| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - షష్ఠాశ్వాసము |
| వ. | వారిచేత ననుజ్ఞాతుం డయి నగరసమీపంబున నొక్క పుణ్యస్థలంబునం దఖిలయజ్ఞగృహంబులు నతిరమణీయంబులుగాఁజేయించి యజ్ఞోపకరణంబులును సమస్తవస్తువిశేషంబులును సమకట్ట నియోగించి శుభదినంబునం బరమబ్రాహ్మణసహాయుం డై నియతదీక్షాశోభనంబు వహించె నంత. | 76 |
| ఆ. |
అఖిలదేశవాసు లైన రాజులను బ | విత్రచరితు లైన విప్రవరుల నర్థిఁ బిలువ దూత లరిగిరి కౌరవే | శ్వరుని యాజ్ఞఁజేసి సమ్మదమున. |
77 |
| వ. | అందొక్క దూతం బిలిచి దుశ్శాసనుండు ‘నీవు ద్వైతవనంబునకుం జని పాండవులను దదాశ్రమవాసు లైన భూసురులను గౌరవేశ్వరు నధ్వరంబునకుఁబిలువు’ మని పనిచిన, వాఁడునుంజని ధర్మరాజుం గని యిట్లనియె. | 78 |
| ఉ. |
‘వీరుఁడు గౌరవుండు నిజవిక్రమలబ్ధ సమున్నతార్థ సం భారములన్ మహాధ్వర మపారబలుం డొనరించుచుండి పెం పారఁగ నిన్నుఁ దమ్ముల మహాద్విజులం బిలువంగఁ బంచె ధా త్రీరమణేశ! నెమ్మిఁ జనుదెమ్ము తదధ్వరముం గనుంగొనన్.’ |
79 |
| వ. | అనిన ధర్మజుండు వాని కిట్లనియె. | 80 |
| చ. |
‘అనఘుఁడు ధార్తరాష్ట్రుఁడు మహాధ్వరకర్మధురీణుఁ డయ్యె నా విని ప్రియమందెఁ జిత్తము; పవిత్రిత మయ్యెఁ గులంబు; వింటె! యై నను దగ మేము పూనిన ఘనంబగు పూనికి దీర్ప కెవ్విధం బున నట రా నొడంబడము? భూవరుతో నిది సెప్పు మేర్పడన్.’ |
81 |
| వ. | అనియె; నప్పుడు భీమసేనుం డాదూతం జూచి, ‘యోరి! వినుము! పదుమూఁడగునేఁటి కడపటఁ బాండవాగ్రజుండు దీప్తం బగుశస్త్రాస్త్రదహనంబునందు ధార్తరాష్ట్రసుతశతకంబును బశువరించివేల్చి రణసత్త్రంబు సేయుటకునై వచ్చుం గాని యందాఁకం జనుదెంచుట గలుగ దని యాదుర్యోధను నెదురన వాయోడక చెప్పు’ మనిన, వాఁడును మగిడి చని ధర్మనందను ప్రియవచనంబులను వృకోదరు నిష్ఠురోక్తులను ధార్తరాష్ట్రుల కెఱింగించెఁ; దదనంతరంబ. | 82 |
| క. |
చనుదెంచిరి కౌరవశా | సనమున ధరణిఁ గల నిఖిల జనపతులును స న్మునులును సమస్తజనులును | ఘనభుజుజన్నంబుఁ జూడఁ గరిపురమునకున్. |
83 |
| వ. | వారి కెల్లను దగిన సత్కారంబులు సేయను బాత్రదానంబులు గావింపను ధృతరాష్ట్రుండు విదురుం బనిచె; నివ్విధంబునఁ బ్రసిద్ధ దక్షిణాన్వితంబై ప్రభూతాన్నపానసంతర్పిత సకలజనంబై యభిమతాంబరాభరణ పరిపూజిత భూసురప్రకరంబై యథాకాలవిహితకర్మకలాపంబై యథాశాస్త్రీయంబై వైష్ణవయాగంబు నిర్విఘ్నంబుగఁ బరిసమాప్తం బగుటయు. | 84 |
| క. |
అవభృథశోభితుఁడై కౌ | రవముఖ్యుఁడు భూరికనకరత్నతతుల భూ దివిజులఁ బూజించి నృపుల | వివిధ విధుల సత్కరించి వీడ్కొలిపెఁ దగన్. |
85 |
| వ. | అట్టియెడ నధ్వరోత్సవాగతు లైన జను లనేకులు ధృతరాష్ట్రనందను సమ్ముఖంబున ని ట్లనిరి. | 86 |
| క. |
‘జనపతు లెవ్వరు నివ్విధ | మున నిర్విఘ్నముగ నఖిలభూజనసమ్మో దనముగఁ జేసిరె సత్క్రతు | వనఘ! భవత్పుణ్యమహిమ లాశ్చర్య మిలన్. |
87 |
| శా. |
సారోదారవిభూతిమై మును హరిశ్చంద్రుం డొనర్చెం గ్రియా పారీణుండయి రాజసూయ; మది సెప్పన్ వింటి; మయ్యజ్ఞముం గౌరవ్యోత్తముఁ డైన ధర్మసుతుఁడుం గావింపగాఁ గంటి; మే మా రెండున్ సరిగావు నీమఖముతో నత్యున్నతిన్ భూవరా! |
88 |
| క. |
ఈ జన్న మొనర్చియకా | దే జగదావర్తకీర్తి దీపితులై య వ్యాజసురలోకసుఖముల | భ్రాజిల్లిరి రఘు యయాతి భరతాది నృపుల్’. |
89 |
| తే. |
అని నుతింపంగ మఱియును నంద కొంద | ఱయ్యుధిష్ఠిరు రాజసూయంబు చిదుర పాలుఁ బోల దీమఖము వైభవసమృద్ధి | నని తలంచిరి నిజహృదయంబులందు. |
90 |
| వ. | అనంతరంబ నిరంతరానందమందమందాయమానమానసుం డగుచు మానవేశ్వరుండు దమ్ములు దొరలు బంధుజనంబులుం బరివేష్టింపఁ బౌరజనదత్తాశీర్వాద జయజయశబ్ద శబ్దాయమాన దిగ్విభాగుం డగుచుఁ బుణ్యాంగనా కరకలిత లలితాక్షతవిక్షేపంబులును, బటువందిమాగధ సంకీర్తనంబులును గైకొనుచుఁ బురప్రవేశంబు సేసి, రాజమందిరగతుండై ధృతరాష్ట్రునకు గాంధారికిఁ గృపద్రోణభీష్ములకుం బ్రణమిల్లి యుల్లంబు వికసిల్లఁ గనకాసనాసీనుండయ్యె; నప్పుడు కర్ణుం డతని కి ట్లనియె. | 91 |
| ఉ. |
‘భాగ్యము గాదె కౌరవనృపాల! భవన్మఖ మిష్టసత్క్రియా యోగ్యత నిర్వికల్పముగ నొందె సమాప్తి; నశేషధాత్రియున్ భోగ్యమ నీకు; నింక రణభూమిఁ బృథాసుతులన్ జయించి స మ్యగ్యమశాలివై భువనమాన్య! యొనర్పుము రాజసూయమున్. |
92 |
| క. |
అది యెమ్మెయి నగునో యని | మదిలో వగవంగవలదు; మఘవతనూజుం గదనంబునఁ జంపక యే | పదనఖధావన మొనర్పఁ బార్థివముఖ్యా!’ |
93 |
| తే. |
అనినఁ గర్ణుఁ గౌఁగిటఁ జేర్చి యన్నరేంద్ర | నందనుఁడు ‘నీ సహాయత నాకుఁ గలుగఁ బాండవుల నోర్చు టెంతటి పని మహాత్మ!’ | యని సహోదరసహితుఁడై హర్ష మొందె. |
94 |
| వ. | అట ధర్మతనయుండు సూతతనయు ప్రతిజ్ఞ విని వాని బలశౌర్యవిభవంబును నభేద్యకవచ ప్రభావంబును దలంచి విషణ్ణహృదయుం డై రేయెల్లను గన్ను మూయుట లేక వగచుచుండె; నిట దుర్యోధనుండునుం గర్ణసౌబలప్రవర్తిత కార్యఖడ్గుం డై భీష్మద్రోణకృపాదులకును మహనీయు లైన మహీసురులకు ననుదినంబును బ్రియ సత్కారంబులు సలుపుచు ధనంబు దత్తభుక్తఫలంబుగా వగచి, నిరంతర త్యాగ భోగంబుల ననురాగంబు నొందుచుండె ననిన’ వైశంపాయనునకు జనమేజయుం డిట్లనియె. | 95 |
| క. |
‘దుర్యోధను చెఱఁ దలిఁగి య | వార్యపరాక్రములు పాండవప్రభులు మహా శ్చర్యచరితు లవ్వనమున | నార్యులు మఱి యెట్టివార లైరి మునీంద్రా!’ |
96 |