| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము |
| క. |
‘అలఘులు రైభ్య భరద్వా | జులు తమలో సుహృదులై విశుద్ధ తపోని శ్చలితమతు లివ్వనంబున | నొలసి తపం బొప్పఁ జేయుచుండిరి నెమ్మిన్. |
252 |
| వ. | అందు రైభ్యుండు కృతాధ్యయన శూరులైన యర్థావసు పరావసులను తన యిద్దఱు పుత్త్రులతో విద్వత్పూజితుండై యున్నవానిం జూచి సహింపనోపక భరద్వాజసుతుఁడు యవక్రీతుండు తపోబలంబున నఖిల వేదశాస్త్రాగమంబులు పడయుదు నని సమిద్ధంబైన యగ్నియందు సంధార్యంబు సంధించుచు నుగ్రతపంబు సేయుచున్న, దాని సహింపనోపక యింద్రుండు వానియొద్దకు వచ్చి ‘నీ వేమి యుద్దేశించి యుగ్రతపంబు చేసెద?’ వనిన శక్రునకు యవక్రీతుం డిట్లనియె. | 253 |
| ఆ. |
‘చదువకయును నాకు సర్వవేదంబులు | సర్వశాస్త్రములును సంభవిల్ల వలయు నని తలంచి వదలక నిష్ఠతో | నుగ్రతపముఁ జేయుచున్నవాఁడ.’ |
254 |
| వ. | అనిన వాని కింద్రుం డిట్లనియె. | 255 |
| క. |
‘గురుముఖమునఁ బడయక దు | ష్కరతపమునఁ జేసి పడయఁగాఁబడు విద్యల్ పరమార్థము మదమును మ | త్సరమును గావించు నెట్టిసాధుల కైనన్. |
256 |
| వ. | ‘ఇది విద్యోపార్జనంబున కుపాయంబు గా’ దని వారించి వాసవుఁ డరిగిన, నుడుగక యవక్రీతుం డెప్పటియట్ల తపంబుఁ జేయుచున్నఁ దదీయ తపస్తప్తమానసుండై వృద్ధశ్రవుండు వృద్ధవిప్రరూపంబు ధరించి యశక్తుండై శోషించిన శరీరంబుతోడ సికతాముష్టి పరంపర నపారగంభీరగంగాప్రవాహంబునందు సేతుబంధంబు చేయుచున్న నవ్విప్రుం జూచి యవక్రీతుండు నగుచు నిట్లనియె. | 257 |
| క. |
‘శతవర్షవృద్ధుఁడవు నీ | వతికృశుఁడ వశక్యమైన యర్థమునం దా స్థత యేల సేసి కడు దు | ర్మతి వై? తిం కెన్నఁ డిది సమాప్తిం బొందున్?’ |
258 |
| వ. | అనిన నింద్రుండు వానిం జూచి ‘యేను నీయట్ల యఘటమానంబైన యర్థంబునందు యత్నంబుఁ జేసెద’ నని నిజరూపంబుఁ జూపి ‘యిట్లు నిరర్థకప్రయాసం బేల చేసె? దుడుగు ‘మనిన ‘నే నెట్లు నుడుగ; నాయభిమతంబు సఫలంబు సేయవలయు’ నన యవక్రీతుండు శక్రువలనం దనయభిమతంబు వడసి, తత్ప్రకారంబుఁ దండ్రికిం జెప్పిన విని భరద్వాజుఁడు కొడుకుగర్వంబు సహింపక దేవగీతలైన గాథల యర్థంబు వానికి నిట్లని చెప్పె. | 259 |
| సీ. |
‘బాలధి యను మునిప్రవరుండు పుత్త్రశో | కాపన్నుఁడై ఘోరమగు తపంబుఁ జేసి వేల్పులదయఁ జిరజీవిగాఁ బుత్త్రుఁ | బడసె మేధావి నాఁ బరఁగువాని వాఁడు నాయుష్యగర్వమున మునీంద్రుల | నెవ్వరి మెచ్చక యేఁగి యొక్క ధనుషాక్షుఁ డను తపోధనునొద్ద గర్వించి | పలికిన నలిగి తపస్వి వాని |
|
| ఆ. |
నంత కాంతికమున కరుగంగఁ జేసె; గ | ర్వంబు చెట్ట; యెట్టివారి నైనఁ గ్రాఁచుఁ దత్‌క్షణంబు గర్వంబు; గర్వంబు | నొడిచియున్నవాఁడ యుత్తముండు. |
260 |
| వ. | కావున నీవు గర్వంబు విడిచి యకోపనుండవై పరమశాంతు లైన రైభ్యుకొడుకులతోడ నిర్మత్సరుండవయి యుండు’ మనిన ‘నట్లసేయుదు; నాకు రైభ్యుండు భవత్సమానుండ’ యని యవక్రీతుండు తన విద్యావిభవంబు మునిసభల విస్తరించుచు నొక్కనాఁడు రైభ్యాశ్రమంబునకుం జని, యందు. | 261 |
| ఉ. |
కోమల కీర షట్చరణ కోకిలనాద మనోహరంబు ను ద్దామ వసంత పుష్ప భరిత క్షితిజ ప్రకరంబు నైన యా రామమునందుఁ జూచె మునిరాజకుమారుఁడు రైభ్యుకోడలిం దామరసాక్షిఁ గృష్ణ యనుదానిఁ బరావసుభార్యఁ బ్రీతితోన్. |
262 |
| ఆ. |
దానిఁ జూచి మదనతప్తుఁడై తన యభి | ప్రాయ మెఱుఁగఁ జెప్పెఁ బంకజాక్షి; కదియు శాపభీతి నప్పటి కొడఁబడి | నట్లు పలికి పెలుచ నరుగుదెంచి. |
263 |
| క. |
తమ మామకుఁ దద్వృత్తాం | తము నంతను దెలియఁ జెప్పి తరుణి విలోలా క్షములందు బాష్పసలిలో | ద్గమముగఁ దల వాంచి యుండెఁ గడుఁగోపమునన్. |
264 |
| వ. | రైభ్యుండు నయ్యవక్రీతున కలిగి నిజకోపానల శిఖాయమానైక జటావలంబనకరుండై హుతాశనునందు వేల్చి, యయ్యగ్నికుండంబునందు. | 265 |
| క. |
లలితాంగిఁ బడసెఁ దనకో | డలిరూపముకంటెఁ గడు బెడంగగు రూపో జ్జ్వలకాంతి గలుగుదానిం | బొలఁతుక నొక్కర్తు నతితపోవీర్యమునన్. |
266 |
| వ. | మఱియు నొక్కజట యవలంబించి వేల్చిన నందు వికృత దంష్ట్రాకరాళంబైన ముఖంబుతో శూలహస్తుండైన యొక్కరాక్షసుండు పుట్టె; నయ్యిద్దఱు ముకుళితహస్తులై ‘మాకుం బని యేమి?’ యని యడిగిన ‘నవినీతుండైన యవక్రీతు వధియింపుం’ డని పంచిన. | 267 |
| క. |
ఆ తరుణి మున్న చని మద | నాతురుఁడై వికృతచిత్తుఁడై యున్న యవ క్రీతు కరకమండలువుం | బ్రీతిఁ బ్రబోధించి కొనియె బెడఁగుగ నంతన్. |
268 |
| క. |
అపహృత కమండలుండై | యపవిత్రుం డగుటఁ జేసి యధికతపోవీ ర్య పరిక్షయ మగుడును నా | తపస్విసుతు రాక్షసుండు దడయక తాఁకెన్. |
269 |
| వ. | వానికి వెఱచి పఱచి యవక్రీతుండు మహానదులు గొలంకులు సొచ్చిన నవి శుష్కంబులైనఁ దన జనకు నగ్నిహోత్రంబుఁ జొచ్చునంత. | 270 |
| ఆ. |
మునికుమారు నెగిచికొని వచ్చి నిశితశూ | లాయుధమునఁ బొడిచి యాసురమున రక్కసుండు చంపి, యక్కాంతయును దాను | నరిగె రైభ్యుకడకు నాక్షణంబ. |
271 |
| వ. | రైభ్యుండును వానికి భార్యగాఁ గృత్తి నిచ్చె; నంత నిట భరద్వాజుండు వనంబుననుండి వచ్చి తన కెప్పుడుం బ్రత్యుత్థానంబు జేయునగ్ను లప్పు డడంగియున్న నచ్చెరువడి గృహపాలకుండైన శూద్రువలన నంత వృత్తాంతం బెఱింగి, నిహతుం డైన పుత్త్రుం జూచి దుఃఖితుండై. | 272 |
| ఆ. |
‘రైభ్యుఁ డధికకోపరతుఁ డంటి, నమ్ముని | యాశ్రమంబుదెసకు నరుగ వలవ దంటి; వినఁగ నొల్లవైతి నా పలుకులు; | గర్వితునకు బుద్ధి గాన నగునె?’ |
273 |
| వ. | అని ప్రలాపించుచు భరద్వాజుండు వాని దహించి, పుత్త్రశోక దహనంబు సహింపనోపక తద్దహనంబున దేహ త్యాగంబుఁ జేసె; నంత బృహద్ద్యుమ్నుండను రాజు సత్త్రయాగంబు చేయుచుండి, రైభ్యు పుత్త్రుల నర్థావసుపరావసులం దనకు ఋత్విజులంగా వరియించిన నయ్యిరువురుఁదండ్రిచే ననుజ్ఞాతులై వానియజ్ఞంబు నడుపుచుండి, యొక్కనాఁడు పరావసుండు నిజాశ్రమంబునకు వచ్చువాఁడు వేగుఁబోక చీఁకటి నడవిలో నేకతంబ తనకు నెదురుగా వచ్చు రైభ్యు నెఱుంగక మృగంబకా వగచి నిజప్రాణ భయంబున వధియించి పదంపడి యెఱింగి పరమదుఃఖితుండై ప్రేతకార్యంబులు దీర్చి, బృహద్ద్యుమ్ను సత్త్రంబునకు వచ్చి తన చేసిన పితృఘాతం బగ్రజునకుం జెప్పి యిట్లనియె. | 274 |
| తే. |
‘నీవు దీని నొక్కరుఁడవు నిర్వహింప | నోప; వే నొక్కరుండ నయ్యును గడంగి నడప నోపుదుఁ గావున నాతదర్థ | మాచరింపుము బ్రహ్మహత్యావ్రతంబు.’ |
275 |
| వ. | అనిన నర్థావసుం‘డట్లు సేయుదు’ నని బ్రహ్మహత్యావ్రతంబులు సలుపుచుండెఁ; బరావసుండును నొక్కరుండ సత్త్రయాగంబు జరుపుచుండె; నంత నర్థావసుండు బ్రహ్మహత్యాప్రాయశ్చిత్తంబులఁ జేసి యా సత్త్రయాగంబునకు వచ్చిన, వానిం జూచి పరావసుండు బృహద్యుమ్నున కిట్లనియె. | 276 |
| క. |
‘ఇమ్ముని నీ యజ్ఞాయత | నమ్ముఁ బ్రవేశింపఁదగఁడు నరనాయక! యు గ్రమ్ముగ సలిపెడు శుభకా | ర్యమ్ములకుం బాసి బ్రహ్మహత్యావ్రతముల్.’ |
277 |
| వ. | అనవుడు, బృహద్ద్యుమ్న ప్రేరితులైన జనులచేత నుత్సార్యమాణుం డయి యర్థావసుం డనియెఁ ‘బరావసుండు గాని యేను బ్రహ్మఘాతకుండఁ గాను; వానికై వ్రతంబు సలిపి తత్పాతకవిముక్తుఁ జేసితి’ నని చెప్పిన యర్థావసు యథార్థకథనంబునకు మెచ్చి యగ్నిపురోగములైన దేవతలు వాని కిట్లనిరి. | 278 |