర్మజ్ఞు లైన పురుషులు | ధర్మువునకు బాధ సేయు ధర్మువునైనన్ ధర్మముగా మదిఁ దలఁపరు; | ధర్మువు సర్వంబునకు హితంబుగ వలయున్. |
230 |
| వ. | ఇక్కపోతంబు నాకు వేదవిహితంబైన యాహారంబు; ‘శ్యేనాః కపోతాన్ ఖాదయన్తి’ యను వేదవచనంబు గలదు గావున దీని నాకు నాహారంబుగా ని’ మ్మనిన దానికి శిబి యిట్లనియె. | 231 |
| తే. |
‘ప్రాణభయమున వచ్చి యిప్పక్షి నన్ను | నాశ్రయించె; నాశ్రితు నెట్టి యధముఁ డయిన విడువఁ డనినను నే నెట్లు విడుతు దీని? | నాశ్రితత్యాగ మిది ధర్ము వగునె? చెపుమ. |
232 |
| వ. | నీవు పక్షివయ్యును ధర్మ మెఱింగినట్లు పలికితి; శరణాగత పరిత్యాగంబుకంటె మిక్కిలి యధర్మం బొం డెద్ది? నీయాఁకలి దీననకాని యొంట నుపశమింపదే? నీయత్నం బాహారార్థంబేని యిప్పు డివ్వనంబున మృగ మహిషవరాహఖగ మాంసంబులు దీనికంటె మిక్కిలిగాఁ బెట్టెద; నిక్కపోతంబువలని యాగ్రహం బుడుగుము; దీని నే నెట్లును విడువ’ ననిన శ్యేనం బిట్లనియె. | 233 |
| ఆ. |
‘నాకు విహితభక్షణం బిది; యిప్పక్షిఁ | బూని కావ నీకు బుద్ధియేని యవనినాథ! దీనియంత నీ మాంసంబు | దూఁచి నాకుఁ బెట్టు తొలఁగ కిపుడ.’ |
234 |
| చ. |
అనిన ‘ననుగ్రహించితి మహావిహగోత్తమ!’ యంచు సంతసం బున శిబి తత్‌క్షణంబ యసిపుత్త్రిక నాత్మశరీరకర్తనం బనఘుఁడు సేసిచేసి తన యంగమునం గల మాంసమెల్లఁ బె ట్టినను గపోతభాగమ కడిందిగ డిందుచు నుండె నత్తులన్. |
235 |
| క. |
దానికి నచ్చెరువడి ధర | ణీనాథుఁడు తనువునందు నెత్తురు దొరుఁగం దాన తుల యెక్కె; నంతన్ | వాని గుణోన్నతికి మెచ్చి వాసవదహనుల్. |
236 |
| వ. | శ్యేనకపోత రూపంబులు విడిచి నిజరూపంబులఁ జూపి ‘నీ ధైర్య శౌర్యాది గుణంబు లనన్యసాధారణంబులు గావున నీకీర్తి నిత్యంబై శబ్ద బ్రహ్మంబు గలయంత కాలంబును వర్తిల్లుచు నుండెడు’ మని శిబికి వరం బిచ్చి యింద్రాగ్నులు చని; రిది యమ్మహాపురుషు పుణ్యస్థానంబు; మఱియు ననవరత ఫలవృక్షంబులు గల యిది యౌద్దాలకియైన శ్వేతకేతు తపోవనం; బిందు సరస్వతి మనుష్య స్త్రీరూపధారిణియై శ్వేతకేతుని సేవించె; మాతుల భాగినేయులైన యష్టావక్రశ్వేతకేతు లిందు యుగ్రతపంబుఁజేసి’ రనిన ‘నం దష్టావక్రు మాహాత్మ్యంబు విన వలతు’ నని యడిగిన, యుధిష్ఠిరునకు రోమశుం డిట్లనియెఁ; ‘దొల్లి యేకపాదుం డనుమునివరుండు తనవిద్యావిభవంబున సుజాత యను దాని వివాహంబై వనంబున ఘోరతపంబు చేయుచు ననవరతంబును శిష్యుల వేదంబులు చదివించుచున్నఁ బెద్దకాలంబునకు సుజాత గర్భిణియైనఁ దద్గర్భంబున నున్న యర్భకుం డొక్కనాఁడు తండ్రి కిట్లనియె. | 237 |