పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము
ఇంద్రుఁడు కుమారస్వామిపై నెత్తివచ్చుట (సం. 3-216-3)
ఉ. స్కందునిమీఁద నెత్తి బలగర్వితుఁడై నడతెంచె నుద్భట
స్యందన సామజాశ్వభట సంకుల సైన్య సమగ్ర దేవతా
బృంద సమేతుఁడై భువనభీకరసంగరకాంక్ష నింద్రుఁ డ
స్పందితశౌర్యుఁ డగ్నికణజాత భయంకరవజ్రహస్తుఁడై.
215
వ. అంత. 216
తరలము తరళదీధితిపుంజనిర్భరదారుణాయుధపాణు లై
తెరలఁ ద్రోచి దివౌకసుల్‌ పఱతెంచి యార్చుచుఁ దాఁకి రా
శరవణోద్భవు; నాతఁడుం దగ సంభ్రమస్ఫుటరోష వి
స్ఫురితనిష్ఠురహాసజృంభణమున్‌ వహించినఁ జెచ్చెరన్‌.
217
తే. అతని ముఖగహ్వరంబుల నద్భుతముగ | నుగ్రదహనశిఖావళు లుద్భవించి
వేల్పుమూఁకల నరికట్టి వేల్వఁ దొడఁగె; | నంత నెంతయు సంభ్రాంతు లగుచు సురలు.
218
క. ‘నీ కింకరులము మమ్ముం | జేకొని కృపఁ గావు’ మనుచు శిఖినందను న
స్తోకబలు శరణు వేఁడినఁ | జేకొని దాహభయ ముడుగఁ జేసె నతండున్‌.
219
వ. ఇట్లు దేవతలు గుమారు నాశ్రయించినం జూచి బలసూదనుండు క్రోధఘూర్ణితనయనుండై యతనిమీఁద వజ్రంబు వైచిన, నది తదీయ దక్షిణపార్శ్వంబుఁ దాఁకిన, నం దొక్క పురుషుండు గాంచనవర్ణుండును శక్తి ధరుండును మేషవదనుండును నై విశాఖుం డను పేరం బ్రభవించె; మఱియునుం గన్యాకుమార గణంబు లనేకంబులు వుట్ట్టె; నది యెల్లనుం గని జనితభయుం డై హరిహయుం డగ్నిసంభవు నభయం బని కొలిచె; నంత నమరులు సంతసిల్లి సింహనాదంబులు సెలంగ షణ్ముఖ శతమఖులం బరివేష్టించి’ రని చెప్పి వెండియు మార్కండేయుం డి ట్లనియె. 220
సీ. అయ్యగ్నిసంభవు నాయతోన్నతబాహు, | నాముక్తకవచుఁ, దేజోమహిష్ఠు,
నాలోహితాంబరు, హారికుండలకర్ణుఁ, | గనకరత్నోజ్జ్వల ఘనకిరీటు,
సంపూర్ణయౌవను, సర్వలక్షణయుక్తుఁ | గని, యనురాగిల్లి కమలనిలయ
సాకార యై వచ్చి యఖిలంబుఁ జూడంగ | సితపద్మహస్త యై యతనిఁ బొందె;
 
ఆ. శ్రీసమేతుఁడై విశేషకాంతిస్ఫూర్తి | నొలసి పూర్ణచంద్రుచెలువు దాల్చి
యున్నవానిఁ జూచి రుత్ఫుల్లలోచన | కుముదు లగుచు మునులు నమరవరులు.
221
వ. అంత షష్ఠదివసంబు సంప్రాప్తం బయ్యె; నందు మహామునులందఱు మహాసేను నతిభక్తిం బూజించి, కృతాంజలులై యిట్లనిరి. 222
ఉ. ‘పుట్టిన యాఱునాళులకుఁ బొంపిరివోయి జగంబు లన్నియున్‌
దట్టుఁడ వై జయించితి ముదంబుగ నీదు మహత్త్వ మెంతయుం
జిట్టలు గాదె! యిట్టి యవిజేయుఁడ వింద్రపదంబు నీక కాఁ
బట్టము గట్టి యేలుము కృపన్‌ మము నెల్లను వహ్నిసంభవా!’
223
వ. అనినం గ్రౌంచారి వారలం జూచి’ యింద్రపదవి నుండువారి కెయ్యది కరణీయం?’ బని యడుగుటయు వా రిట్లనిరి. 224
మ. ‘బలముం దేజము నించి లోకముఁ గృపం బాలించు టర్కేందు భూ
జల తేజః పవనాంబరంబులకు నస్థైర్యంబు గాకుండ ని
శ్చలశక్తిస్థితి నీఁగి శిష్టజనరక్షాదుష్టశిక్షాసమా
కలనం బింద్రపదస్థుఁ డౌ నతనికిం గర్తవ్యముల్‌ షణ్ముఖా!’
225
చ. అనునెడ నింద్రుఁ డిట్లనియె, ‘నట్లయినం గడులెస్స; దేవ! నీ
వనిమిషనాయకత్వమునయం దభిషిక్తుఁడవై ముదంబుతో
ననుఁ బని గొమ్ము నీదు కరుణన్‌ దొసఁ గెల్లను దీఱి యుండెదన్‌;
ఘనతర శౌర్యసారుఁడవు గావున నర్హుఁడ వింద్రలక్ష్మికిన్‌.
226
వ. ఏను దేవేంద్రపదవి నుండ నోడుదు; నెట్లనిన భవదీయ తేజోవిశేషంబులు సూచి విస్మితులై కొందఱు నీకు నింద్రపదవియందు వేడ్కపుట్టునట్లుగా నే మేనింజెప్పి నావలనం గొఱగామి కల్పించి, నీకును నాకును భేదంబు సేయం జూతురు; దానం జేసి నీవు కుపితుండవై నాయెడం గృపదప్పిన నెవ్వారికి వారింప నలవిగాదు; లోకభయంకరంబైన విగ్రహంబు ప్రవర్తిల్లుఁ గావున నవశ్యంబును దివిజరాజ్యంబు నీక యొప్పించితి; మమ్మెల్ల నేలి కొ’ మ్మనినఁ గుమారుండు నవ్వుచు ని ట్లనియె. 227
ఉ. ‘అట్టివి యేల పుట్టు? నమరాధిప! నీవ జగత్ప్రభుండ వై
యిట్టల మైన తేజము వహించి సుఖంబున నుండు; మేను నీ
చుట్టమనై భుజాబలము సొంపున నీ కెలసంబు దీర్చెదం;
జట్టన నన్నుఁ బంపుము భృశంబుగ నెయ్యది కార్య మిత్తఱిన్‌?’
228
చ. అనవుడు సంతసిల్లి యతఁ డాతని కిట్లను ‘నట్టు లైన నీ
పనుపున నేను సత్యహితభాషణ! యింద్రపదంబునందు ని
ల్చి నెగడువాఁడ నైతి; సురసేనల కెల్లను నాయకుండ వై
ఘనభుజ! నీవు సత్కృప జగద్భయమోచన మాచరింపవే!’
229
వ. అనినఁ గుమారుండు మరుత్పతి కిట్లనియె. 230
ఉ. ‘నీకుఁ బ్రియంబుగా భవదనీకినికిం బతి నయ్యెదన్‌ భుజో
త్సేకపటుప్రభావము లజేయములై పెనుపొందఁ బేర్చి ఘో
రాకృతు లైన నీ రిపుల నందఱఁ దున్మెద సర్వలోక ర
క్షాకరణైకవృత్తి నవికల్పుఁడ నయ్యెదఁ; గట్టు పట్టమున్‌’.
231
వ. అనిన నతిప్రీతుం డగుచుఁ బురుహూతుండు సకలసురమునిగణసమేతుండై తత్‌క్షణంబ కుమారునకు నఖిలదేవసేనాధిపత్యంబునం దభిషేకం బొనరించె; మునివరుల జయజయ శబ్దంబులు నమరుల సింహ నాదంబులుం గిన్నర గంధర్వగానంబులు మంగళతూర్యరావంబులు నప్సరో నర్తనంబులుఁ గల్పతరు కుసుమ వర్షంబులు సమకాలప్రవృత్తంబు లయ్యెం; బరార్థ్యభూషణమణిప్రభాలంకృతంబైన కుమారు మౌళిభాగంబున నుజ్జ్వలంబైన ధవళాతపత్రంబు సురగిరిశిఖరోపరిగతం బగు శరచ్చంద్ర బింబంబు ననుకరించు చుండె; నట్టియెడ. 232
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )