పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము
ధర్మవ్యాధుఁడు కౌశికునకుఁ దన పూర్వజన్మ వృత్తాంతంబు సెప్పుట (సం. 3-205-21)
క. ‘జననుత! నీ వెయ్యది యడి | గినఁ దెలుపుట నా కవశ్యకృత్యము గాదే!
విను చెప్పెదఁ; బూర్వభవం | బున నే నొక బ్రాహ్మణుండఁ బుణ్యచరితుఁడన్‌.
130
వ. వేదవేదాంగపారంగతుండ నై యుండుదు; నాకుం బ్రియసఖుం డైన యొక్క రాజపుత్త్రుతోడి సంగతిం జేసి ధనుర్వేదంబును నభ్యసించితి; నొక్కనాఁ డమ్మహీపతి వేఁట వోయిన నేనును నతనితోడన చని వనంబునం బెక్కు మృగంబుల నేయుచుండ నం దొక్కబాణంబు దృణలతాంతరితదేహుండైన మునివరు నొక్కరుం దాఁకిన నతఁడు హా! యనుచుం బడియె; నంత నేనును. 131
ఆ. డాయఁబోయి తీవ్రసాయకవిద్ధుఁ డై | పొరలుచున్న విప్రవరునిఁ జూచి
తలఁకి యనునయంపుఁ బలుకులు పలికినఁ, | గినిసి యిట్టు లనియె మునివరుండు.
132
ఆ. ‘బ్రాహ్మణుండవయ్యుఁ బాపప్రవృత్తివై | శూద్రకర్మమునకుఁ జొచ్చి తీవు
గాన నిక్కువము మృగవ్యాధజన్ముండ | వగుము మీఁద’ ననియె; ననిన నేను.
133
చ. ‘ఎఱుఁగక తప్పు సేసితి సహింపఁగదే! కడుదుర్భవంబునం
బఱుపకుమయ్య!’ నావుడుఁ గృపన్‌ మునినాథుఁడు ‘దప్ప దివ్విధం;
బెఱుకుకులంబునందు జనియించియు ధర్మువు లెల్ల నిమ్ముగా
నెఱిఁగెదు, తల్లిదండ్రులకు నెంతయుఁ బ్రీతి యొనర్తు భక్తితోన్‌.
134
వ. గురుశుశ్రూషం జేసి నీకుఁ బరమశోభనం బగు; జాతిస్మరత్వంబునుం గలుగు; నపరజన్మంబునఁ బరమబ్రాహ్మణుండ వయ్యెద’ వని యనుగ్రహించిన, నవ్విప్రుని దేహంబునందు నాటిన బాణంబు మెత్తన పెఱికి, యతనిం దదీయాశ్రమంబునకుం జేర్చితి; నా చేసినపుణ్యంబున నమ్మహాత్ముండు నపాయంబు వొందం డయ్యె; నాకు నిట్టిజన్మంబు నొంద వలసె’ నని చెప్పినం గౌశికుం డిట్లనియె. 135
తే. ‘జన్మ మిట్టిది, చరితంబు చంద మిట్టి | దెన్నఁడును నిట్టిచోద్య మే నెందుఁ జూడ;
నింక జన్మాంతరముదాఁక నేల? యిపుడ | పుణ్యచరిత మై నీవు విప్రుఁడవ కావె!
136
ఆ. పాపవర్తనుండు బ్రాహ్మణుం డయ్యును | నిజము శూద్రుకంటె నీచతముఁడు;
సత్యశౌచధర్మశాలి శూద్రుం డయ్యు, | నతఁడు సద్ద్విజుండ యనిరి మునులు.
137
క. అనయంబు నాత్మకర్మం | బున నతినీచ మగు భవముఁ బొందవలసెనే
యని నీవు నిరంతరమును | మనమున దుఃఖింపవలదు మహితచరిత్రా!
138
చ. నిజగుణదోషకర్మముల నెట్టన మేలును గీడు వచ్చుఁ; ద
త్ప్రజనితసౌఖ్యదుఃఖములఁ బ్రాజ్ఞులు దుల్యమనస్కులై మనో
రుజలును దేహజంబు లగు రోగములున్‌ హితధర్మకర్మభే
షజములఁ జేసి పొపుదురు సర్వము సాత్త్వికదృష్టిఁ జూచుచున్‌.
139
క. ప్రియములు వాయుటయును న | ప్రియములు వెసఁ బొందుటయును బెల్లుగ నగుఁ ద
త్క్రియలందు మూఢమతికి హృ | దయతాపము పాయ దెపుడు దరికొనుచుండున్‌.
140
తే. వగతుమన్న నెవ్వారికి వగవఁ జనదు | చిత్తమున నేమిటికి సంతసింపరాదు
కాన గతమునందును ననాగతమునందు | వగవ రార్యులు సంతోషవంతు లగుచు.
141
క. వగపునఁ దేజోహీనుం | డగు నాత్మహితక్రియలకు నక్షముఁ డగు న
వ్వగపు దొఱఁగి యుద్యోగము | దగఁ జేయఁగఁ గలుగు నంచితము లగు శుభముల్‌.
142
వ. కావున భూతంబుల సదసత్ప్రకారంబులు గనికొని ధీరుండ వై యుండు’ మనిన ధర్మవ్యాధుండు ‘మహాత్మా! నీ చెప్పినయంతవట్టు నిదర్శనంబులుగాఁగొని యేను నిఃఖేదుండ నై యున్నవాఁడ; భవిష్యత్కాలసద్భావంబునందు సమాహితుండ నై యుండువాఁడ’ ననియె; నంత నా భూదేవుండు. 143
చ. ‘అతులిత పుణ్యమూర్తివి, కృతాత్ముఁడ వెందును నీవు ధర్మ మూ
ర్జితముగ నెప్పు డేమఱక చేయుచు నుండుము, నిత్యశోభన
స్థితి వెలుగొందు; మేను భవదీయసమాగతిఁ జేసి ధర్మ సు
స్థితమతి నైతి న న్ననుమతింపు గుణాకర! పోయి వచ్చెదన్‌.’
144
వ. అని వానికిం బ్రదక్షిణంబు సేసి వీడ్కొని చని కౌశికుండు నిజజననీజనకుల కతిభక్తి శుశ్రూష చేసి కృతార్థుం డయ్యెం; బాండవోత్తమా! నీయడిగిన తెఱంగునం బతివ్రతామాహాత్మ్యంబును బితృశుశ్రూషావిశేషంబును హీనవర్ణుం డైనవాఁడు ధర్మంబు సలుపు నుపాయంబును జెప్పితి’ ననిన విని ధర్మతనయుండు సంతసిలి మఱియు మార్కండేయు నిట్లని యడిగె. 145
తే. ‘అగ్నిదేవుండు తొల్లి మహాతపంబు | సేసె నని విందు; నది యేల చేసె ననఘ!
యంగిరసుఁ డేమి కతమున నగ్ని యయ్యె? | నగ్ను లెన్ని విధంబుల నతిశయిల్లు?
146
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )