పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము
మార్కండేయుఁడు ధర్మరాజునకుఁ బ్రళయప్రకారంబు సెప్పుట (సం. 3-186-13)
సీ. ‘శాశ్వతు నఖిలభూతేశ్వరు నవ్యయు | నాదిదేవుని జగదాదిజన్ము
నాదిమధ్యాంతవిచ్ఛేదవిదూరు నా | శ్చర్యకారణకర్మధుర్యు నజరు
నీ కిష్టసఖుఁడును నీకుఁ బ్రెగ్గడయు నై | వెలుఁగొందుచున్న యీ యలఘుపుణ్యు
లాలితదీర్ఘవిశాలసితేక్షణుఁ | గనకవర్ణాంబరు వనజనాభు
 
ఆ. నింద్రనీలవర్ణు నింద్రాదిసురగణ | వినుతుఁ గృష్ణుఁ గరము వినయ మొప్పఁ
దలఁచి, యతని యాజ్ఞఁ దలకొని యెఱిఁగింతు | వినుము వరుసతోడ మనుజనాథ!
240
వ. కృత త్రేతా ద్వాపర కలినామంబు లయిన యుగంబులు నాలుగును బండ్రెండువేల దివ్యవర్షంబులం బర్యవసితంబులగునియ్యుగంబులు నాలుగు నొక్కమహాయుగం బనం బరఁగు; మహాయుగసహస్రపర్యంతం బైనకాలంబు బ్రహ్మకు దివసంబ నాఁబరఁగుఁ; దద్దివసావసానంబునందు శతవార్షికంబైన యనావృష్టిదోషంబు ప్రవర్తిల్లు నప్పుడు. 241
ఆ. సప్తహయుఁడు మూర్తిసప్తకంబు ధరించి | కరము వేఁడి మిగులు కరము లొప్ప
నదనదీజలములు నుదధిజలంబులుఁ | బీల్చి జగము లెల్లఁ బ్రేల్చుఁ గడఁగి.
242
చ. దినకరతిగ్మతేజము ప్రదీప్తహుతాశనుఁ డై యుగాంతసం
జనిత మహాసమీరణవశంబునఁ బేర్చి నగవ్రజంబుతో
మనుజులతోడ నిర్జరసమాజముతోడ భుజంగపంక్తితో
దనుజులతో జగత్త్రయముఁ దత్‌క్షణమాత్ర నొనర్చు నీఱుగన్‌.
243
వ. తదనంతరంబ. 244
మ. సితపీతారుణనీలపింగరుచులై స్నిగ్ధంబులై యుద్యతా
యతవిద్యుల్లలితంబు లై ఘనగిరీంద్రాకారఘోరంబు లై
తతనిర్ఘాతనిపాతభీమభిదురధ్వానంబు లై సంతతో
ద్ధుతసంవర్తవలాహకంబులు వెసం దోఁతెంచు దిగ్భిత్తులన్‌.
245
ఉ. పెల్లునఁ గూలు తజ్జలము పెక్కువ నొక్కట నమ్మహానలం
బెల్లను నాఱిపోవుఁ బృథివీశ్వర! యేఱులు నబ్ధులున్‌ వెసం
దొల్లిటి యట్ల నిండుఁ; బటుతోయదసంఘము లంతఁ బోక గ
ర్జిల్లుచు వెండియుం గురియుఁ జిత్రముగాఁగ ననేకకాలముల్‌.
246
శా. ధారాపాతనితాంతవేగమున నిద్ధాత్రీతలం బాహతం
బై రూపేది మునుంగుఁ దోయములలో నత్యంతగంభీరవాః
పూరం బంతయు ముంచి మించుటయు దిగ్భూమీనభోభాగముల్‌
వే రూపింపఁగ రాకయుండఁ దమముల్‌ వేష్టించుఁ ద్రైలోక్యమున్‌.
247
తే. అంతఁ బరమేష్ఠిచోదిత మైన యొక్క | మారుతము నలి రేఁగి దుర్వారభంగి
విలయకాలవిశృంఖలవిపులవారి | ధరచయంబుల నెల్లను విరియ నడఁచు.
248
క. ఆ మారుతంబు గ్రోలి పి | తామహుఁ డెంతయును ఘోరతర మగు సలిల
స్తోమంబునందు నడుమం | దామరపై నిదురవోవుఁ దద్దయు నెమ్మిన్‌.
249
వ. ఇట్టి కల్పాంతంబు లనేకంబులు సనియె; నింకఁ గానున్నవి యనేకంబులు; విను; మతీతకల్పాంత సమయంబున నేను బ్రబలాంధకారంబున నేదెసయుం గానక యొక్కండన యత్యంతభయాతురుండ నగుచుం బెద్దకాలంబు పరిభ్రమించుచుండ నొక్కతఱి నయ్యుదకమధ్యంబున నత్యున్నతం బయిన వటభూరుహంబు గానంబడియె; మఱియుఁ దదీయ పర్ణపర్యంకంబునందు. 250
క. కమనీయజలదవర్ణుని, | హిమకరబింబాస్యు, నుద్యదినతేజుఁ బ్రమో
దమునఁ బవళించువానిం | గుమారు నొక్కరునిఁ గుసుమకోమలుఁ గంటిన్‌.
251
వ. కని, విస్మితుండనై యాత్మగతంబున. 252
క. లోకంబులు దెగటారఁగ | నేకార్ణవమైన యిచట నిబ్బాలుఁ డొకం
డేకతమున నిద్రించుచు | నేకతమున నున్నవాఁడొ? యెవ్వాఁ డగునో!
253
తే. అని తలంచుచు నల్లన యక్కు మారుఁ | జేరఁబోయిన నాతండు సితసరోజ
రేఖ దలకొనఁగా నలరించెఁ గన్ను | లవధరించెను నను లోచనాంచలముల.
254
వ. తదనంతరంబ గంభీరమధురస్వరంబున ని ట్లనియె, ‘నయ్యా! నిన్ను నతిశ్రాంతుంగా నెఱింగితిఁ; గొండొకసేపు విశ్రమింప వలతేని నవకాశం బిచ్చెద; నాశరీరంబు ప్రవేశించి సుఖంబున శయనింపు’ మని తనవదనంబు వివృతంబుగాఁ జేసిన, నేనును బలాత్కార క్షిప్తుండునుం బోలెఁ బరవశుండ నై తన్మార్గంబున నతని యుదరంబుఁ బ్రవేశించి, యందు. 255
సీ. గంగాదినదులతోఁ గనకశైలాదిభూ | ధరములతో సముద్రములతోడ
వివిధపట్టణనవద్వీపవర్షములతో | బహుకర్మరతు లైన ప్రజలతోడఁ
బక్షిమృగవ్యాళపశుసంఘములతోడఁ | దద్దయు నొప్పారు ధాత్రిఁ గంటి;
సూర్యేందుతారకాజ్యోతిరుజ్జ్వల మైన | గగనంబుఁ బవనమార్గములుఁ గంటి;
 
తే. శక్రయమవరుణాది నిర్జరసమేత | మైన నాకంబు గంటి; మహాహియక్ష
రాక్షసాసురవిద్యాధర ప్రముఖులఁ | గంటి; వేయేల సకలలోకములుఁ గంటి.
256
చ. అరుదుగ నమ్మహాత్ముని మహాజఠరాంతరభూమి నూఱువ
త్సరముల యంతకాలము వసం బఱి త్రిమ్మరితిం గడంగి య
ప్పరుసున నెందుఁ గాల్గొనఁగఁ బట్టదు చిత్తము భీతిమీఱఁ ద
త్పరమతి నంత నక్కపటబాలు పదంబులు సంస్మరించితిన్‌.
257
వ. ఇట్లు శరణ్యవరేణ్యుం డైన కారుణ్యనిధి నద్దేవుం దలంచుచుండ నతండు నన్నుం దనవదనానిలవేగంబునం జేసి వెలువరించె; నంత నెప్పటియ ట్లమ్మహావటవిటపిశయనుం డైన యబ్బాలు నాలోకించితి; నంత. 258
క. ననుఁ గనుఁగొని యెలనవ్వునఁ | దనవదనము వింతచెన్ను దలకొనఁగా ని
ట్లను నబ్బాలుఁడు ‘విశ్రమ | మొనరించితె యనఘ! యస్మదుదరములోనన్‌?’
259
వ. అనిన నేనును సంభ్రమంబున నతనిం జేరనరిగికెందామరరేకులందెగడు నంగుళంబులు గలిగి తరుణకిసలయ సుకుమారంబు లయిన తచ్చరణకమలంబులు శిరంబునం జేర్చి ‘దేవా! దేవరప్రసాదంబున నత్యాశ్చర్యకారణం బైన సకలచరాచరభూత ప్రపంచంబుఁ జూచితి; భవదీయమాయాప్రభావంబు భావింప నేరకున్నవాఁడ. 260
శా. ఈ యేకార్ణవ మీ వటక్షితిరుహం బీ పర్ణపర్యంక మి
ట్లై యొప్పారుచునుండఁగా నుదరభాగైకప్రదేశంబునం
దీ యీరేడుజగంబులున్‌ మెలఁగఁగా నిట్లున్న బాలత్వ మే
నేయందంబున నిశ్చయించి సుఖి నై యేపారుదుం జెప్పవే!
261
క. నాదైన యాశ్రితత్వము | నీదగు చిత్తమునఁ గలిమి నియతమ యేనిన్‌
సాదరఫణితుల నన్నవ | సాదితసమ్మోహుఁగాఁ బ్రసాదింపఁదగున్‌.’
262
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )