పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము
ధర్మవ్యాధుఁడు కౌశికునకు ధర్మవిశేషంబు లెఱిఁగించుట (సం. 3-198-19)
క. తనకులధర్మము విడువక | మనుట పరమధర్మ మండ్రు మాన్యులు; చిత్తం
బునఁ గృప గలుగుట ముఖ్యపుఁ | బని; సైరణ వలయు నఖిలభావములందున్‌.
37
ఆ. విడువవలయు విషయవిషమవాంఛల నెద | విడుపుఁబోలు గుణము వెదకి యెందుఁ
గానరైరి బుధులు గలదె పరిత్యాగ | శీలునకు నసాధ్యసిద్ధి యెందు.
38
సీ. సత్యహితాలాప చతురత యర్హంబు, | సంతత సుజన పూజనము వలయు,
విను కామసంరంభవిద్వేషములఁ జేసి | మతి గలంగినను ధర్మంబు దప్పఁ
ద్రొక్కక నడచు టత్యుత్తమసరణి; య | ప్రియములయందును బ్రియములందు
దైన్యహర్షంబులఁ దగులక యున్నట్టి | కల్యాణవర్తనకాంక్ష లెస్స;
 
తే. యెగ్గు సేసినవారికి హితము సేఁత | యార్యజనములు గీర్తింతు; రన్యదోష
కారి దనపాపమునఁ దాన కాలిపోవు; | వేఱ వానికిఁ గీడు గావింప నేల?
39
క. ధార్మికులు సలుపు నుత్తమ | కర్మముఁ జెడనాడు నాస్తికజనము; విను! మా
దుర్మతుల తెఱఁగు గైకొని | ధర్మమునెడఁ బ్రీతి వదలఁ దగదు బుధునకున్‌.
40
క. మది మఱపునఁ బాపము దన | కొదవుటయును బిదప వగచి యొక సగమును నే
నిది సేయ నింక ననియెడు | మదిఁ బెఱసగమును నరుండు మలుఁగు నఘంబున్‌.
41
తే. పాపముల కెల్ల నెక్కుడు పాతకములు | సువ్వె క్రోధలోభంబులు సువ్రతాత్మ!
వాని రెంటి జయించినవాఁడు గాని | యెందుఁ బరమధార్మికుఁ డని యెన్నఁబడఁడు.
42
వ. శిష్టచరితంబులుగాని మార్గంబులుగొన్ని తృణసంవృతంబులైన కూపంబులుం బోలెఁగపట ధర్మ సంవృతంబులై యుండు; వాని దవ్వులన పరిత్యజించి శిష్టాచారంబుల నడపుట ధర్మలక్షణం’ బనినం గౌశికుండు ‘శిష్టాచారంబు లెయ్యవి? యెఱింగింపు’ మనుటయు ధర్మవ్యాధుం డి ట్లనియె. 43
సీ. ‘దానంబు, సత్యంబుఁ, దపము, యజ్ఞము, నార్జ | వముఁ, గామలోభాది వర్జనంబు
గురుజన శుశ్రూష, క్రోధ రాహిత్యంబు | దమము, సంతోష, మధ్యయన నిరతి,
దాంభికత్వము లేమి, దైన్యంబు వొరయమి | యనసూయ, యనహంక్రియాభియుక్తి,
దలఁపంగ నాద్యమై తనరు ధర్మమ యెప్డుఁ | గొనియాట, నాస్తికగోష్ఠిఁ జనమి,
 
తే. శీలసంరక్ష, తీర్థసంసేవ, శౌచ, | మఖిలభూతంబులందు దయార్ద్రుఁ డగుట,
మితహితోక్తులు, సంశ్రితమిత్త్రగుప్తి | యిన్నియును శిష్టచరితంబు లిద్ధచరిత!
44
క. విను శిష్టచరిత గైకొని | యనసూయత నడవ నడవ నంతఃకరణం
బునఁ బొదలు నట్టి సమ్మద | మనఘా! దుర్లభము సూవె యన్యపథములన్‌.
45
వ. కావున శిష్టాచారనియతిం జేసి గురుశుశ్రూష సలిపి కృతాధ్యయనుండ వై పరమజ్ఞానపరిపక్వం బైన చిత్తంబుతోడం గామక్రోధ మహామకరసంకీర్ణయు విషయజలపరిపూర్ణయు నైన మోహజలధి నస్ఖలితధైర్యం బను తెప్పం జేసి యశ్రమంబున నిస్తరించి కృతార్థుండ వగు’ మని మఱియు నిట్లనియె. 46
క. ‘క్రమమున శిష్టాచార | క్రమ మెఱుఁగఁగ ధర్మమునకుఁ గడు వాటం బై
విమలం బగుఁ జిత్తము స | త్యమును నహింసయును దనకుఁ దావలములుగన్‌.
47
ఆ. విను మహింస ధర్మవితతి కెల్లను మేటి; | యదియు సత్యయుక్త మైన వెలయు
ననఘ! శిష్టచరితలందు సత్యమ కడు | నధిక మనిరి శ్రుతుల నరసి బుధులు.
48
తే. వేద విహితంబులును శాస్త్రవిహితములును | శిష్టచరితంబులును ననఁ జెప్ప నొప్పి
ధర్మములు మూఁడువిధములఁ దనరుచుండుఁ | గడఁగి యిన్నియు సద్గతికారణములు.
49
మ. అనయంబున్‌ శ్రుతవంతుఁడై వినుతశిష్టాచారమార్గంబులం
జను పుణ్యాత్ముఁడు దుర్గముల్‌ గడచి ప్రజ్ఞాహర్మ్యసంరూఢుఁడై
కనుచుండుం బటు మోహపంకజలమగ్నం బైన లోకంబు వీఁ
క నధోభాగమునందు డింది కడుదుఃఖం బొందఁగా నవ్వుచున్‌.’
50
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )