| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - షష్ఠాశ్వాసము |
| వ. | అని యడిగిన నమ్మహాముని యమ్మహీపతి కి ట్లనియె. | 97 |
| సీ. |
‘ద్వైతవనంబున ధర్మజుం డొకనాఁడు | నిద్రింపఁగాఁ దద్వనేచరంబు లగునట్టి మృగజాతు లన్నియుఁ గలలోన | వచ్చి కన్నుల నశ్రువారి దొరుఁగఁ ద మ్మెఱింగించి యాతనితోడ నిట్లను | ‘ధర్మాత్మ! మీరు నిత్యంబుఁ గడఁగి చంపంగఁ జంపంగ సమసి యల్పావశి | ష్టము లయ్యె నిప్పు డస్మత్కులంబు |
|
| తే. |
లేము బీజమాత్రమ దక్కి యిట్లు వనరు | చున్నవారము; మీ రింక నొండు గడకు నరిగి, మముఁ గావరే కరుణార్ధ్రబుద్ధి’ | ననిన నట్లకా కని వాని కభయ మిచ్చి. |
98 |
| క. |
జనపతి మేల్కొని యంతయు | ననుజుల కెఱిఁగించి యిట్టు లను ‘నబ్దముపై నెనిమిది నెల లుండితి మి | వ్వనమునఁ; దగు నింక నొండువలనికిఁ బోవన్. |
99 |
| వ. | ఇప్పుడు కామ్యక వనంబు బహుమృగాకీర్ణంబై సరసఫలభరిత భూరుహప్రకరంబై విమలకమలా కరాభిరామంబై యున్న యది యని వింటిమి గ్రమ్మఱ గావునం నందులకుం జని తృణబిందునాశ్రమంబున వసియించుటలెస్స’ యనినం దమ్ములు ‘దేవా! నీ వెట్లు నిశ్చయించితి మాకు నదియ యిష్టం’ బని వలికిరి; తదనంతరంబ. | 100 |
| క. |
అనుజన్ములుఁ బాంచాలియు | నను చరవర్గంబు బ్రాహ్మణావలియును దోఁ జనుదేరఁగ సమ్మదమున | ఘనతేజుఁడు సనియెఁ గామ్యకవనంబునకున్. |
101 |
| వ. | ఇట్లరిగి యందుఁగృతనివాసులై యవ్వీరులు శాఖఫలమూలంబులంజేసి దేహయాత్రలు నడపుచు నొండొరుల యలజడి సూచి యత్యంతదుఃఖపరవశు లగుచు, జూదంబునాఁడు దమపడినపాట్లు దలంచి కలంగుచుఁ గ్రోధశోకంబులు దమలోన నుపశమించుకొనుచు వర్తిల్లం, బదునొక్కండగు నేఁడు సనిన నందఱుం గాలంబు గడగాంచినవారలై వెడవెడ వికసిల్లిన చిత్తంబులతో నుచితవృత్తంబుల నుండునంత. | 102 |
| శా. |
ప్రీతుండై చనుదెంచె నాశ్రితజనాభీష్టక్రియాశీలుఁ డు ద్గీతామ్నాయుఁడు నిర్విధూతదురితక్లేశుండు యోగామృత స్ఫీతస్వాంతుఁ డనంతసంతతసమావిర్భూతకారుణ్యధా రాతోయస్నపనైకశీలుఁ డగు పారాశర్యుఁ డచ్చోటికిన్. |
103 |
| క. |
మునిపతి దోదవ్వులఁ గని | జనపతి దమ్ములును దాను సంప్రీతి నెదు ర్కొని యర్ఘ్యాది విశేషా | ర్చనలం బరితుష్టుఁ జేసె సంభృతభక్తిన్. |
104 |
| వ. | కృష్ణద్వైపాయనుండును ననవరతవనవాసాయాస కృశదేహుల నధికదుఃఖాయమాన హృదయులం దన మనుమలం జూచి వగచి, ధర్మపుత్త్రున కి ట్లనియె. | 105 |
| ఉ. |
‘కాలవిపర్యయంబున సుఖంబును దుఃఖము వచ్చుచుండు; నె క్కాలము నేరికిన్ ధ్రువము గాదు సుఖంబును దుఃఖమున్ మహీ పాల! బుధుండు దద్వివిధభంగు లెఱింగి ప్రమోద ఖేదసం శీలుఁడు గాఁడు రెంటను బ్రసిద్ధపథంబున నప్రమత్తుఁడై. |
106 |
| క. |
విను నీవును నాపదలకు | మనమున నొక్కింత యోర్చి మహనీయముగా నొనరింపుము తపము; దపం | బునన కదా సకలసౌఖ్యములు సిద్ధించున్. |
107 |
| క. |
క్షమయు నహింసయు సత్యము | సమతయు నింద్రియజయంబు శమముఁ బరిత్యా గమును దపోలక్షణములు | గ్రమమున నిన్నియును నూర్ధ్వగతికారణముల్. |
108 |
| తే. |
ఇందుఁ జేసిన పుణ్యంబ యందుఁ గుడుచు | మీఁది జన్మంబునకు నది మేలుఁ జేయుఁ గాన తనశక్తితోఁ గూడ దానధర్మ | చిరపరోపకారంబులు సేయవలయు’. |
109 |
| వ. | అనినం బాండవాగ్రజుండు ‘దానతపంబులలో దుష్కరం బెయ్యది? యెద్దాన నధికఫలం బగు?’ నని యడిగిన వేదవ్యాసుం డి ట్లనియె. | 110 |
| సీ. |
‘దాన మూర్జితఫలదం బర్థసాధ్య మై | పరఁగుటఁ గరము దుష్కరము నదియ; నరులకు నధిప! ప్రాణంబులకంటెను | రూపింప నర్థంబు తీపు వినవె యుగ్రంబు లైన యాయుధముల మొనలపై | నుఱుకుట యంభోధి దఱిసి చనుట కృషి పాశుపాల్యసంక్లేశంబు నొందుట | యడవులఁ గొండల నిడుమ వడుట |
|
| ఆ. |
నవసి పొవసి యనుదినముఁ బరప్రేష్యులై | యునికిఁ దలఁప నర్థమునకు చూవె! యట్టి దుఃఖలబ్ధ మైన యయ్యర్థంబు | విడుచు టెవ్విధమునఁ గడిఁది గాదె? |
111 |
| శా. |
అన్యాయార్జిత మైన విత్తమునఁ జేయం బూను దానంబు మూ ర్ఖన్యాయం బది; దానఁజేసి ఫలపాకం బేమియున్ లేదు; యు క్తన్యాయార్జిత మించుకంత యయినం గాలంబు దేశంబు స మ్మాన్యంబై తగఁ బాత్రయోగమున సౌమ్యంబై ఫలించుం దుదిన్. |
112 |
| వ. | తొల్లి ముద్గలుం డను మహాద్విజుండు సన్మార్గోపార్జితం బైన వ్రీహిద్రోణంబు సత్పాత్రంబున వినియోగించి కాదె పరమసిద్ధిం బొందె’ ననిన విని ధర్మనందనుండు ‘మునీంద్రా! ముద్గలుండు వ్రీహిద్రోణం బెబ్భంగి నుపార్జించె? నెట్టి పాత్రంబునఁ బ్రతిపాదించె?; వినవలతుం జెప్పవే!’ యనిన నతం డిట్లనియె. | 113 |