| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము |
| వ. | అని పలికి ధర్మవ్యాధుండు మఱియు నిట్లనియె; ‘నయ్యా! నీవు దొలుత నావర్తనంబు గనుంగొని యిది హింసా బహుళంబు గాదె? యని పలికితివి; దాని కేను దగు తెఱంగు సెప్పితి; నది య ట్లుండె; హింస యిట్టిది యహింస యిట్టి దని విభాగింప నెవ్వరికి నేర నగు? | 51 |
| క. |
మును తన చేసిన కర్మం | బునఁ జూవె నశించు భూతములు సంపెడు వాఁ డు నిమిత్తమాత్ర మింతయె | యని చెప్పఁగ వినమె యంచితాచారులచేన్. |
52 |
| వ. | అదియునుం గాక. | 53 |
| క. |
ఫలమూలౌషధిశాకం | బులుఁ బశుమృగతతులు భక్ష్యములుగా భూతం బుల కజుఁడు సేసె నని య | స్ఖలితంబుగ మ్రోయు శ్రుతులఁ గాదన వశమే! |
54 |
| సీ. |
అనఘ! యౌశీనరుం డగు శిబి నిజగాత్ర | హింస నింద్రాగ్నుల కిడఁడె మాంస; మతనికి లేదయ్యె నయ్య యుత్తమ గతి? | రంతిదేవుం డనురాజు తొల్లి యనుదినంబును గోసహస్రద్వయంబుఁ దా | వధియింపఁడే వేయి వత్సరములు; దురిత మమ్మహితాత్ముఁ దొడరెనే? వేదార్థ | నిరతులై యత్యంత నియతు లైన |
|
| తే. |
ధారుణీసురముఖ్యు లధ్వరములందుఁ | బశువరింపరే పశువులఁ; బరమపుణ్య గతులు గలుగవె వారికిఁ? గడఁగి యగ్ను | లధికమాంసార్థు లని శ్రుతులందు వినమె! |
55 |
| క. |
పితృదైవత కార్యములం | దతిభక్తిని మాంస మిడుట యర్హమనియుఁ ద త్పితృదైవశేషములు స | మ్మతి భోజ్యము లనియు మునులమతములు గావే. |
56 |
| మ. |
హలికుం డెంతయు నోజతో దునఁగ సీరాగ్రంబునం జోఁకి ప్రా ణు లనేకంబులు సచ్చు, హింస యది యౌనో కాదొ! వేయేల? మ ర్త్యులు నేలం జరియించుచోఁ బదములం ద్రొక్కంబడుం బెక్కు జం తులు హింసావిధి గాదనంగ వశమే దోషజ్ఞ! యూహింపుమా! |
57 |
| చ. |
సలిలము లుర్వి యాకసము సర్వము జంతుమయంబు గావునం గలుగు నవశ్యమున్ సకలకర్మములందును హింస, హింసకుం దొలఁగిన దేహయాత్రయును దుర్ఘట మైనటు లుండు; నింతయుం దలఁపరు హింస సేయ మని తారు తలంతురు గొంద ఱిమ్మహిన్. |
58 |
| క. |
పనివడి యహింస వ్రతముగఁ | గొని వనమున నున్న మునులకుం దొడరదె హిం సనము తరుమూల ఫలశా | కనిపీడన మదియు హింస గాదొకొ తలఁపన్. |
59 |
| తే. |
హింస సేయనివాఁడు లేఁ డిజ్జగమున | నొక్కఁడైనను, దమతమ, యోపినట్లు హింసతెరువున కెడఁగల్గి యేఁగవలయు | నదియ చూవె యహింసనా నతిశయిల్లు. |
60 |
| వ. | ధర్మంబు బహుప్రకారం బై యుండుఁ; దదీయసూక్ష్మగతి దురవబోధంబు; గావున శ్రుతిప్రమాణంబువలనను వృద్ధాచారనిదర్శనంబులను నెఱింగికొనునది. | 61 |
| ఉ. |
భూతహితంబుగాఁ బలుకు బొంకును సత్యఫలంబు నిచ్చుఁ; ద ద్భూతభయాస్పదం బగు ప్రభూతపుసత్యము బొంకు నట్ల; ప్రా ణాతురుఁ డైనచోఁ, బరిణయంబునయందును బల్కు బొంకు స త్యాతిశయంబ యండ్రు; మహితాత్మక! యిట్టివి ధర్మసూక్ష్మముల్.’ |
62 |
| వ. | అని తెలిపి మఱియు నతండు. | 63 |
| క. |
‘ఒప్పెడునది యైనను గడు | నొప్పనియది యైన నిజకులోచితపథముం దప్పఁ దగదండ్రు ధార్మికు | లప్పని నిజభాగ్యవిహిత మని యుండఁదగున్. |
64 |
| క. |
విను, పూర్వకర్మఫలములు | దనకు వశము గాక పొందుఁ దఱితో వానిం; గనుఁగొననేరక మూఢుఁడు | దన కాపద యైనచోట దైవము దూఱున్. |
65 |
| తే. |
కార్యఫలములయెడఁ దాన కర్త ననుట | కడు నెఱుంగమిఁ జువ్వె! తాఁ గర్తయేని తగిలి తనదైన కార్యజాతంబు నెల్లఁ | జెడక ఫలియించునట్లుగాఁ జేయరాదె! |
66 |
| వ. | అది యెట్లంటేని. | 67 |
| సీ. |
నీతిమంతులు ధర్మనిరతులు దక్షులు | నగువారు సేయు కార్యములు గొన్ని సిద్ధిఁ బొందవు, దుష్టచిత్తులు క్రూరు లై | చేయఁ గొన్ని విశేషసిద్ధిఁ బొందు; నూరక యుండంగ నొందుఁ గొందఱ విపు | లార్థముల్; గొంద ఱాయాస పడియు నిష్ఫలారంభు లై నిలుతురు; గొందఱు | పేదవారికిఁ బ్రజ పెల్లు వొడము |
|
| తే. |
నర్థవంతులు గొందఱ కర్థి నధిక | దానములు ధర్మములు సువ్రతములుఁ జేయఁ బ్రజలు వుట్టరు; విను మిట్టిభంగి సుమ్ము | కర్మఫల మాత్మతంత్రంబు గాక యుండు. |
68 |
| క. |
పురుషుఁడు కర్మాధీనత | నరుగక తనవశమ యనిన నాపదలు రుజల్ మరణంబును నివి యేమియుఁ | బొరయక యుండంగ బ్రదుకఁబోలదె చెపుమా! |
69 |
| ఆ. |
కర్మవశతఁ జూవె కలుగు దేహము; దేహ | వర్తనంబు కర్మవశతఁ బుట్టు; దేహపాత మైన దేహస్థుఁ డగు జీవుఁ | డరుగుఁ గర్మవిహిత మైన యెడకు’. |
70 |
| వ. | అనినం గౌశికుండు ‘జీవుం డెట్టివాఁ?’ డని యడిగిన లుబ్ధకుం డి ట్లనియె. | 71 |