పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము
చిత్రసేనుఁడు ధర్మరాజునొద్దకు వచ్చి దుర్యోధను విడిచిపెట్టి పోవుట (సం. 3-235-11)
వ. వారలుం దాను ధర్మజుకడకుం జనిన, నయ్యజాతశత్రుండు చిత్రసేను నతిప్రియంబునం బూజించి, ‘మహాత్మా! యీ సుయోధనుండు సానుజామాత్యుం డయి మీచేత వధియింపం బడకునికి మేలయ్యె; మీ కారణంబున మా వంశంబునకు కొండొకహాని వొంద దయ్యె; వీఁ డెట్టి యపరాధంబు సేసినను, నదియంతయు సహించి మాకుంగా వీని విడువవలయు’ నని ప్రార్థించిన, నతం ‘డట్ల కాక’ యని దుర్యోధనాదుల నందఱ విడిచి పాండుపుత్త్రుల నామంత్రణంబు సేసి, దివంబున కరిగి తత్ప్రకారంబు సకలంబును నింద్రునకు నివేదించిన, నింద్రుండును సమరనిహతు లయిన గంధర్వుల నమృతవృష్టిం జేసి బ్రదికించె; నిట యుధిష్ఠిరుండును ధార్త రాష్ట్రునకు బంధమోక్షణంబు గావించి వాని కిట్లనియె. 433
ఉ. ‘ఎన్నఁడు నిట్టి సాహసము లింక నొనర్పకు మయ్య! దుర్జనుం
డన్నున సాహసక్రియలయందుఁ గడంగి నశించుఁ; గావునం
గ్రన్నన తమ్ములన్‌ దొరలఁ గైకొని యిమ్ములఁ బొమ్ము వీటికిన్‌;
సన్నుత! దీని కొండొకవిషాదముఁ బొందకుమీ మనంబునన్‌.’
434
వ. అని బుద్ధి సెప్పి వీడ్కొలిపిన, నతండును దీనాననుం డగుచుం జనియె; ననుజసహితుండయిన ధర్మతనయు ధార్మికత్వంబు ధౌమ్యాది భూసురులును దదాశ్రమవాసు లయిన మహామునులును బహువిధంబులఁబ్రస్తుతించి రని వైశంపాయనవర్ణితం బయిన కథావిశేషంబు సవిస్తరంబుగా. 435
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )