పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము
సత్యా ద్రౌపదీ సంవాదము (సం. 3-222-1)
సీ. ‘నీ ప్రియభర్తల నిర్మలచరితులఁ | బ్రకటతేజుల లోకపాలనిభులఁ
బార్థుల నీ వొకభంగిన వదలక | చెలువ! యెబ్భంగి భజింతు దగిలి?
యొక్క రొక్కనికంటె నువిద! నీ కేవురు | ననురక్తు లగుట యత్యద్భుతంబు;
నగుమొగంబుల కాని నలినాక్షి! నీ దెసఁ | బతులకుఁ గింకిరిపాటు లేదు;
 
తే. వ్రతము పెంపొ? మంత్రౌషధ వైభవంబొ? | సరస నైపథ్యకర్మ కౌశలమొ? చతుర
విభ్రమోల్లాస రేఖయొ? వెలఁది! నీ వి | శేష సౌభాగ్య హేతువు సెపుమ నాకు.
291
క. ఏనును నీవలన నిజము | గా నిది యంతయును నెఱిఁగి కమలదళాక్షుం
బూని వశగతునిఁ జేసి య | నూనస్నేహానుభోగయుక్తిఁ దలిర్తున్‌.’
292
క. అని యడిగిన మది నించుక | గినుక వొడమ నడఁచుకొనుచుఁ గృష్ణ మృదులహా
సిని యగుచుఁ గృష్ణభామినిఁ | గనుఁగొని యి ట్లనియె నిర్వికారాకృతియై.
293
క. ‘నను నిట్లు దుష్టవనితా | జనమునటులుగాఁ దలంపఁ జనునే నీకున్‌?
మన సొప్పదు పురుషోత్తము | వనితవుగాఁ దగవు నీవు వనరుహనయనా!’
294
వ. అని మేలంపుఁ జందంబున దాని వివేకవిహీనత యెఱుక పడ నాడి, పాంచాలి మఱియు ని ట్లనియె. 295
చ. ‘అలయక మంత్ర తంత్ర వివిధౌషధ భంగులఁ జేసి యెంతయున్‌
వలతురు నాథు లంట మగువా! కడుబేలతనంబు; దాన మున్‌
గలిగిన ప్రేమయుం బొలియుఁ గాని యొకండును సిద్ధిఁబొంద; ద
ప్పొలఁతుక తోడి మన్కి యహిపొత్తుగఁ జూచు విభుం డెఱింగినన్‌.
296
చ. మగువ యొనర్చు వశ్యవిధి మందులు మాఁకులు నొండుచందమై
మగనికిఁ దెచ్చు రోగములు, మానక మూకజడాదిభావముల్‌
మొగి నొనరించు, నద్దురితముల్‌ దన చేసిన చేఁత లై తుదిన్‌
జగమున కెక్కి నిందయును సద్గతిహానియు వచ్చు నింతికిన్‌.
297
క. కావునఁ బతులకు నెప్పుడుఁ | గావింపం దగదు కపటకర్మంబులు; ద
ద్భావ మెఱిఁగి యనువర్తిని | యై వనిత చరింప, నదియ యగు నెల్లవియున్‌.
298
వ. పాండవులయెడ నే నెట్టిదాన నై యిట్టిసౌభాగ్యంబు నందితి; నది నీకు నెఱింగించెద నేర్పడ వినుము. 299
సీ. పతు లాత్మ నొండొక్క పడఁతులఁ | గలసిన నలుగ, నెయ్యెడల నహంకరింప;
మదముఁ బ్రమాదంబు మాని వారికిఁ జిత్త | మేకముఖంబుగ నెల్లప్రొద్దు
భక్తి సేయుదుఁ; జూపుఁ బలుకును గోర్కియుఁ | జెయ్వులు వింతగాఁ జేయ నెపుడు;
నమర గంధర్వ యక్షాదులం దైనను | బురుషు నన్యునిఁ దృణంబుగఁ దలంతు;
 
తే. స్నాన భోజన శయనాది సంప్రయోగ | మర్థిఁ బతులకు మున్నెందు నాచరింపఁ;
బతులు వచ్చిన నాసన పాద్య విధుల | భక్తితో నేన కావింతుఁ బనుప నొరుల.
300
చ. తగియెడు వేళలందు నియతంబుగ మజ్జన భోజన క్రియల్‌
దగ నొడఁగూర్తు భర్తలకు; ధాన్యధనంబులు రిత్తమై వ్యయం
బగుటకు నోర్వ నెప్పుడు, గృహస్థలభాండ విశోధనంబు లి
మ్ముగ నొకనాఁడు నేమఱఁ, బ్రమోదము సల్పుదు బంధుకోటికిన్‌.
301
క. పలుమాఱుం దలవాకిట | మెలఁగుట, యసతీజనైకమిత్రత, కలహం
బుల కెలయుట, నగుపలుకులఁ | బెలుచ నగుట నాకుఁ గానిపేరివి మగువా!
302
క. పతు లిచ్చమెయిఁ బ్రవాస | స్థితులైనం బుష్పగంధ దీప్తాభరణ
ప్రతతి ధరియింపఁ దద్గత | మతి నగుచుఁ దదాగమంబ మదిఁ గాంక్షింతున్‌.
303
ఉ. అత్తకు భక్తి గల్గి మది నాయమ సెప్పిన మాడ్కి జీవికా
వృత్తము లావహింతు; గురువిప్రజనాతిథి పూజనంబు ల
త్యుత్తమభక్తి నేన తగ నోపి యొనర్తుఁ; బ్రియంబుఁ దాల్మియున్‌
మెత్తఁదనంబు సన్మతియు మేలుగఁ దాల్తు సమస్తభంగులన్‌.
304
క. కడు మృదువు లనుచుఁ దేఁకువ | సెడి యెపుడుఁ జరింప భరతసింహులు గోపం
బడరిన నాశీవిషముల | వడువునఁ గ్రూరు లని వెఱపు వదలక కొల్తున్‌.
305
సీ. మాయత్తఁ బృథ్వీసమానఁ బృథాదేవిఁ | గుంతిభోజాత్మజఁ గోమలాంగి
సతతంబు భోజనస్నానాదికములయం | దిమ్ముగఁ బరిచర్య యేన చేసి
సంప్రీతఁ జేయుదు; జనవంద్యుఁ డగు ధర్మ | తనయునిబంతి నిత్యంబుఁ బసిఁడి
పళ్ళెరంబులఁ గుడ్చు బ్రాహ్మణు లతిపుణ్యు | లెనిమిదివేలు సమిద్ధమతులు
 
తే. యతులు పదివేలు; వారల కనుదినంబు | నన్నపానంబు లర్హసహాయ నగుచు
నొడికముగ నేన కావింతు నుచిత వస్త్ర | భూషణాదులఁ బరితోషముగ నొనర్తు.
306
వ. మఱియు ధర్మరాజునగరియందుఁ గనకమణిమయ భూషణాలంకృతు లయిన పరిచారకులు నూఱువేలు రేయును బగలును బాత్రహస్తులై యభ్యాగత భోజనంబు లొడఁగూర్చువారు నందఱ గలరు; వీ రెల్ల నిట్టిట్టిమెలఁకువ మెలంగుదు రని తత్కృతాకృతంబు లేన యెఱుంగుదు; నిరంతర మదధారా తరంగిత కపోలంబు లయిన భద్రగజశతసహస్రంబులుఁ బ్రభూతజవసత్త్వసన్నుతంబు లయిన యుత్తమాశ్వ శతసహస్రంబులుం గలవు; వానికి నన్నింటికి నిత్యోచితంబు లయిన ఖాద్యంబు లొనరింపను బాలింపను దగినవారి నేన నియమింతు; నఖండభాండాగారపూరితంబు లయిన యగణ్యమణి కనకాదివస్తువులను బ్రతిదినవిహితంబు లయిన యాయ వ్యయంబులు నా యెఱుంగని యవియు లేవు; గోపాల జనంబులు దుదిగాఁ గల సకల భృత్య జనంబుల జీవితంబుల నరసి యేన నడపుదుం; బరమయశోధను లగు పాండునందనులు నిజకుటుంబభారంబు సర్వంబు నాయంద సమర్పించి తారు నిర్భరులై యిష్టవిహారంబుల నుండుదు; రే నెల్ల వెంటల నప్రమత్త నై వర్తింతు. 307
ఆ. వేగ జాము గలుగ వెడనిద్రఁ బొందుదుఁ | గాని రాజ్యభారకార్యయుక్తి
నబ్జనయన! నాకు నాహార నిద్రల | కెడయు లేదు సువ్వె యెల్లప్రొద్దు.
308
ఆ. ఇట్టి వర్తనముల నెపుడుఁ బాండవులకుఁ | దగిలి ప్రియము సేయఁ దగితిఁ గాని
మగువ! నీవు సెప్పు మందులు మాఁకులు | నింద్రజాలములును నే నెఱుంగ.’
309
వ. అనిన విని లజ్జాకలితచిత్త యగుచు సత్యభామ పాండవభామిని కిట్లనియె. 310
క. ‘ఏ నెఱుఁగమి ని ట్లడిగితి; | నా నేరమి సైఁప వలయు; నగవుగఁ గొనుమీ
మానిని! నా పలుకులు; స | న్మానితము భవచ్చరిత్రమహిమ ధరిత్రిన్‌.’
311
వ. అనినం బాంచాలి మందస్మితానన యగుచు ‘నది యట్ల కాక’ యని పలికి మఱియు నిట్లనియె. 312
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )