| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము |
| వ. | ఇంతయు వినవలతు’ ననిన, నమ్మహాముని యిట్లని చెప్పె; ‘నగ్నిదేవుండు దేవతలతోడి యలుకం జేసి హవ్యంబులు వహింప నొల్లక వనంబునకుం జని బహుకాలంబు ఘోరతపంబు సేయుచు నత్యంతకృశుం డై యాత్మ గతంబున. | 147 |
| చ. |
‘అలుకమెయిం దొలంగి విపినాంతరభూమికి వచ్చి యిట్లు నే వెలుఁగక యున్నచో భువనవృత్తము సర్వము నిల్చు, నిల్చినన్ జలరుహసూతి వేఱొకనిఁ జయ్యన నగ్ని పదంబునందుఁ దా నిలుపక యున్నె? నే నిచట నిల్చుట పోలదు పోయెదన్ వెసన్’. |
148 |
| వ. | అని తలంచి తపంబు సాలించి నిజపదంబున కున్ముఖుండై చని చని, యంతకు మున్న బ్రహ్మనియోగంబునం ద్రిలోకంబులకు నగ్నియై వెలుంగుచున్నవాని నధికతపో విజృంభితు నంగిరసుం గని, భయంపడి, యెప్పటి యట్ల మగిడిపోవు నెడ నంగిరసుం డతనిపాలికిం జనుదెంచి, యిట్లనియె. | 149 |
| చ. |
‘అనఘ! జగత్త్రయార్చితుఁడవై తిమిరాపహరుండవై తగన్ వనరుహగర్భుచేఁ బ్రథమవహ్నిపదంబునఁ గల్పితుండ వై తనరుదు; రమ్ము! నీ దగు పదంబున నే నిటులుండ నోడుదున్; ఘనముగ నీవు నీ పదము గైకొనవే! యవికల్పభావనన్’. |
150 |
| వ. | అనిన నగ్నిదేవుం డిట్లనియె. | 151 |
| క. |
‘విను నా కీర్తి జగంబులఁ | బొనుఁగు పడియె; నీవు భువనపూజితవృత్తిం బనుపడితి గానఁ దగు నీ | యనలపదము నీక; నాకు నలవడ దింకన్. |
152 |
| వ. | ‘నీవు ప్రథమాగ్నివైయుండు; మేను ద్వితీయంబగు ప్రాజాపత్యవహ్నినైవర్తించెద’ ననిన నంగిరసుండు ‘దేవా! యి ట్లానతీ వలదు; ప్రథమాగ్నిత్వంబు నీవ కైకొని, నన్ను నీకుం బ్రథమపుత్త్రుంగా నాదరింపు’ మనినం. బావకుండు దాని కొడంబడియె; నివ్విధంబున నంగిరసుం డగ్నికి నగ్రతనయుం డై యగ్నిసారూప్యంబునం దేజరిల్లె; నయ్యంగిరసునకు శివ యను దానికి బృహత్కీర్తియు, బృహజ్జ్యోతియు, బృహద్బ్రహ్మయు, బృహన్మనసుండును, బృహన్మంత్రుండును, బృహద్భానుండును, బృహస్పతియు నన నేడ్వురు గొడుకులు, మఱియు భానుమతియును, రాగయు, సినీవాలియుఁ, గుహువు, నర్చిష్మతియు, మహిష్మతియు, మహామతియు నన నేడ్వురు గూఁతులుం బుట్టిరి. | 153 |
| క. |
తనయుఁడు బృహస్పతికి న | త్యనఘుఁడు శంయుండు వుట్టి యాగంబులలో మునుమును హవిషాజ్యము దాఁ | గొనియెడు వాఁ డయ్యె నధికగుణయుక్తి మెయిన్. |
154 |
| వ. | ఆ శంయునకు ధర్మపత్ని యైన సత్యకు భరద్వాజుండును భరతుండును నా నిరువురు కొడుకులు పుట్టి; రందు భరతునకు భారతుం డను కొడుకును, భారతి యను కూఁతురుం బుట్టిరి; భరద్వాజునకు వీర యను దానికి వీరుండు పుట్టె. | 155 |
| క. |
వానికి సరయువునకుఁ బటు | భానుం డై పుట్టె సుతుఁడు భానుఁ డనఁగ; నా భానునకు నిశ్చ్యవనుఁ డనఁ | గా నాత్మజుఁ డుద్భవించెఁ గడు నుజ్జ్వలుఁ డై. |
156 |
| చ. |
అతనికిఁ బుట్టెఁ బుత్త్రుఁడు నిరంతరతేజుఁ డుదారకీర్తి ని ష్కృతి యను పేరివాఁడు విను కిల్బిషభాజను లైన మానవుల్ సతతము నా కృశాను నతిసక్తమనస్‌స్థితిఁ గొల్చి దోష ని ష్కృతిఁ దగఁ గాంతు; రట్లగుట గీర్తిత మయ్యెఁ దదాఖ్య వానికిన్. |
157 |
| క. |
ఘనుఁడు రుజస్కరుఁ డనఁగా | జనియించెను నాతనికి; రుజస్కరునకు న త్యనుపమకాంతిపరుం డై | జనియించెం గ్రోధుఁ డనఁగ జనవరతిలకా! |
158 |
| వ. | ఆ క్రోధునకు రసుండు వుట్టె; రసునకు స్వాహా యను కన్యకయుం గాముం డను కొడుకునుం బుట్టిరి; కామునకు నమోఘుండు పుట్టె; నమోఘునకు నుక్థుండు పుట్టె; మఱియుం గాశ్యపుండును వాసిష్ఠుండును బ్రాణుండును నాంగిరసుండును జ్యవనుండును నను వా రేవురు తేజస్వి యైన కొడుకుం బడయుదు మని యనేక వర్షంబులు ఘోర తపంబు సేసి మహావ్యాహృతిస్మరణంబు సేయుచున్నంత. | 159 |
| చ. |
అనలము చాయ మస్తకము, నర్కనిభం బగు బాహుయుగ్మముం, గనకసముజ్జ్వలంబు లగు కన్నులుఁ, జర్మము కృష్ణవర్ణతం దనరిన జంఘలుం గల యుదాత్తపు దేహము దేజరిల్లఁగాఁ దనయుఁడు పుట్టె వారలకుఁ దద్దయు నద్భుత మంద లోకముల్. |
160 |
| వ. | ఇట్లు పుట్టిన యప్పావకుండు పంచజనకప్రభవుండు గావునం బాంచజన్యుం డను పేరం బ్రసిద్ధుం డై దశ సహస్రవర్షంబులు దపంబు సేసి నిజమస్తకంబున బృహద్రథంతరులనువారలను, వదనంబున హరిని, నాభియందు శివుని, బలంబున నింద్రునిం, బ్రాణముల వాయ్వగ్నులను, బాహుయుగదంతపుటంబుల విశ్వభూతంబుల సృజియించె మఱియును. | 161 |
| క. |
తపుఁ డను వహ్ని నిరంతర | తపోనిరూఢుఁ డయి పంచదశపుత్త్రుల న త్యపరిమిత ఘోర తేజో | విపులాత్ములఁ గనియెఁ గపటవృత్తినిపుణులన్. |
162 |
| వ. | ఆ పదియేవురు సుభీముండు, నతిభీముండును భీముండును భీమబలుండును నతిబలుండు నను వా రొక్క మొగియును, సుమిత్త్రుండును మిత్త్రవంతుఁడును మిత్త్రజ్ఞుండును మిత్త్ర వర్ధనుండును మిత్త్రధర్ముండును నను వా రొక్క మొగియును, సురప్రవీరుండును వీరుండును సువేషుండును సువర్చసుండును సురహంతయు నను వారొక్క మొగియునుగానిట్లు మూఁడుమొత్తంబు లై యజమానుల యజ్ఞఫలంబు లపహరించు చుండుదురు; తత్ప్రశాంత్యర్థంబై యాగంబులందు నగ్నిచయనంబు సేయునది. | 163 |
| తే. |
అధిప! విహగాకృతుల నొప్పు నగ్ని చయన | ముల యుదగ్రపక్షాఘాతములను విప్ర వరుల మంత్రఘోషములను వారు నిహతు | లై భయంపడి చేరరు యజ్ఞభూమి. |
164 |
| వ. | తపుండు మఱియు సకలయజ్ఞభాగభుజు లైన పుత్త్రుల నేవురం గనియె; నం దగ్రజుండు. | 165 |
| సీ. |
వైశ్వానరుం డను వహ్ని చాతుర్మాస్య | విధులందు భూసురవితతిచేతఁ బర్జన్యసహితుఁ డై పరమార్చనముఁ గాంచు | నధిప!; రెండగు నాతఁ డఖిలమునకుఁ బ్రభుఁడు దానై విశ్వపతి యన విలసిల్లు; | వినుము! మూఁడగు వాఁడు విశ్వమునకు నాత్ముఁడై విశ్వకుం డన నొప్పు; నాలవు | నతఁడు భూతముల యాహార వితతి |
|
| తే. |
వెలయఁ బక్వము సేయుట విశ్వభుక్కు | నాఁగఁ బెంపొందు; గోపతి నామధేయుఁ డై సమస్తధర్మక్రియలందు హేతు | వై ప్రశస్తి వహించు నేనగు నతండు. |
166 |
| వ. | మఱియు భానుం డను వహ్నికి సోమపుత్త్రియైన బృహద్భాసయందు బలదుండును మన్యుమంతుండును ధృతిమంతుండును నాగ్రయణుండును నగ్నియు సోముండును నన నార్వురు గొడుకులు నిశ యను కూఁతురుం బుట్టిరి; సకలతపఃఫలంబులు నిర్వహించుట కయి పురందరుండు మను నామ ధేయుం డైన కొడుకుం బడసె; నమ్మనువు భానుపుత్త్రియైన నిశాకన్యం బెండ్లియై, ప్రాజాపత్యుం డను పేరఁ బరఁగి పరమబ్రాహ్మణులచేత నర్చితుం డయ్యె; నివ్విధంబున ననేక వహ్నులు సకలధర్మ క్రియాసాధకు లై వెలింగిరి; దక్షిణాగ్ని ప్రముఖంబు లైన వహ్నులు వాయుహతిం జేసి యన్యోన్య సంస్పృష్టంబు లయ్యె నేనియు, రజస్వలాది సంకరంబులం బొరసె నేనియు, మృతక జాతకాది సంస్పర్శనంబునం బొందెనేనియుఁ, దత్ప్రాయశ్చిత్తార్థం బై యష్టాకపాలేష్టి సేయ వలయు’ నని చెప్పి మఱియు మార్కండేయుం డిట్లనియె. | 167 |
| క. |
‘ఆపుఁ డను వహ్ని యతులిత | రూప యయిన ముదిత యను తరుణియందు జగ ద్దీపకు నపారతేజు మ | హాపూజ్యుం గనియె నగ్ని నద్భుతనామున్. |
168 |
| చ. |
అతఁడు త్రిలోకతంత్రము నిరంతర మై చన నిర్వహించుచున్ శతమఖుఁ డాది యైన సురసంతతికిం బ్రియ మొప్ప హవ్యముల్ సతతము మోచి యిచ్చుచు భృశం బగు తద్భర మోర్వలేక సు వ్రత నిరతుం డధర్వుఁ డనువానికి నిట్లను నాదరంబుతోన్. |
169 |
| వ. | ‘ఏను దుర్బలుండ నైతి; నీవు దేవతలకు హవ్యంబులు మోచి యి’ మ్మని వానిం బంచి, తాను సముద్రంబు సొచ్చి యందు దాఁగుటయు, దేవత లద్దేవముఖుం డున్న యెడ రోయం దొడంగిన నబ్ధిచరంబు లైన మత్స్యంబులు సురలకు నగ్నిదేవుండు జలధి నుండుట సెప్పుటయుం గనలి యనలుండు మీలం జూచి’ జనంబులు మిమ్ము నిర్దయు లై వధియింతురు గావుత’ మని శాపం బిచ్చె; నప్పుడు. | 170 |
| ఆ. |
హవ్య వహనమునకు నమరోత్తములు దన్ను | వేయువిధుల నొలసి వేఁడుకొనిన నెట్లు నియ్యకొనక యెంతయు విసిగి స | మీరసఖుఁడు దనదుమేను విడిచె. |
171 |
| వ. | ఇట్లు సంత్యక్తశరీరుం డై ధరాతలంబు ప్రవేశించుటయు, నతనిచేత విడువంబడిన దేహంబువలనం బూయంబున గంధకంబు, నస్థుల దేవదారువును, శ్లేష్మంబున స్ఫటికంబును, బిత్తంబున మరకతంబును, వాతంబునఁగృష్ణశిలయు, నఖంబుల నభ్రకంబును, స్నాయుసంచయంబునం బ్రవాళంబునుం బుట్టె; నతండు భూగర్భస్థితుండై ఘోరతపంబుసేయుచున్నంత భృగ్వంగిరఃప్రముఖులైన మహామునులు నిజతపోబలంబున నతనికి నాప్యాయనంబు సేయుటయుఁ దేజస్వి యై ధరణి వెలువడి వచ్చి యమ్మహాత్ముం డమ్మహామునులం జూచి తదీయతేజంబు దనకు దుస్సహం బగుటయు భయంపడి క్రమ్మఱ నంబుధి సొచ్చి యడంగిన. | 172 |
| క. |
విను జననాయక! సంయమి | జనములు వహ్నిపని యంతఁ జాలించి ప్రియం బున నంచితవిధి సంగ్రహ | మునకై పూజించి రధికపుణ్యు నధర్వున్. |
173 |
| వ. | అయ్యధర్వాగ్ని తేజంబును నమ్మును లతనికిం జేయు బహుమానంబునుం దన్ముఖంబున నమరులు దృప్తు లగుచునికియుం జూచి సహింపక పావకుండు సకలభూతంబులుఁ జూచుచుండ నంబుధి వెలువడి వచ్చి నిఖిలలోకహితార్థంబుగా నెప్పటియట్ల హవ్యవహత్వంబు నంగీకరించె; ని ట్లనేకశాఖం బయిన యగ్ని వంశంబు ప్రశంసాభాజనం బయ్యె; నగ్ను లెంద ఱైనను దదాత్మ యైన తేజం బొక్కటి’ యని చెప్పిన విని సంతసిల్లి యమ్మహామునికి ధర్మతనయుం డి ట్లనియె. | 174 |
| క. |
‘మునినాథ! మహాసేనుం | డనలునకుం గృత్తికలకు హరునకు సుతుఁడై న నిమిత్త మేమి తెఱఁ గే | వినవలతుం జెప్పవే! సవిస్తరఫణితిన్’. |
175 |
| వ. | అనిన మార్కండేయుం డతని కిట్లని చెప్పెఁ; దొల్లి దైత్యులతోడ రణంబు సేసి యోటువడి దేవగణసహితుం డై దేవేంద్రుండు దొలంగిపోయి దానవుల నోర్వనోపునట్టి మహాసత్త్వుం డగు సేనాపతి నెందుఁ బడయుదు నొకో! యని యొక్కనాఁడు మానసం బను శైలంబునకుం జని యం దొక్కయెడ నొక్కరుండ కార్యచింతాపరుం డై యున్న యెడ. | 176 |
| తే. |
‘ఒక్క దనుజాధముండు మొఱ్ఱో యనంగ | నన్నుఁ జెఱగొని పోయెడు నన్నలార! యెవ్వ రిట విడిపింపరే యింత వట్టు | పుణ్యమునఁ బోవరయ్య! కారుణ్యబుద్ధి’. |
177 |
| వ. | అని యిట్లు సువ్యక్తం బైన వనితావిలాపంబు వీతెంచినం బురందరుండు నిజాంతరంగంబు గరుణాతరంగితం బగుటయు ‘నోడ కోడకు మిదె యేను వచ్చితి’ ననుచు నద్దిక్కునకు నడచి ముందట నతిభయంకరాకారుం బటుగదాహస్తు నప్రచలితవిద్యుల్లతారుచిరమూర్తి యైనదాని నొక్క కన్నియం గొని గగనతలంబునం బఱచువానిం బ్రబలవలాహకవినీలదేహుఁ గేశి యను దానవుం గని సరభసుం డై. | 178 |