పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము
కలియుగంబున విష్ణుండు గల్కిరూపంబున ధర్మంబు ప్రతిష్ఠించుట (సం. 3-188-89)
వ. అంతఁ గలియుగాంతంబునందు భువనవిదితం బయిన శంబళ గ్రామంబున కల్క్యాత్మకుం డైన విష్ణుయశుం డను బ్రాహ్మణుండు జనియించి, సంస్మరణమాత్రన వేదశాస్త్రంబులును సమస్త శస్త్రాస్త్రవిశేషంబులు నధిగమించి సార్వభౌముండయి. 308
మధ్యాక్కర అసదృశతేజుఁడు బ్రాహ్మణానీకసహితుఁ డై కడఁగి
వసుమతియందు నధర్మవర్తు లై యున్న మ్లేచ్ఛులను
మసలక నిజశక్తిఁ జేసి మడియించి ధర్మంబు నిలిపి
వసునిభుం డొనరించుఁ బేర్మి వాజిమేధము నిష్ఠ యొప్ప.
309
క. ఘనుఁ డిలయెల్లను బ్రాహ్మణ | ధనముగ భాగించి యిచ్చి ధర్మయశోవ
ర్ధనుఁ డై వార్ధకమున న | త్యనఘుండు దపోవనంబునందు వసించున్‌.
310
వ. అతనిచేతం బ్రతిష్ఠితం బైన ధర్మంబు ననుసరించి బ్రాహ్మణాదివర్ణంబులు సమర్యాదంబులై వర్తింపంగలయవి; దాననచేసి కృతయుగంబు సంప్రాప్తం బగు; నందు. 311
శా. ఆరామవ్రజచైత్యసద్మవనదేవాగారసౌమ్యంబులై
భూరి బ్రహ్మతపస్వి సంకులములై పుణ్యాధ్వరారంభ సం
భారోదారములై నితాంతఫలిత భ్రాజిష్ణుసస్యంబులై
యారూఢస్థితి నెల్లదేశములు నొప్పారుం బ్రకాశంబులై.
312
క. సమయముతోడఁ గురియు వ | ర్షములు, గరము తేజ మెక్కి చరియించు నవ
క్రములై గ్రహంబు, లారో | గ్యము సౌఖ్యము సమధికముగఁ గలుగు నరులకున్‌.
313
వ. ఇది కృతయుగప్రవర్తనంబు; త్రేతాద్వాపర యుగంబులందుఁ ద్రితయ ద్వయపాదంబుల ధర్మంబ వర్తిల్లు; నిట్టి తెఱంగునం గాలగతు లనేకంబులు నాకుం బ్రత్యక్షసిద్ధంబు లయ్యె; నీ వడిగిన యతీతానాగతంబు లయిన విశేషంబు లెఱింగించితి; నింక నొక్క హితోపదేశంబు సేసెద; నాకర్ణింపుము. 314
క. ధరణీసురులకు నెప్పుడుఁ | గర మిష్టము సేయుమయ్య కౌరవవంశో
త్తర! విప్రులు సంతుష్టిం | బొరసినఁ జేకుఱు నశేషపుణ్యఫలంబుల్‌.
315
సీ. సకలభూతములందు సదయాత్ముఁడవు గమ్ము; | పాలింపు ప్రజల నీ ప్రజలఁ బోలె;
విశదవృద్ధాచారవేదివై ధర్మంబు | సలుపుము దురితవర్జనము గాఁగ;
నెఱుఁగమిఁ బాప మొక్కించుక దొడరినఁ | జయ్యన ప్రతికారశాలి వగుము;
గర్వంబు విడువుము, గరము ప్రియంబును | నిజమునుగా వచోనియతి నడపు;
 
తే. కాలగతు లెల్ల నెఱిఁగి యస్ఖలితబోధ | యుక్తుఁడవు గమ్ము; భరతవంశోద్భవుఁడవు
నీవు గావున నత్యంతనిర్మలుఁడవు | ప్రాజ్ఞుఁడవు; నీకు వేఱ చెప్పంగ నేల?
316
వ. అనిన విని యుధిష్ఠిరుండు ‘మునీంద్రా! నీయానతిచ్చిన వాక్యంబు లన్నియు నవహితుండ నై వింటి; నింతకుమున్ను నా యోపిన తెఱంగున లోభమాత్సర్యాది దుర్గుణంబులు పరిహరింతు; నింకను భవదుక్తం బైన ధర్మశాసనంబును బ్రయత్నంబునం బాలించెద’నని యతనికిఁబ్రణమిల్లి మఱియును బ్రాహ్మణప్రభావంబు వినువాఁ డై యతనిం బ్రార్థించినఁ, దద్విషయం బైన యితిహాసం బతనికి నమ్మహాముని యిట్లని చెప్పె. 317
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )