| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము |
| క. |
‘నా చేసిన కీడునఁ గడు | నీచుం డగు నా తనూజునేరమి నిమ్మై నోచెల్ల పార్థులకుఁ బు | ణ్యాచారుల కెందు లేని యాపద వచ్చెన్. |
327 |
| క. |
నా పెద్దకొడుకు ధర్మజుఁ | గాపురుషవిదూరు ధీరుఁ గౌరవకుల సం దీపకు నివ్విధమున సం | తాపితుఁగాఁ జేసెనే విధాతృఁ డదయుఁడై. |
328 |
| చ. |
అమలనివాతసౌధములయందు మనోజ్ఞమరాళతూల త ల్పముల శయించి రేపులు శుభస్థితి మాగధసూతగీతనా దములఁ బ్రబోధముం బొరయు ధర్మసుతుండు కఠోరభూమిభా గమున శయించి మేల్కను సృగాలనినాదవికీర్ణకర్ణుఁడై. |
329 |
| క. |
నాగాయుతసత్త్వుఁడు ది | ఙ్నాగాయతహస్తుఁ డనిలనందనుఁడు మహో ద్వేగాత్ముఁ డగుచు డస్సిన | నాగము క్రియ నుండకున్నె నవసి వనమునన్. |
330 |
| ఉ. |
అన్నలుఁ దమ్ములున్ సతియు నార్తిమెయిన్ బహుదుఃఖమగ్నులై యున్నతెఱంగు సూచి విజయుండు యుధిష్ఠిరవాక్యబద్ధుఁ డై సన్నుతుఁ డుగ్రపన్నగము చాడ్పున రోఁజుచుఁ గ్రోధశోక వే గోన్నతి నాత్మ నేమనుచునుండునొ నా సుతుతప్పు లెన్నుచున్. |
331 |
| క. |
అక్కట! మృదుగాత్రులు గడుఁ | జిక్కని మనసులు గుమారసింహులు గవ లిం పెక్కిన సుఖముల కర్హులు; | స్రుక్కి నవయ నోర్చియునికి చోద్యం బరయన్’ |
332 |
| వ. | అని పలికి, వెండియు. | 333 |
| చ. |
‘అనుపమతేజుఁ డున్నతభుజాగ్రుఁ డుదగ్రుఁడు వైరినిగ్రహుం డనఘుఁడు వాయుసూనుఁడు నిజాగ్రజు చేసిన సత్యపాశబం ధనమునఁ జిక్కి తత్సమయతత్పరుఁడై యిటు ఘోరదుఃఖ వే దనములు సైఁచెఁ గాక మది తద్దయుఁ గ్రోధమయంబు వానికిన్. |
334 |
| సీ. |
శకుని కైతవము, దుశ్శాసను చేసిన | దుష్కర్మమును, గర్ణు తులువతనము దుర్యోధనుని దైన దుర్ణయంబును, జిత్త | మునఁ గిరిశల్యముల్ వోలె నలఁప దావాగ్ని తెఱఁగున దరికొని క్రోధంబు | వనవాస మనియెడు వాయుగతుల నంతకంతకుఁ బేర్చి యవయవంబుల నెల్ల | మండంగ నెప్పుడు మధ్యముండు |
|
| ఆ. |
మొగము జేవురింప ముడివడు బొమలతో | నవుడు గఱచుచును భయంకరముగ నున్నరూపు వాయకుండు నామది వాఁడ | మిత్తి నాదు పుత్త్రమిత్రతతికి. |
335 |
| క. |
అంతకసుతు హృదయంబున | నంత గలుగ నేర దలుక, యర్జును మదిలో నంత గలుగ; దమ్మారుతి | యంతకనిభుఁ డధికరోషుఁ డనవరతంబున్. |
336 |
| తే. |
అర్జునానిలప్రేరితం బగుచుఁ బేర్చి, | వాయుతనయ దవాగ్ని దుర్వారభంగిఁ గర్ణసౌబల సహితముగా మదీయ | పుత్త్రశత కాననము వెసఁ బొదువ కున్నె. |
337 |
| క. |
అగుఁగాక కర్మఫలములు; | దగఁ గుడువక పోవ వశమె దైవకృతంబుల్ మగుడునె; కౌరవ్యులకుం | దెగుకాలం బయ్యె; వగపు తెరు విం కేలా? |
338 |
| క. |
ఏను వలదన్న జూదము | మానఁడ, సుతుదుర్ణయంబు మగిడింపక దు ర్మానమునఁ గులక్షయ సం | ధానమునకుఁ దొడఁగితిని విధాతృని చెయిదిన్. |
339 |
| తే. |
రాత్రి తెగుదల దిన మేల రాకయుండు? | దినము తెగుదల రాత్రి యేతేర కున్నె? పరఁగ సుఖదుఃఖములు గాల పర్యయమున | నెందు మనుజులఁ బొందక యేల యుడుగు? |
340 |
| ఉ. |
మేలున సంతసిల్లు నెడ మేకొని యాపద లొందు, నాపదల్ దూలఁగ భూరిసౌఖ్యములు దోఁచుఁ; గృతంబులు తప్ప వెమ్మెయిం; బోలఁగ నింతయుం గని ప్రబుద్ధమనస్కులు ఖేదమోదని ర్గాళితధైర్యసాగరులు గాక సుఖింతురు సర్వకాలమున్. |
341 |
| చ. |
సిరికిఁ దొలంగి కానల వసించి కృశించిన పార్థుఁ డట్టె ని ర్జరుల వరంబునం బరమ సమ్మద లీల మహాస్త్ర లాభ వి స్ఫురణముఁ బొంది యద్దివికిఁ బోయి శరీరముతోన క్రమ్మఱన్ ధరణికి వచ్చె; నిట్టివి గదా! వివిధాద్భుత కర్మపాకముల్. |
342 |
| క. |
గాండీవము విల్లటె, యా | ఖండల నందనుఁడు విల్లు గలవాఁడటె, త త్కాండంబులు దివ్యము లటె, | యొండేటికి వారిధనమ యుర్వియు సిరియున్.’ |
343 |
| వ. | అని ధృతరాష్ట్రుండు బహువిధంబు లగు వలుకులు వలుక విని, దుర్యోధనుండు శకునిం జూచి ‘యీ రా జేల యింత భీతుం డయ్యె?’ ననుచు నతండునుం దానును గర్ణసహితుండై యొక్క వివిక్తప్రదేశంబునకుం జని కార్యాలోచనంబున నున్న యెడం గర్ణుం డి ట్లనియె. | 344 |
| సీ. |
‘పాలితశౌర్యులు పాండవేయులు దుఃఖ | శీలురై యడవులపాలు వడిరి; ధరణీశ! తొల్లి యింద్ర ప్రస్థపురమున | ధర్మనందను పాలఁ బేర్మితోడ శోభిల్లుచున్న విశ్రుతలక్ష్మి నీ బుద్ధి | బలమున నిన్నుఁ బెంపొలయఁ బొందెఁ; బరువడి దక్షిణ పశ్చిమోత్తర పూర్వ | దేశస్థులయిన మహీశులెల్ల |
|
| తే. |
నీక యరిగాపులై; రిప్డు నిఖిలజలధి | శైలకాననద్వీపవిశాల మైన మహి సమస్తంబు నేలుము మహిమ యెసఁగ | లీల నింద్రుండు సురలోక మేలు నట్లు. |
345 |