పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము
కుమారస్వామి యవతారము (సం. 3-211-17)
క. ఆదిత్యనిభుఁడు విపుల | ద్వాదశబాహుండు షడ్వదనుఁ డఖిలదిశా
రోదోంతరంబు వెలుఁగ మ | హోదారుండై కుమారుఁ డుదయం బయ్యెన్‌.
206
వ. ఇట్లు శుక్లపక్షంబునం బాడ్యమియందు వీర్యనిషేకంబును, విదియయందు గర్భవ్యక్తియుఁ, దదియయందు శరీరమాత్రావిర్భావంబునుం, జతుర్థియందు సకలావయవ సంపూర్ణతయు నై యుదయించిన కుమారుండు పంచమి యందు సముత్థితాకారుండై, పేర్చిత్రిపురదహన సాధనం బైన హరకార్ముకం బమ్మహీధరంబునందు నిక్షిప్తంబై యున్న దానిం బుచ్చుకొని గుణధ్వని సేసిన, నమ్మహాధ్వని విని కలుషించి యైరావత సుప్రతీకంబులను దిగ్గజంబు లయ్యగ్ని భవుమీఁదం బఱతెంచిన నమ్మహాభుజుండా రెంటినిం బెనఁచిపట్టి రెండుచేతుల ధరియించి, తన సహజం బైన శక్తి యొక్క కేలం, గ్రీడార్థ కలితం బైన కుక్కుటం బొక్కకేలను, బరిపూర్యమాణనినదం బైన శంఖంబు గరద్వయంబునం దాల్చి, హస్తయుగళంబున గగనంబు వ్రేయుచుం బాణియుగ్మంబు వక్త్రంబుల నిడికొని బాల్యోచితంబులైన యంగుళి చర్వణంబులు పొరిఁబొరి నొనరించుచు, నిశిత సాయకంబునం గ్రౌంచపర్వత విభేదనంబు సేసి, పటుశక్తిపాతంబున శ్వేతశైలశృంగభంగంబు గావించి చెలంగి యాఱు ముఖంబుల నొక్కపెట్ట యార్చినం, బ్రళయభైరవారావభీషణం బైన తదాఘోషణంబున. 207
మ. కులశైలంబులు గ్రక్కునం గదలె; దిక్కుల్‌ వ్రయ్య లయ్యెన్‌; మహీ
వలయం బంతయు దిర్దిరం దిరిగె; దేవవ్రాతముల్‌ సాధ్వసా
కులతం బొందెఁ; బయోధు లన్నియును సంక్షోభించె; సప్తాశ్వుస
ప్తులు బిట్టుల్కి రథంబు నల్‌దెసలకుం బో నీడ్చె సంభ్రాంతమై.
208
క. ఇట్టిమహోత్పాతంబులు | పుట్టినఁ గని మునులు లోకములకు శుభముగా
నెట్టన శాంతికవిధు ల | ప్పట్టున నొనరించి రాత్మభావనపరులై.
209
వ. ఆ సమయంబునం జైత్రరథ వననివాసు లైన జనులందఱుం గూడి ‘యంగిరః ప్రముఖ మునీంద్రుల భార్యలకు నగ్నిదేవువలనం బుట్టిన బాలుండు లోకంబులకు నిట్టి యనర్థంబు సేయం దొడంగె’ నని యాక్రోశించిన, నయ్యపవాదంబునకు రోసి యా సప్తమునులలోన వసిష్ఠుండు దక్కఁ దక్కిన యార్వురుఁ దమ వనితలం బరిత్యజించిరి; మఱియును గొందఱు జనులు ‘వీ రేమి సేయుదు? రన్నిపోకలం బోయినది వహ్ని భార్యయ కాక’ యని పలుకం జొచ్చి; రంత నమ్మహామునులపాలికిఁ బావకాంగన సనుదెంచి యిట్లనియె. 210
క. ‘వినుఁ డేను వహ్నివలనం | గనిన కుమారుండు వాఁడు; గడు నిజ మిది; మీ
వనితలకుం బని గా; దిటు | సనునే కులసతుల విడువ సత్పురుషులకున్‌?’
211
వ. అని యెంత సెప్పిన వారొడంబడ రైరి; తదనంతరంబ విశ్వామిత్రుండు గుమారు కడ కరిగి యద్దేవు శరణంబు సొచ్చి వివిధ వాక్యంబులం బ్రస్తుతించి, తదాదేశంబున నతనికి జాతకర్మాదివిధు లొనరించిన, నదియంతయు నెఱింగి యమరు లెల్ల నమరేంద్రుం గానఁ జని యిట్లనిరి. 212
ఉ. ‘దారుణశౌర్యధుర్యుఁ డతిదర్పిత చిత్తుఁడు వహ్నిసూనుఁ డ
న్వీరుఁడు నిన్నుఁ గైకొనక వీఁకమెయిం జనుదెంచు నిప్డు దు
ర్వారత నీ పదంబు గొనువాంఛ నవశ్యముఁ; గాన యింతలో
నీరస మెత్తి వాని వధియింపుము చెచ్చెర విక్రమోద్ధతిన్‌.
213
వ. అట్లయిన నీకు నింద్రత్వంబు శాశ్వతం బగు; నేమును బ్రదుకుదుము; లోకంబు లవ్యాకులంబు లగు’ ననినం బురందరుం డప్పుడ సప్తమాతృకలం బిలిచి ‘మీరు సని వహ్నిసంభవుం డైన కుమారు సమయించి, నాకుఁ బ్రియంబు సేయుం’ డని పంచినం, బనిపూని వారు ఘోరంబుగా నతనిపై నడరి తదీయ తేజోవిశేషంబునకు భయంబంది. యతని శరణంబు సొచ్చి, ‘యేము లోకమాతలము; మాయందు నీవు మాతృభావంబు సేయ నర్హుండ’ వనినం గుమారుండు వారి నభినందించి చేకొనియె; నంత నగ్నియు నిజపుత్త్రుపాలికి వచ్చి, యతని చేతంబూజితుం డయి తదీయ రక్షాపరత్వంబున నిలిచె; మాతృగణంబు క్రోధంబునం బుట్టినయది లోహితాస్య యను భామిని కుమారునకు దాదియై యుపలాలనంబు సేయుచుండె; నఖిలభూతగణంబులుం బఱతెంచి క్రౌంచారిం బరివేష్టించె; నది యంతయు విని కలుషించి. 214
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )