పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము
కర్ణ శకుని దుర్యోధనులు మంతనంబు సేయుట (సం. 3-226-9)
ఉ. జానపదుల్‌ పురీజనులు సంతతముం బ్రమదం బెలర్ప నీ
దైన శుభోదయంబ హృదయంబులఁ గోరుచునున్నవారు; స
మ్మానము నొంది కౌరవసమాజము నిన్ను భజింప భూరితే
జోనిధి వై వెలింగెదవు సూర్యుని చాడ్పున నీవ యిమ్మహిన్‌.
346
వ. పాండవు లిప్పుడు పరమదుఃఖార్తు లగుచు ద్వైతవన సరోవర సమీపంబున నున్నవా రని వింటిమి; నీవు సకల సామ్రాజ్యవిభవంబు మెఱసి చని, యందు నీ తేజంబు ఘర్మసమయంబునాఁటి తపనుతేజంబై పగతుర కన్నులు గమర, నతిదుస్సహం బగు నట్లుగాఁజేయుము; దొల్లి నహుషపుత్త్రుం డయిన యయాతియుం బోలె నుజ్జ్వలుండ వై యున్న నిన్నుం జూచి, పాండవులు హృదయఖేదంబుగా వగచెదరు; మిత్రజన మోదంబును శత్రుజన ఖేదంబునుం గదా సంపదలకుం దగియెడు ఫలంబు. 347
క. ధన ధాన్య పుత్త్ర బాంధవ | జనలాభంబులును దలఁప సరిగావు సుఖం
బునఁ దాను దనరి శత్రులు | ఘనతర దుఃఖముల నుండఁ గని యలరుటకున్‌.
348
ఉ. నారలు గట్టి కూర లశనంబుగ నుగ్రవనంబులో విప
ద్భారము నొంది వందురిన ఫల్గును నుజ్జ్వలరాజ్యవైభవో
దారులమై కనుంగొని ముదంబునఁ బొందఁగఁ గాంచుకంటె నిం
పారఁగ నొండు గల్గునె కృతార్థత యెందును గౌరవేశ్వరా!
349
తే. అతుల సౌభాగ్య పుణ్య సమగ్ర గరిమ | నొప్పుచున్న నీ దేవుల యొప్పు సూచి
ధృతి దఱిఁగి తన్నుఁ దాన నిందించు కొనుచు | హృదయమునఁ బాండవాంగన యెరియ వలదె!’
350
వ. అనిన నిది వోలు నని నాగకేతనుండు సంప్రీతుం డై కొండొక విచారించి, రాధేయుం జూచి యిట్లనియె. 351
క. ‘నా తలఁపును నిట్టిది; నీ | వేతెఱఁ గెఱిఁగించి తది యభీష్టము; మన మా
ద్వైతవనంబున కరుగుట | భూతలపతి యనుమతింపఁ బోలదు మదిలోన్‌.
352
తే. అందుఁ బాండవు లుండుట యాంబికేయుఁ | డెఱుఁగు; మన మవ్వనంబున కేఁగుటయును
గడఁగి పార్థులతోడి విగ్రహము కొఱక | యని యవశ్యంబు వారించు నతఁడు మనల.
353
వ. అదియునుం గాక. 354
చ. ఉరుతరవిక్రమాఢ్యు లనియున్‌ మహనీయతపోవిశేష సు
స్థిరు లనియుం బృథాసుతుల దిక్కునఁ దద్దయు భీతుఁ డై నిరం
తరమును మానవేంద్రుఁ డెదఁ దాపము నొందుచునుండు; వింటె? యి
క్కురువిభుఁ డింతసేపు గడుఁ గూర్చి విలాపము సేసె వారికిన్‌.
355
వ. అతనియొద్ద నుండి విదురుండును వారిన పెట్టుచోటు గానక పొగడుచుండు; జూదంబు నాఁట నుండియు విదురుండు పాండవపక్షపాతి యగుట దెల్లం బయ్యె; మన విచారించిన యిక్కార్యంబు చిన్నసన్న యెఱింగె నేనియు నాతం డెల్లభంగుల విఘ్నంబు సేయుం గావున నిది యంతయు రహస్యంబుగా నొనరించుకొని, ధృతరాష్ట్రుండు దీని కనుమతించు తెఱం గెయ్యది యట్టి యుపాయంబు నీవును శకునియు నూహించు నది; మనము రేపకడ వచ్చి కురుపితామహుం డైన భీష్మునిఁ గురువంశోత్తముం డయిన ధృతరాష్ట్రుని నొడంబఱిచి, వెడలుద’ మని వారి వీడ్కొలిపి దుర్యోధనుం డభ్యంతరగృహంబున కరిగి, యా రాత్రి సముచిత ప్రకారంబునఁ గడపెఁ; బ్రభాతం బగుటయుఁ గర్ణుండు దుర్యోధనుకడకుం జని యిట్లనియె. 356
ఉ. ‘భూతలనాథ! యే నొకటి పోల నుపాయము గంటి; నిప్పు డా
ద్వైతవనంబునందు విదితంబుగ నున్నవి గో కదంబముల్‌;
ప్రీతిగఁ దద్విలోకనము పేరఁ జనం దగు; ధారుణీశ్వరుం
డీతెఱఁ గైనఁ బొమ్మను; నభీష్టముఁ జేకుఱు నెల్లభంగులన్‌’.
357
క. నా విని సుబల తనూజుఁడు | ‘దేవా! నీ యాన, యేను దెల్లంబుగ రే
యీ వెఱవె నెమ్మనమ్మున | భావించితి’ ననియె; నంతఁ బ్రహసితముఖులై.
358
వ. ఒండొరుల చెయి సఱచి నవ్వుచు నమ్మువ్వురుం దత్‌క్షణంబ సమంగ నామధేయుం డయిన గోపాలకు నొక్కనిం గఱపికొని ధృతరాష్ట్రుపాలికిం దోడ్కొని సముచిత ప్రసంగ సేవా విశేషంబుల నమ్మహీవిభు సుముఖుం జేసి యనంతరంబ ‘దేవా! ద్వైతవనంబు నందుల కీలారంబుననుండి వీఁడె యొక్క గోపకుండు వచ్చె’ ననిన, నతండును వాని కభిముఖుండై పసుల సేమం బడుగుటయు వాఁ డిట్లనియె. 359
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )