| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము |
| క. |
‘ఎడఁబడక యహోరాత్రులు | వడిఁగొని చదివింప నిట్లు వలయునె శిష్యుల్ గడు నిద్రలేమి నెంతయు | జడమతులై చదువు దప్పఁ జదువుచు నుండన్.’ |
238 |
| వ. | అని యుపాలంభించి పలికిన నలిగి యేకపాదుండు ‘నీ వధ్యయనంబునకు వక్రంబుగాఁ బలికితివి గావున నెనిమిదివంకలు గల శరీరంబుతో జన్మింపు’ మని కొడుకునకు శాపం బిచ్చిన. | 239 |
| ఆ. |
అగ్నికల్పుఁడై మహాత్ముఁడు కడుపునఁ | బెరుఁగుచుండె; నంత సరసిజాక్షి ప్రసవకాల మైనఁ బతి కొక్కనాఁ డిట్టు | లనియెఁ బ్రసవభారమునకు వెఱచి. |
240 |
| క. |
‘ధరణిఁ గడుఁ బేదవారును | బురిటికి ఘృత తైల ధాన్యములఁ జెచ్చెర ముం దర సంగ్రహింతు; రవి మన | కరయఁగ నతిదుర్లభంబు లర్థము లేమిన్. |
241 |
| వ. | ఏమి ‘సేయుదు? నెవ్విధంబున నీప్రసవక్లేశంబువలనఁ బాయుదు?’ ననిన నేకపాదుండు ధనార్థియయి జనకరాజుపాలికిం జని వాని యజ్ఞంబునందు వరుణపుత్త్రుండైన వందితో వివాదంబు సేసి యోటువడి జలమగ్నుండై యున్న, నిట సుజాత ప్రసూతియై యష్టావక్రుం గనియెఁ; దత్కాలంబున నుద్దాలకుభార్య శ్వేతకేతుం గనియె; నిట్లు మాతులభాగినేయు లిద్దఱు సవయస్కులై పెరిఁగి పండ్రెండేండ్లొక్కట నుద్దాలకుతోఁ జదివి యధ్యయనశూరులై రందు. | 242 |
| తే. |
తండ్రి యనుచు నుద్దాలకుఁ దనకుఁ, గరము | ప్రీతితో శ్వేతకేతుని భ్రాత యనుచు ననఘచరితుఁ డష్టావక్రుఁ డనుదినంబు | నొం డెఱుంగక సుఖలీల నుండు నంత. |
243 |
| వ. | ఒక్కనాఁ డుద్దాలకు కుఱు వెక్కియున్న యష్టావక్రుం జూచి శ్వేతకేతుండు సహింపక ‘నీ వేల మాయయ్య కుఱువెక్కి యుండె? దీవు వోయి మీయయ్య కుఱు వెక్కు’ మని చేయిపట్టి యీడ్చిన, నేడ్చుచుం దల్లికడకుం జని యష్టావక్రుం డిట్లనియె. | 244 |
| క. |
‘మా యయ్య యెవ్వ? రెక్కడఁ | బోయిరి? సెప్పు’ మని తెల్లముగ నడిగి తప శ్శ్రీయుతుఁడు తండ్రికడకుం | బోయెం దన మామ నెయ్యమునఁ దోడ్కొనుచున్. |
245 |
| వ. | ఇ ట్లష్టావక్రుండు దానును శ్వేతకేతుండును జనకరాజు యజ్ఞంబునకుం జని యందు దౌవారిక నివారితులై ‘మూకాంధ బధిర పంగు స్త్రీ బ్రాహ్మణ సుప్రవేశం బగుచున్న యీ రాజద్వారంబున మమ్ము విద్వాంసుల బ్రాహ్మణుల నేల వారించెద?’ రనిన దౌవారికుం డిట్లనియె. | 246 |
| క. |
‘అలఘులగు వృద్ధవిద్వాం | సులకు మహాయాజ్ఞికులకుఁ జొర నర్హంబై విలసిల్లు యజ్ఞసభ సొర | వలవదు చనుఁ; డీరు చిఱుతవారల’ రనినన్. |
247 |
| క. |
‘అలయక యేండ్లు గడుం బె | క్కులు జీవించుట నర గలుగుటయుం దగు వృ ద్ధుల లక్షణమే? జ్ఞానము | గలఁ డేనిన్ బాలుఁ డయినఁ గడు వృద్ధు మహిన్. |
248 |
| వ. | కృతాధ్యయనశీలుండై యాచారపరుండైన వాఁడు బాలుండయ్యును సర్వజన సంభావనీయుండగు; బాలురని మమ్ము నవమానింప వలవ; దేము జనకరాజ సదనంబున దర్పితులైన వేదవాదులతో వాదంబు సేయ సమకట్టి వచ్చినవార’ మనిన దౌవారికుండు వారి నప్పుడు రాజానుమతుండై లబ్ధప్రవేశులం జేసె; నంత. | 249 |
| సీ. |
జనకభూపాలుని సంప్రశ్నముల కెల్ల | నేర్పడ నుత్తరం బిచ్చి వాని సభయందు భూసురసంఘమధ్యంబున | వరుణపుత్త్రుం డైన వందితోడ వాదంబు చేసి, గర్వంబున నాతని | నొడిచి, తద్విజితులై యొదిఁగియున్న ధరణీసురులఁ దన తండ్రితో నిగ్రహ | ముక్తులఁ జేసి సన్మునికుమారుఁ |
|
| తే. |
డధికతేజుఁ డష్టావక్రుఁ డఖిలలోక | పూజితుం డైన జనకుచేఁ బూజ లంది యేకపాదుఁ దోడ్కొని పేర్మి నేఁగుదెంచె | బుధనుతుండు నిజాశ్రమంబునకు నొప్ప.’ |
250 |
| వ. | అని చెప్పుచు నరిగి, ‘యిది సమంగ యను పుణ్యనది; యిందు భరతుండు రాజ్యాభిషిక్తుఁడయ్యెఁ; దొల్లి యింద్రుండు లక్ష్మీప్రాప్తుండై దీని జలోపస్పర్శనంబునఁ బాపవిముక్తుండయ్యె; నిది మైనాకకుక్షి; యిం దదితి పుత్త్రార్థినియై తపంబు సేసె; నిది ఋషిదైవతంబైన కనఖల నగం; బిది గంగానది; యిందు సనత్కుమారుండు సిద్ధింబొందె; నిది యుష్ణగంగ; యిందుఁ గృతస్నానులైనం గృతార్థు లగుదు; రిది రైభ్యాశ్రమం; బిది భరద్వాజాశ్రమం; బిందు భరద్వాజసుతుండు యవక్రీతుండు తపోవిద్యాగర్వంబున నపగతజీవుం డయ్యె; ననిన ‘నది యె?’ ట్లని ధర్మతనయుం డడిగిన రోమశుం డిట్లనియె. | 251 |