పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - షష్ఠాశ్వాసము
వ్యాసుఁడు ధర్మజునకు వ్రీహిద్రోణాఖ్యానంబు సెప్పుట ( సం. 3-246-3)
క. ‘అతిథిప్రియుఁడు విశిష్ట | వ్రతుఁడు విమత్సరుఁడు సత్యవచనుండు విని
ర్జిత విషయేంద్రియుఁడు సము | న్నత పుణ్యుఁడు ముద్గలుఁడు ఘనస్థిరబుద్ధిన్‌.
114
వ. పుత్త్రదారసహితంబుగాఁ గురుక్షేత్రంబున వసియించి యుంఛవృత్తిపరాయణుండై పాడ్యమిం దొడంగి పదునాలుగు దివసంబు లొక్కొక్కగింజయకా నేరి తూమెఁడు వడ్లు సమకూర్చి పర్వదినంబునఁ బాకంబు సేయించి దేవపితృపూజనంబు లొనరించి యతిథుల కన్నంబు వెట్టి మిగిలిన యన్నంబునఁ దానును బుత్త్ర కళత్రంబులును దేహయాత్ర నడపుచు నివ్విధంబునఁ బక్షోపవాసవ్రతంబున వర్తిల్లుచున్నయెడ నొక్క పర్వదినంబునందు. 115
మ. మతి నత్యంత జుగుప్సితం బయిన యున్మత్త స్వరూపంబుతో
గతవస్త్రుండును ముక్తకేశుఁడు బహుగ్రామ్యోక్తిశీలుండు నై
హితపుణ్యుండు మునీశ్వరుం డతిథి యై యేతెంచె దుర్వాసుఁడన్‌
యతి యమ్ముద్గలుపాలికిం బటుబుభుక్షాయత్తతం దూలుచున్‌.
116
క. అతనిఁ గని యించుకంతయు | మతి ననుమానంబు లేక మానుగఁ బ్రత్యు
ద్గతుఁడై యర్ఘ్యముఁ బాద్యము | నతిభక్తి నొనర్చి మునికులాగ్రణి నెమ్మిన్‌.
117
క. అన్నంబు వెట్టె నతఁడు త | దన్నంబంతయును గుడిచి యాత్మఁ దనిసి, శే
షాన్నంబు మేన నిండఁగ | సన్నుతుఁ డలఁదికొని మగుడఁ జనియె నిజేచ్ఛన్‌.
118
క. మునిపతి పర్వము పర్వం | బున మఱియును నరుగుదెంచు; ముద్గలుఁడును దా
ననశనుఁడై యుండియు న | మ్మునివరునకు నొసఁగు నన్నముం బ్రియ మెసఁగన్‌.
119
వ. ఇవ్విధంబున నాఱుపర్వంబులు గుడిచి దుర్వాసుండు వాని చిత్తంబున నొక్కకొఱంతయుం గానక యద్భుతప్రమోదమగ్నమానసుండై వాని కిట్లనియె. 120
క. ‘నీయట్టి దానశీలుని | నీ యఖిలమునందుఁ గాన నెన్నండును స
త్త్వాయత్తమతివి సాధువి | ధేయుండవు నీవు పుణ్యతేజుఁడ వనఘా!
121
చ. మనమున నేవగింప, కవమానము సేయక, యించుకంతయున్‌
గినియక, యోలమందక, యకృత్రిమభక్తి నొనర్చి తీవు స
జ్జననుత! యన్నదానము; ప్రసాదము సత్యము ధైర్యమున్‌ దమం
బును నపరిగ్రహత్వమును బొల్పుగ నీధనమయ్యె నియ్యెడన్‌.
122
చ. చవులకుఁ బ్రేముడించు ననిశంబును నాలుక, దాల్మిపెంపు ధ
ర్మువును శమంబుఁ ద్రెక్కొను సముద్ధతి నాఁకలి; వీని రెంటనుం
దవులవు జీవితస్థితివిధాయక మన్నము నీవు జీవితే
చ్ఛ విడిచి; తిప్పు డేమని ప్రశంస యొనర్తు నినుం దపోనిధీ!
123
క. మనమున నింద్రియముల వ | ర్తనమును సరిగా నొనర్చు ధర్మంబు దపం
బని చెప్పుదు; రట్టి తపం | బనఘా! నీయంద కలిగె నభినవభంగిన్‌.
124
ఉ. ప్రీతుఁడ నైతి నీవలనఁ; బేర్చిన పుణ్యఫలంబు లెల్ల నీ
చేతివ యయ్యె; నీ దగు ప్రసిద్ధతపోవిభవంబు నిర్జర
వ్రాతము లిప్డు సాటెఁ; ద్రిదివంబున కీవును మేనితోడ వి
ఖ్యాతిగ దేవయానమున గ్రక్కున నేఁగెదు సంయమీశ్వరా!’
125
వ. అని పలికి దుర్వాసుం డరిగెఁ; దదనంతరంబ హంససారస యుక్తంబును గింకిణీమాలికా మనోహరంబును గామగమనంబును నయిన విమానంబు గొనుచు దేవదూత ముద్గలుకడకుం జనుదెంచి యి ట్లనియె. 126
క. ‘అనఘ! భవత్సుకృతంబున | ననిమిషలోకాభిగమ మవాప్తం బయ్యెం;
జనుదెమ్ము విమానము చ | య్యన నెక్కుము చిత్తమునఁ బ్రహర్షం బెసఁగన్‌’
127
వ. అనిన దేవదూతం జూచి ముద్గలుండు ‘మహాత్మా! దివిజలోకం బెట్టిది? వినవలతు; నందుల గుణదోషంబు లెఱింగింపవలయు; సత్పురుషులతోడి మైత్రి సాప్తపదీనం బని చెప్పుదురు గావున మైత్త్రిం బురస్కరించి ని న్నడిగెద’ ననిన నతం డమ్మునీంద్రున కి ట్లనియె. 128
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )