పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము
కుమారస్వామి మహిషాసురుం జంపుట (సం. 3-221-29)
క. చనుము శుభంబుల నొందుము | తనూజ!’ యని కౌఁగిలించి తద్దయుఁ బ్రేమం
బున నతని వీడుకొలుపఁగ | ననఘ! మహోత్పాతములు రయంబునఁ బొడమెన్‌.
266
ఆ. దెసలు మండె, ధరణి దిర్దిరఁ దిరిగె, న | భ్రంబు మ్రోసె, వడఁకెఁ బర్వతములు,
జగము ఘోరతిమిర సంవృతమయ్యె, ని | ర్జరులమనము లెల్ల సంభ్రమించె.
267
వ. తదనంతరంబు 268
మ. ఘనశస్త్రాస్త్ర మహోజ్జ్వలంబు చతురంగ వ్యాప్త భూమండలం
బు నితాంతోద్ధత ఘోరఘోష బధిరీభూతాఖిలాశాముఖం
బనిరోధోద్గత వేగ ముగ్ర దనుజేంద్రానీక మేతెంచె నీ
సున నీశానముఖామరప్రతతిపై శుంభద్భుజారంభమై.
269
వ. ఇట్లు మహిషాసుర సంరక్షితం బయిన దానవసైన్యంబు పఱతెంచి చుట్టుముట్టి యసంఖ్యసాయకంబులు గదాఖడ్గ ముసల పరిఘశతఘ్ని ప్రముఖానేక ప్రహరణంబులు ప్రయోగించి, నిమిషమాత్రంబున ననిమిష సైన్యంబునం బ్రచుర మాతంగ తురంగ రథిక పదాతి ప్రకరంబులం బరిమార్చినం గార్చిచ్చు పొదివినం జెదరి పఱచు మృగంబులుం బోలె నమరులు సమరవిముఖులై తొలంగం బాఱినం జూచి నముచిసూదనుండు సింహనాదంబు సేయుచు నెలుంగెత్తి సురగణంబుల కిట్లనియె. 270
చ. ‘వలవదు సంభ్రమంబు, గరువంబుగ నియ్యెడ నెల్లవారు నే
ర్పలవడ వాహనంబులు మహాస్త్రములున్‌ సమకట్టి క్రమ్మఱుం;
డలవునఁ దున్మివైవుఁడు దురాత్ముల దైత్యుల; నేను గల్గఁగాఁ
దలరఁగ నేల మీకు? ధృతిఁ దాల్పుఁడు నిల్వుఁడు గెల్వుఁ డుక్కునన్‌’.
271
ఆ. అనినఁ బోక నిల్చి యాహవోత్సాహులై | సకలవాహనాస్త్రశస్త్రచయము
లలవరించి పేర్చి యార్చి తాఁకిరి వసు | రుద్ర సాధ్యముఖ మరుత్ప్రవరులు.
272
మ. అమరానీక విసృజ్యమాన బహుశస్త్రాస్త్రాహతిన్‌ భిన్నదే
హములై ఘోరమదేభముల్‌ బహులరక్తాంగంబులై తూలెఁ దీ
వ్రమహావాత నిపాత జాత రభస వ్యాధూత సంధ్యారుణా
భ్రములో నా నవశంబులై యొఱలుచుం బ్రత్యర్థి సైన్యంబులన్‌.
273
మ. పురుహూతాగ్రసరప్రభూత బలసంభూతాస్త్ర నిర్ధూత మై
తిరిగెన్‌ బెంపఱి దైత్యవాహినుల నుద్వృత్తాశ్వికశ్రేణి వి
స్ఫురితోత్పాత సమీరవేగ విముఖీభూతాకృతిం దూలు భీ
కరరత్నాకరజాత సంతతతరంగవ్రాతముం బోలుచున్‌.
274
చ. అడరుచు దేవసైన్యవిశిఖాగ్ని శిఖావలి చుట్టుముట్టినం
గడువడి దానవధ్వజినిఁ గల్గు రథప్రకరంబు లన్నియుం
బొడిపొడి యయ్యె నుగ్రతర భూరిదవానల మెల్లదిక్కులం
బొడమిన వంటకట్టియల ప్రోవులు రూపఱుమాడ్కిఁ దోఁపఁగన్‌.
275
శా. గీర్వాణప్రవిముక్తబాణపటలక్రీడావిలూనంబు లై
గర్వోన్మత్తసురారిశీర్షములు వీఁకన్‌ డొల్లెఁ గల్పచ్ఛిదా
నిర్విద్ధాంబుదమండలోద్గత మహానిర్ఘాతపాతావధూ
తోర్వీభృద్ఘనగండశైలములతో నూహింపఁ దుల్యంబులై.
276
వ. ఇట్లు నిహన్యమానంబు లగుచు దైత్యసైన్యంబులు దైన్యంబు నొంది నిలువ నోపక నలుదెసలం జెదరిన నొదరి యందఱి నదల్చి మహిషాసురుం డొక్కమహాశైలంబు వెఱికి యిరుగేల నమర్చికొని యమరులమీఁదం గవిసినం గని, జనితోత్సాహం బైన యసురానీకం బతనిం గూడుకొని భేరీ నిస్సాణ పణవాది తూర్య రవంబులు సింహనాదంబులుఁ జెలంగం గడంగిన, నింద్రాది సురులును బెలుచ సంగరోన్ముఖులై నిలిచిన. 277
క. మహిషుఁడు బల మేర్పడ న | మ్మహిధరమున్‌ వైచె నయ్యమరసైన్యముపై
మహి సంచలింపఁగా దశ | సహస్ర యోధవరు లపుడు సమసిరి దానన్‌.
278
ఉ. అంతయుఁ జూచి యెంతయు భయంబున నింద్రునిఁదొట్టి నిర్జరుల్‌
భ్రాంతమనస్కులై తిరుగఁబడ్డ మదాంచితఘోరమూర్తి యై
యంతకశౌర్యుఁ డా దనుజుఁ డంత దిగంతము దూలఁ గిట్టి కా
లాంతకుఁ డైన రుద్రుని రథాగ్రము చెచ్చెరఁ బట్టె నుద్ధతిన్‌.
279
చ. ‘హరుఁ డదె చిక్కె; నింక నసురాధిపుచేఁ దెగు’ నంచుఁ బొంగి భీ
కరముగ దైత్యు లార్వఁగ జగత్త్రితయంబును గంప మొందఁగాఁ
దెరలి మునీశ్వరుల్‌ గరము దీనతఁ బొందఁగ మందహాస భా
సురముఖుఁ డై పురారి నిజసూనుఁ గుమారునిఁ జూచి యిట్లనున్‌.
280
ఉ. ‘చూచితె వీని సాహసము శూరత మద్రథరోధి యయ్యె; ని
న్నీచుఁ గృతాపరాధు నవినీతు గతాయువు మృత్యుదేవికిన్‌
గోచరుఁ జేయు మీవు రణకోవిద!’ నావుడు షణ్ముఖుండు గో
త్రాచలసన్నిభుండు మదనాంతకుమాటకుఁ బొంగి యుక్కునన్‌.
281
ఉ. లోహితరత్నభూషణుఁడు లోహితమాల్యధరుండు విస్ఫుర
ల్లోహితలోచనుండు నవలోహితవస్త్రుఁడు లోహితాస్యుఁ డై
యాహవకేళికిం గడఁగునప్పుడు సూడఁగ నొప్పె లోకని
ర్దాహసమిద్ధ నూతనపతంగుఁడ పోలె రథాధిరూఢుఁ డై.
282
ఉ. ఆతని నుగ్రతేజు నిటలాక్షతనూభవుఁ జూచి నిర్జర
వ్రాతము భీతిఁ బోవిడిచి వారక ధీరత నిల్చె; నంత ని
ర్ధూతవిరోధివైరివధ దోహలియై వడివైచెఁ దీవ్ర ని
ర్ఘాతము తోడఁబుట్టు వనఁగాఁ దగు నుజ్జ్వలశక్తి దైత్యుపైన్‌.
283
క. దారుణకల్పాంతాగ్ని స | మారంభము దోఁప నమ్మహాశక్తి రయం
బారంగ నడరి దివిజేం | ద్రారాతిం బొదివి భస్మితాంగునిఁ జేసెన్‌.
284
వ. ఇవ్విధంబున మహిషాసురుం బరిమార్చి కుమారుండు మఱియు నమ్మహాశక్తిం బునః పునః ప్రయోగంబు గావించుచు ననేకదైత్యదానవ శతసహస్రంబుల వధియించె; నద్దేవుని పారిషదగణంబుం గవిసి యసురులం దునిమి తూఁటాడి తదీయరక్తపాన మాంసఖాదనంబులు సేసి మత్తిల్లి యాడుచుం బాడుచు నతనిఁ గొనియాడుచు విహరించె; నిట్లు వైరులం బొలియించి తిమిరంబు విరియించిన తిమిర వైరియుం బోలె వెలుంగుచున్న కార్తికేయు నజేయుం జేర నరుగుదెంచి దేవేంద్రుం డతనిం గౌఁగిటం జేర్చి యిట్లనియె. 285
చ. ‘కమలభవప్రదత్తవరగర్వితుఁడై మముఁ జీరికిం గొనం
డమితపరాక్రముండు దనుజాధిపుఁ డీతఁడు నీ మహోగ్ర కో
పమను దవాగ్నియందు శలభంబును బోలె నశించె; వీనికిన్‌
సములగువారు వెండియును జచ్చిరి నూర్వురు దైత్యు లీ యనిన్‌.
286
క. లోక త్రయంబు నందును | నీ కీర్తి వెలింగె నమరనికరము నేనున్‌
నీ కింకరులము గుణర | త్నాకర! రక్షింపు మమ్ము ననిశము కృపతోన్‌.’
287
వ. అని పలికె; నప్పుడు పార్వతీసుందరుండు నిజనందనుఁ బునఃపునరాలింగనంబుల నభినందించి, పురందర ప్రముఖులం జూచి, ‘యిక్కుమారునందు నాయం దెట్లట్ల సభక్తికచిత్తులరై వర్తిల్లుం’ డని యాజ్ఞాపించి, యనంతరంబ భద్రవటంబునకుం జనియె; నమరులు ప్రమదంబునం దమ తమ నివాసంబులకుం జని; రి వ్విధంబున. 288
ఉ. ఒక్కదినంబునందు బలియుండు సురారుల నెల్లఁ దున్మి పెం
పెక్కి దయార్ద్రుఁ డై యభయ మిచ్చె జగంబుల కెల్ల షణ్ముఖుం;
డిక్కథ భక్తితో వినిన నెప్పుడుఁ గీర్తన సేసినన్‌ జనుల్‌
నిక్కము సర్వదోషముల నీఁగి భజింతురు భవ్య భద్రముల్‌.
289
వ. అని మార్కండేయుండు సెప్పినఁ బాండవులు సంతుష్టహృదయు లై యమ్మహాత్మునిం బ్రశంసించిరి; వా రివ్విధంబున నభీష్టకథాగోష్ఠిం బ్రవర్తిల్లు నెడఁ గృష్ణవల్లభ యైన సత్యభామయుఁ బాంచాలియు నేకతంబ యొక్క యెడఁ బ్రియసల్లాపసంసక్తలై యుండి; రప్పుడు సత్యభామ ద్రౌపది కి ట్లనియె. 290
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )