| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము |
| వ. | ఆ వైవస్వతుం డొక్కనాఁడు గృతస్నానుం డయి జలాశయతీరంబున నున్నయెడ నొక్కమత్స్యంబు జలంబుల దరికిం జనుదెంచి యి ట్లనియె; ‘నయ్యా! యేను గడు నల్పమత్స్యంబ నగుటం జేసి బలవంతంబు లగు జలచరంబులవలన నాకుఁ దద్దయు భయంబు గలిగియుండు; నిమ్మడువు మహామత్స్యసంకులంబు గావున నపాయంబు వొందకుండ నన్నుద్ధరించి, యొండెడం బెట్టవే! యేను నీకుఁ బ్రత్యుపకారంబు సేయనోపుదు’ ననిన విస్మితుండై యతం డమ్మీను నెత్తికొని పోయి యొక్కనూతియందు విడిచి దానిం బలుమాఱు నరసికొని యుండె; నదియును గ్రమంబున వర్ధిల్లి యొక్కనాఁ డమ్మనువున కి ట్లనియె. | 219 |
| ఆ. |
‘అనఘ! నీ ప్రయత్నమున నా శరీరంబు | పొదలె; నాకు నిందు మెదల నెడము సాల; దట్లుగాన మేలగు నొండొక | యెడకుఁ గొంచుఁ బొమ్ము కడఁగి నన్ను. |
220 |
| వ. | అనిన నతం డాజలచరంబుఁ గొని చని యొక్క బావియందు విడిచిన, నది యెప్పటియట్ల యక్కజంబుగాఁ బొదలి, తనకు బావియందు నవకాశంబు పర్యాప్తం బగుటం జెప్పి, యతనిచేత గంగమడువున విడువంబడి, కాలక్రమంబున నచ్చోటఁ దిరుగం బట్టు చాలకున్న నమ్మనువున కెఱింగించిన, నతం డెత్తికొనిపోయి సముద్రంబునం బెట్టిన, నది వాని కి ట్లనియె. | 221 |
| క. |
‘ఉపకారం బొనరించితి | కృపతో నా కిట్లు నీవుఁ గృతమతి వై; ప్ర త్యుపకారం బొనరించెద | విపులగుణాభరణ! తెలియ విను నా పలుకుల్. |
222 |
| తే. |
తడవు లే దింక; నిఖిలభూతములుఁ బ్రళయ | మొందనున్నవి యిప్పు; డొండొండ పొంగి కలయఁబాఱుఁ బయోధు లుగ్రముగఁ బుణ్య | చరిత! యిదియ మన్వంతరసంధి యండ్రు. |
223 |
| వ. | కావున నీవు దృఢరజ్జుబంధురంబును సకలధాన్యతండుల కలితంబునుంగా నొక్క పేరోడ గావించి, సప్తముని సహితుండ వై దాని నెక్కి సముద్రంబు దరియందు నన్నుం దలంచునది; యేనును ఘనశృంగశోభితంబయిన రూపంబునఁ బొడసూపి మీకు మేలొనరించెద’ నని యమ్మత్స్యంబు ననియె; వైవస్వతుండును దదుక్తప్రకారంబున నోడ నిర్మించి సప్తమునిసహితంబుగాఁ గృతారోహణుండై పయోధిఁ దఱియం దొడంగె; నంత. | 224 |
| మ. |
మతి వైవస్వతుచేఁ దలంపఁబడి యమ్మత్స్యంబు దోఁతెంచె నా యతశృంగోన్నతమూర్తి; నాతఁడుఁ దదాజ్ఞాయత్తుఁ డై తచ్ఛిరో గతశృంగాగ్రమునం దగిల్చె నతిదీర్ఘం బైన పాశంబు; న ద్భుతవేగంబున నోడ నీడ్చె నది యంభోరాశిమధ్యంబునన్. |
225 |
| వ. | తదనంతరంబ. | 226 |
| సీ. |
గరుసులు గడవంగఁ గదలి యల్లల్లన | యొత్తుచు నెడముల నుత్తరించి, వేడుకఁ జేతులు విచ్చి యాడెడునట్లు | లోలోర్మిపంక్తులఁ గ్రాలి క్రాలి, ప్రచురహాసస్ఫూర్తి పచరించు చాడ్పున | నురుఫేనరోచులఁ దెరలు గవిసి, యురువడి వర్ధిల్లుచున్న జలంబుచేఁ | బొంగారి దెసలెల్ల మ్రింగికొనుచుఁ, |
|
| ఆ. |
బ్రబలవిలయకాలపటురయబహుళ స | మీరణౌఘదుర్నివార మగుచు నుగ్రభంగిగాఁ బయోనిధు లొక్కటఁ | బెల్లు రేఁగి జగము లెల్ల ముంచె. |
227 |
| వ. | ఇట్లు లోకంబెల్ల నేకార్ణవం బైన నమ్మత్స్యంబు దజ్జలాంతరంబున ననేకసహస్రవర్షంబు లయ్యోడం దిగుచుచుఁ బదంపడి యప్పెనువెల్లి యల్లనఁ దిగిచి పోవందొడంగునెడం దుహినగిరిశృంగసమీపంబున నయ్యోడ నిలిపి వారలతోడ. | 228 |
| తే. |
‘ఈ నగంబుశృంగంబున నిపుడు మీరు | గట్టుఁ డియ్యోడ’ ననిన నక్షణమ వారు నట్ల చేసిరి; విను, మమ్మహాద్రిశృంగ | మనఘ! నౌబంధనం బన నవనిఁ బరఁగె. |
229 |
| క. |
మనుసహితు లైన మునులం | గనుఁగొని, యమ్మీను గరము గారవమున ని ట్లనుఁ, ‘బ్రళయంబున కీడునఁ | జనకుండఁగ మీకు రక్ష సలిపితిఁ గరుణన్. |
230 |
| క. |
మునులార! యేను విశ్వం | బునకుఁ బరమకర్త యగు ప్రభుఁడ; వాత్సల్యం బున మత్స్య మైన రూపం | బున నిమ్మెయి నిన్ని చందములఁ జనవలసెన్. |
231 |
| వ. | మీరు నిర్భయు లై చరియించునది; మఱియు నిమ్మనువును, దేవాసురమానుషం బైన జగం బఖిలంబును సృజియించు; మత్ప్రసాదంబున నతనికిఁ బరమజ్ఞానోదయం బగు’ నని చెప్పి యయ్యాదిమత్స్యం బదృశ్యం బయ్యె; వైవస్వతుండును మఱియు నధికతపంబు సేసి సకలచరాచరభూతంబుల సృజియించె. | 232 |
| క. |
పరమం బగు వైవస్వతు | చరితం బతిభక్తి వినినఁ జదివినను మహా దురితంబు లడఁగు జనులకు | నిరవుగ సిద్ధించు ననఘ! యిహపరసుఖముల్.’ |
233 |
| వ. | అనిన నమ్మేదినీశ్వరుం డమ్మునీశ్వరునకుఁ బ్రణతుండై యి ట్లనియె. | 234 |
| క. |
‘పరమేష్ఠికల్పుఁడవు ని | ర్భరభూరితపఃప్రభావపరిపూర్ణుఁడ వ చ్చెరువు భవన్మాహాత్మ్యము | సురమునిలోకప్రణామశోభితచరణా! |
235 |
| క. |
అడరి నిఖిలాండకోటియుఁ | జెడునప్పుడుఁ జెడక నీవు జీవించెద; వే ర్పడ జగములు గ్రమ్మఱఁ గలి | గెడునప్పుడు సూచెదవు వికృతిరహితుఁడ వై. |
236 |
| చ. |
తొడరి చరాచరప్రతతితో జగమంతయు వార్ధిఁదొట్టి న ప్పుడు లలితాబ్జపీఠమునఁ బొల్చు చతుర్ముఖుఁ బద్మగర్భుఁ బెం పడర భజించి తీవు; జగదాదిజుఁ డైన ప్రభుండు నీయెడం గడు ననురక్తుఁడై యొసఁగెఁ గాదె మునీశ్వర! యీ ప్రభావమున్. |
237 |
| క. |
జగముల నెల్లను మ్రింగెడు | జగదంతకు మౌళి వామచరణం బిడి పె ల్లగు రోగజరాభరముం | దిగ విడువఁగఁ జెల్లె నీకుఁ ద్రిభువనవినుతా! |
238 |
| వ. | సకలచరాచరోత్పత్తిస్థితివిలయప్రకారంబులు నీకుం బెక్కుమాఱులు ప్రత్యక్షంబు లయి కానంబడి యుండుఁ గావున ని న్నడిగెద; లోకంబులు విలయకాలంబున నెట్టిభంగి యగు? నెఱింగింపు’ మనిన మార్కండేయుం డి ట్లనియె. | 239 |