పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - షష్ఠాశ్వాసము
ముద్గలునకు దేవదూత పుణ్యలోకంబుతెఱంగు సెప్పుట (సం. 3-247-2)
క. ‘ఈ లోకమునకు మీఁదై | చాలఁగ వెలుఁగొందుచుండు స్వర్లోకము నా
నాలంకారయుతము ది | వ్యాలోకము దేవయాన మది మునినాథా!
129
చ. అమలతపోనివాసులు మహాధ్వరశీలురు సత్యసంధు లు
త్తములు జితేంద్రియుల్‌ సములు దానపరుల్‌ రణశూరు లందు హ
ర్షమున వసింతు; రచ్చరలు సాధ్యులు దేవమునుల్‌ మరుద్వసు
ప్రముఖులు వేఱువేఱ తగుపట్టుల నుండుదు రంద యిమ్ములన్‌.
130
వ. మఱియు ముప్పదిమూఁడు వేల యోజనంబుల విస్తృతంబైన మేరుశిఖరంబునందు నందనప్రముఖంబు లైన దేవోద్యానంబులు పుణ్యపరులకుం గ్రీడాస్థానంబులై విలసిల్లు; నయ్యెడల నాఁకలియు నీరువట్టును శీతోష్ణభయంబులును జరారోగవికృతులును బుట్ట; వెయ్యెడలం జూచిన నతిమనోహరంబై సకలేంద్రియ తర్పణం బై యుండు; నిట్టి పుణ్యలోకంబునకు నర్హు లైన పుణ్యపురుషులు విధినియోగ పక్వంబు లయిన మానుషశరీరంబులు విడిచి తేజోమయంబు లగు దివ్యదేహంబులు ధరియించి వివిధాంబరాభరణ భూషితులును నమ్లానకుసుమమాలికా మనోహరులునై కనకవిమానంబులందు దేవదూతలచేతం గొనిపోవంబడి యందు శోకభ్రమశ్రమాయాసవిరహితు లై వివిధసుఖంబు లనుభవించుచుండుదురు. 131
ఆ. అనఘ! యింద్రలోకమునకంటె మీఁద ని | శ్శోక మగుచు బ్రహ్మలోక మమరు;
నది యనన్యదీప్తసదన మై తన దైన | వెలుఁగునను జగంబు వెలుఁగఁ జేయు.
132
చ. మనువులు ధాతలున్‌ మునులు మానుగ నుండుదు; రందు లోభముం
గినుకయుఁ గిల్బిషంబు నపకీర్తియు దుఃఖము జన్మవైకృతం
బును జనియింప; వీభువనముల్‌ దెగునప్పుడు నాశమొంద ద
వ్వినుతపదంబు; దానియెడ వేడుక సేయుదు రింద్రముఖ్యులున్‌.
133
వ. స్వర్గంబునం గల గుణంబు లెఱింగించితిఁ దదీయదోషంబులు సెప్పెద వినుము. 134
తే. ఇందుఁ జేసినపుణ్యంబు లెల్ల నందుఁ | గుడుచుఁ గాని మర్త్యున కందుఁ గడఁగి పుణ్య
మాచరింపంగఁ గాదు; పుణ్యావసాన | మగుడు భూమిక త్రోతురు మగుడ నతని.
135
క. కడు మరగిన సౌఖ్యంబులు | విడుచుటఁ జిత్తంబు దుఃఖవివశముగ మహిం
బడుఁ జూవె; పుణ్యలోకం | బెడలిన మనుజుండు దేజ మేది యబలుఁ డై.
136
క. తన తక్కువయునికియు న | న్యుని యున్నతశీలతయుఁ గనుంగొని చిత్తం
బున నెరియుచునికి గలుగును | జననుత! సురలోకవాస జనులకు నెల్లన్‌.
137
వ. బ్రహ్మలోకంబునం దక్కఁదక్కిన పుణ్యలోకంబులం దెల్ల నిదియ మేరయై చెల్లు; మఱియుఁబుణ్యలోకపరిభ్రష్టుండ మర్త్యలోకంబున సుఖశీలుం డయి పుట్టు; నీలోకంబు గర్మభూమియు నాలోకంబు ఫలభూమియు నని యెఱుంగుము; నీవలని యాదరంబునంజేసి యింతయుం జెప్పితి; నీ వింకఁ దడయ నేల? చనుదె’ మ్మనిన ముద్గలుండు గొండొక విచారించి దేవదూతం జూచి యిట్లనియె. 138
ఆ. ‘ఇట్టి దివ్యసుఖము లే నొల్లఁ; బదివేలు | వచ్చె నాకు; నమరవర్గమునక
యుండనిమ్ము వాని నో యన్న! విచ్చేయు | మిష్టమైన యెడకు నిపుడ నీవు.
139
క. ఎయ్యెడకుఁ జనినఁ బురుషుం | డియ్యెదకును మగుడకుండు నెక్కాలము నే
నయ్యుత్తమపదవికినై | యెయ్యనువున నైన నుత్సహించెద బుద్ధిన్‌.’
140
వ. అని దేవదూత వీడ్కొలిపి ముద్గలుండు శిలోంఛవృత్తి విడిచి, పరమశాంతిం గైకొని, నిర్వికల్పం బైన జ్ఞానయోగంబునం జేసి తుల్యనిందాస్తుతియును సమలోష్టాశ్మకాంచనుండును నై పరమసిద్ధిం బొందెఁ; బాండవోత్తమా! నీవును రాజ్యరహితుండనైతి నని వగవక తపంబు సేయుము; తపంబునంజేసి శుభంబులు సేకుఱుఁ; బదుమూఁడవునేఁటి కడపటఁ బితృపైతామహంబైన రాజ్యంబు నిన్నుం బ్రాపించు’ నని యిట్లు సాత్యవతేయుండు గౌంతేయుల నాశ్వాసించి నిజాశ్రమంబునకుం జనియె; నంత. 141
మ. వితతానేకమృగాకులంబును సదావిర్భూత నానాతరు
ప్రతతీపుష్పసుగంధబంధురశుభావాసంబు బ్రహ్మర్షిసం
శ్రితపుణ్యాశ్రమమండలంబు నగుచుం జెల్వొందు నక్కానలో
ధృతపుణ్యుల్‌ విహరించి రేవురును గుంతీపుత్త్రు లిచ్ఛాగతిన్‌.
142
వ. ఒక్కనాఁడమ్మహారథులు దృణబిందు నాశ్రమంబున ధౌమ్యసహితంబుగాఁబాంచాలి నునిచి యేవురు నొక్కట మృగయార్థంబు నలుదిక్కులకుం జనిన యనంతరంబ. 143
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )