| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము |
| క. |
కని గంధర్వులు గ్రమ్మఱి | ఘనులం బాండవుల నగ్నికల్పులఁ దేజో ధనుల నమరేంద్రసదృశుల | ననఘుల మార్కొనిరి ప్రకటితాటోపమునన్. |
415 |
| ఉ. |
అగ్రజువాక్యముల్ దలఁచి యర్జునుఁ డప్పుడు వారితోడ న త్యుగ్రత దక్కి యెంతయుఁ బ్రియోక్తుల నిట్లను ‘మీకు మాయెడన్ విగ్రహ మేల? నెయ్యమున విడ్వుఁడు కౌరవరాజుఁ; బార్థివ ప్రాగ్రసరుండు ధర్మసుతు ప న్పిది; మీకు నలంఘ్య మిత్తఱిన్.’ |
416 |
| వ. | అనిన నతనికి గంధర్వు లిట్లనిరి. | 417 |
| తే. |
‘ధర్మజుఁడు మాకుఁ బ్రభుఁడె? యా ధర్మతనయు | నాజ్ఞ నే మేల యొనరింతు? మనిమిషేంద్రుఁ డొక్కరుఁడ మమ్ము శాసింప నొడయఁ; డన్యు | లెందు నెవ్వరైనను భయ మేమి మాకు?’ |
418 |
| వ. | అనిన వివ్వచ్చుం డవ్వియచ్చరుల నుపలక్షించి, ‘మునుమున్న తెగువకుం జొర నేల? యని ప్రియంబును ధర్మంబునుంగాఁ బలికితి; నెట్లును మీరు సామసాధ్యులరు గాకునికి దోఁచుచున్నయది గావున నుగ్రంబయిన విగ్రహంబున దుర్యోధను విడిపింతు’ నని వారలమీఁద నిశితవిశిఖప్రకరంబులు ప్రయోగించె; నా గంధర్వులు నతనిపైఁ బటుబాణవర్షంబులు గురిసి; రి ట్లా నలువురకు ననేకగంధర్వశతసహస్రంబులతో నతిఘోరసమరం బయ్యె; నందు. | 419 |
| తరలము |
కదిసి యర్జునుతేరు భగ్నముగా నొనర్పఁ దలంచి పె ల్లొదవి ఖేచరకోటి గ్రమ్ముటయుం బురందర నందనుం డదయుఁడై పదిలక్షలం బ్రళయాగ్నికల్పుల దివ్యులం గదనశూరుల నిర్దహించెఁ బ్రకాండదివ్యశరార్చులన్. |
420 |
| మహాస్రగ్ధర |
ఘనకోదండోగ్రమౌర్వీ | క్వణ మఖిలనభో | గహ్వరాభోగభాగం బున నాపూర్ణంబుగా ను | బ్బునఁ గవలు మరు | త్పుత్త్రుడుం దీవ్రనారా చ నితాంతాపాతలీలా | సరభసగతులై | శత్రువీరవ్రజంబుం దునుమం దచ్ఛోణితంబుల్ | దొరిఁగి మడువులై | తొట్టె నయ్యుద్ధభూమిన్. |
421 |
| వ. | ఇట్లు కౌంతేయులచేతం బీడితులై గంధర్వులు దుర్యోధనాదుల చెఱ లేమఱక గొనుచు గగనంబునకు నెగసి త్రోచిపోవ నుంకించిన నెఱింగి సవ్యసాచి రయంబున నతినిబిడబాణజాలంబులం జేసి దిఙ్న భోమార్గంబులు నీ రంధ్రంబులుగాఁ గప్పిన నగ్గగనచరులు వలలోనం జిక్కిన పులుఁగులుం బోలెఁ బోవ నేరక శరపంజరంబునం జిక్కియు నుక్కుసెడక యన్నలువురమీఁద వివిధాయుధప్రకరంబులు ప్రయోగించిన. | 422 |
| మ. |
అవి యెల్లం దునుమాడి క్రీడి ఘనరోషాభీలుఁడై శాతభ ల్లవితానం బడరించినం దలలు డొల్లం గాయముల్ మింట నుం డి వడిం గుంభినిఁ గూలఁగా రుధిరవృష్టిం గాలువల్ వాఱఁగా దివి గంధర్వుల క్రం దడంగె జగ ముద్వేగంబునం బొందఁగన్. |
423 |
| వ. | మఱియును నర్జునప్రయుక్తం బైన ఆగ్నేయాస్త్రంబు దావాగ్ని నీరసవిపినంబు దహించు తెఱంగున గంధర్వ నివహంబు నీఱు సేయం దొడంగినం గినిసి చిత్రసేనుండు భీమసేనానుజుమీఁదం బటు గదాదండంబు వైచిన నతండు దాని నేడు తునియలుగా సేయుటయు, గంధర్వరాజు మాయాబలంబున నంతర్హితుం డై. | 424 |
| క. |
నలువురు పార్థుల నత్యు | జ్జ్వల శరవర్షముల ముంచి జలధరముక్రియం బెలుచన గర్జిల్లుచు మొ | క్కలుఁడయి తన విక్రమంబుఁ గడఁకయుఁ జూపెన్. |
425 |
| ఆ. |
దాని నుఱక యింద్రసూనుండు గాండీవి | శబ్దభేదు లయిన సాయకములఁ జిత్రసేను సర్వగాత్రంబు భేదించి | యొక్క మాత్రలోన నుడిపెఁ గడఁక. |
426 |
| వ. | ఇట్లు నొచ్చి గంధర్వనాయకుండు రణసంరంభంబు విడిచి యర్జునుంజేరంజని తనపొడ సూపి నిలిచిన, నవ్వీరుండును నాత్మసఖుం డయిన ఖేచరపతి తెఱంగు సూచి సంహృతాస్త్రుం డయ్యె; వృకోదరాదులును సమరవిరామంబు నొందిరి; వారలందఱుఁ దమ తమ రథంబుల మీఁదన యుండి యెండొరులఁ గుశలంబు లడిగి; రప్పు డర్జునుండు చిత్రసేనున కి ట్లనియె. | 427 |
| క. |
‘వీరోత్తమ! నీ కిమ్మెయి | వైరము దగునయ్య? కౌరవప్రకరముతోఁ గౌరవపతి విడువుము త | ద్దారానుజసుత సమన్వితంబుగ నెమ్మిన్.’ |
428 |
| వ. | అనిన నతం డర్జునున కిట్లనియె. | 429 |
| సీ. |
‘ఈ దురాత్ముఁడు మిమ్ము నివ్వనంబున నితాం | తాయాసపీడితు లైనవారిఁ బరమధర్మాత్ముల భార్యాసమేతుల | నపహసింపఁ దలంచి యరుగుదెంచె; నింతయు నెఱిఁగి సురేంద్రుండు గలుషించి | యనుజవధూసహాయాన్వితముగఁ బాపవర్తను వీనిఁ బట్టి తెమ్మని నన్నుఁ | బనిచిన వచ్చితిఁ బార్థ! వినవె; |
|
| తే. |
శక్రుపాలికి నిదె కొని చనుచునున్న | వాఁడ; నీ వింక నొం డన వలదు వినుము! మత్సఖుండవు గావున మత్సరంబు | నలుకయును లేదు నీదెస ననఘ! నాకు’. |
430 |
| తే. |
అనిన నర్జునుఁ డతని కిట్లనియె ‘నీ సు | యోధనుఁడు మాకు వినుము సహోదరుండు గాన యీతని విడుచుట కర్జ; మిదియ | ధర్మజున కెంతయును ప్రమోదంబు సేఁత. |
431 |
| చ. |
అమరవరేణ్యు పన్పయిన, నావల యెయ్యది యైన, నిప్డు ధ ర్మమహితుఁడైన ధర్మజుసమక్షమునం దెఱిఁగించి, యాతఁ డే క్రమమున నెద్ది సెప్పె నది గైకొని చేయుము; నీవు మత్ప్రియా ర్థము చనుదెమ్ము’ నావుడును దాని కొడంబడి చిత్రసేనుఁడున్. |
432 |