| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము |
| వ. | అనిన విని ధర్మనందనుం డనుజసహితుం డై కృష్ణునిం బ్రశంసావచనంబుల నభినందించి, మార్కండేయుం జూచి, ‘మునీంద్రా! భవత్ప్రసాదంబున నత్యద్భుతకథాశ్రవణపరితోషితుల మైతిమి; కలియుగంబున సకలధర్మలోపం బగు నని చెప్పుదురు; తత్ప్రకారం బెఱింగింపవే!’ యనిన నతం డతని కి ట్లనియె. | 284 |
| క. |
‘కృతయుగమునందు ధర్మువు | చతురంశంబులను బరఁగఁ జను; నది త్రేతన్ ద్రితయమున నొక్కఁ డొకఁడుగఁ | బ్రతియుగమునఁ దఱుఁగఁ దొడఁగుఁ బాళులు వరుసన్. |
285 |
| వ. | అట్లగుటంజేసి ధర్మంబు కలియుగంబునఁ గరంబు దుర్లభం బయి పాదమాత్రావశిష్టంబయి యుండు; దత్ప్రవర్తనం బాకర్ణింపుము. | 286 |
| సీ. |
సత్యంబు నరులకు సంక్షిప్త మగు; సత్య | హాని నాయువు గడు నఱిగిపోవు; నాయువు దఱిఁగిన నల్పంబు లగు విద్య; | లల్పవిద్యలను మోహంబు మిగులు; మోహంబువలనఁ బై ముసురు లోభంబు; లో | భావేశమునఁ గామ మగ్గలించుఁ; గామంబుపెంపునఁ గడఁగుఁ గ్రోధంబు; క్రో | ధనంబున వైర మెంతయును బెరుఁగు; |
|
| ఆ. |
వైరమున నశేషవర్ణులు నన్యోన్య | పీడ సేయుచును విభిన్నబుద్ధి నొక్కఁడొకని మేర నుండక వర్ణ సం | కరము సేయఁగలరు కలియుగమున. |
287 |
| క. |
జపనియమస్వాధ్యాయ | ప్రపంచములు విడువఁగలరు బ్రాహ్మణులు, జనా ధిప! శూద్రులు విపుల తపః | క్షపితులు గాఁగలరు, వినవె! కలికాలమునన్. |
288 |
| మ. |
వివిధవ్యాఘ్రమృగోరగాకులము లై విస్తీర్ణశూన్యాటవీ నివహాభీలము లై యరాజకములై నిర్మూలధర్మంబులై ద్రవిళాభీరతురుష్కబర్బరపుళిందవ్యాప్తిదుష్టంబు లై భువిలో నెల్లెడఁ బాడగున్ జనపదంబుల్ దద్యుగాంతంబునన్. |
289 |
| క. |
క్షత్త్రియజాతులు శూద్రచ | రిత్త్రంబున శౌర్యమును సిరియుఁ దేజంబున్ మైత్త్రియును లేక చెదరి ధ | రిత్త్రీశ్వర! శూన్యు లై చరించెదరు ధరన్. |
290 |
| క. |
రసగంధద్రవ్యంబులు | పసచెడు, సస్యంబు లల్పఫలము లగు, మహిం బసిపాఁడి దఱుఁగుఁ, దరువులఁ | గుసుమఫలంబులును గరముఁ గొంచెంబు లగున్. |
291 |
| క. |
అరులు మిగులఁ గొని రాజులు | నరులకు నెంతయును భయ మొనర్తురు; ధరణీ సురులు గడఁగి వాణిజ్యముఁ | గరిసనమును జేయఁగలరు కలియుగవేళన్. |
292 |
| సీ. |
పాషండదర్శనబహుళంబు లయ్యెడు | వర్ణాశ్రమంబులు వసుమతీశ! తవిలి శరీరంబుఁ దద్దయుఁ బ్రోతురు | పుణ్యఫలంబులు బొంకు లనుచుఁ; గాలంబుతోఁ గూడఁ గలుగవు వానలు; | పొల్లులై బీజముల్ వొలిసిపోవుఁ; గ్రయవిక్రయంబులఁ గపటంబు దఱచగుఁ; | గడఁగి యిల్లడసొమ్ము లడఁచికొండ్రు; |
|
| ఆ. |
సాధుచరితు లైన జనులు దుర్గతుల రో | గములఁ దెగుదు; రల్పకాలమునన పాపపరులు లగ్గుఁ బరమాయువును నరో | గతయు సిరియుఁ బొందఁగాంతు రెందు. |
293 |
| క. |
ఉఱవగు నారికెపంటలు, | గొఱియల పాఁడియును దఱచగుం, బురుషులకుం దెఱవలు సుట్టము లయ్యెద, | రెఱచియు భుజియింతు రర్థి నెల్ల జనంబుల్. |
294 |
| క. |
పితృదైవతకార్యంబుల | నితరేతరభోక్తలగుదు రెల్లయెడలఁ గు త్సితదేశకాలపాత్ర | ప్రతతియ వర్తించు దైవపైతృకవిధులన్. |
295 |
| క. |
హేతుప్రత్యయవాదవి | చేతసులై వేదనింద సేయుచును మఖ వ్రాతంబులు వ్రతములుఁ బెడఁ | బాతురు దుర్మార్గకర్మపరు లై విప్రుల్. |
296 |
| మ. |
వనితాదుర్బలదీనబంధుజనసర్వస్వాపహారుల్ సుహృ జ్జనమాతాపితృపుత్త్రహంతలు యదృచ్ఛాకర్మశీలుర్ ధరన్ జనసంపూజితు లై చరింతురు; వినష్టశ్రీకు లై విప్రు లా జనులం జేరి పరిగ్రహించెద రవజ్ఞాపూర్వదుర్విత్తముల్. |
297 |
| మ. |
ధరణీరక్షణ మాచరింపక నృపుల్ దర్పంబునం బశ్యతో హరులై సాధుల దోఁచి చేకుఱు తదీయ స్త్రీధన క్షేత్రముల్ హరియింపంగలవారు; దారుణతరం బై పెల్లు చెల్లుం బర స్పరవైరంబు ధరాతలేంద్రులకు విశ్వప్రాణి నాశంబుగన్. |
298 |
| క. |
సుతుఁ డవమానించు జనకుఁ; | బతి నవమానించు భార్య; పడఁతులుఁ బతులున్ మతి నొండొరువుల మెచ్చక | సతతముఁ జరియింతు రిష్టసంచారములన్. |
299 |
| క. |
నడవవు దేవపితృక్రియ, | లుడుగును వేదార్థసమ్యగుపదేశంబుల్, గడఁగు మహామోహతమము, | పుడమి సమస్తంబుఁ గుజనభూయిష్ఠ మగున్. |
300 |
| సీ. |
పదియాఱువర్షముల్ పరమాయు వయ్యెడు | ధరణీశ! కలియుగాంతమున వినవె; యేడును నెనిమిదియేండ్ల ప్రాయంబునఁ | బ్రజ లుద్భవింతురు భామినులకు; ద్రవ్యవిహీనులై దాత యొక్కఁడు లేక | యన్యోన్యతస్కరు లగుదు రెందు; నెఱిఁగెడువారును నెంతయుఁ గ్రూరు లై | చెనసి పాపంబు సేసెదరు సూవె! |
|
| తే. |
యన్నవిక్రయ మొనరింతు రఖిలజనులు, | వేదవిక్రయు లగుదురు విప్రవరులు, పణ్యయోనుల యగుదురు పద్మముఖులు | గష్టతర మైన యక్కలికాలవేళ. |
301 |
| తరువోజ |
ఉక్కున శూద్రు లత్యుగ్రు లై కవిసి | యొండొండ పెక్కండ్ర నుఱక చంపుటయు దిక్కెవ్వరును లేక దీనులై వసుమ | తీసురుల్ నాలుగు దెసలఁ బాఱెదరు; మ్రుక్కడిచోరులు ముట్టి నిశ్శేష | ముగ ధనావలిఁ గొని మొగి వధియింప స్రుక్కి కాకులయట్ల శూన్యులై చెదరి | సొంపఱి యడవులు సొత్తురు జనులు. |
302 |
| క. |
శ్రుతిధర్మంబులు శూద్రులు | ప్రతిభం జెప్పంగ వినుచు బ్రాహ్మణజాతుల్ ధృతి సెడి తత్సేవకు లై | యతినిందితకర్మకారు లయ్యెద రధిపా! |
303 |
| మత్తకోకిల |
దేవతాయతనంబులున్ జగతీసురావసథంబులుం బావనాశ్రమభూములుం జెడి పాడగున్ శుభవృక్ష వ ల్లీవనంబులు నాశ మొందుఁ గలిప్రచారమునందు దు స్త్స్రీవిహారము మద్యపానముఁ జెల్లుఁ బెల్లుగ నెల్లెడన్. |
304 |
| క. |
గురుఁ గొనియాడఁడు శిష్యుఁడు; | గురుఁడును శిష్యునెడ వంచకుం డగు; మది నొం డొరువుల నొల్లరు బంధులు; | పొరిఁబొరి గఱవు లగుఁ బ్రజకుఁ బొడమును భయముల్. |
305 |
| తే. |
ఇవ్విధంబున ధర్మంబు లెల్ల నపగ | తమునఁ బడ జనులెల్లను దల్లడిల్ల బహువిధోత్పాతములు పుట్టుఁ బార్థివేంద్ర! | కడఁగి తత్కలికాల సంక్షయమునందు. |
306 |
| క. |
క్రమమున రాష్ట్రములును నగ | రములును నాశంబు నొందు; రక్షాచ్యుతులై భ్రమియింతురు జను లతి దు | ర్గమ గిరిసరిదంతికములఁ గడునాతురు లై. |
307 |