పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - షష్ఠాశ్వాసము
ద్రౌపది సైంధవునితో నిష్ఠురోక్తులు వలుకుట (సం. 3-252-1)
చ. ‘ప్రకటితశౌర్యసారుల నభగ్నపరాక్రమ నిర్జితాహిత
ప్రకరులఁ బాండునందనులఁ బాండుయశస్కుల నాత్మలోఁ దలం
పక నను ధిక్కరించెదు నృపాలకులాధమ! నీదుగర్వదు
ర్వికసన మింతఁ బోదు; తుది వ్రేఁగగుఁ; దక్కుము దుష్ప్రలాపముల్‌.
174
మ. హిమవత్పాదవనాంతకేలిరతిమై నేపారి కోపారుణ
క్రమనేత్రాంచలమై ప్రభూతమదరేఖం బైన గంధద్విపేం
ద్రము డాయం జని సిళ్లు సూపుట సుమీ ధర్మాత్ము నత్యుగ్రవి
క్రముఁ గౌంతేయవరిష్ఠు నీవు దొడరంగాఁ జూచు టూహింపఁగన్‌.
175
ఉ. శాతనఖాగ్రఖండిత లసన్మదకుంజర కుంభముక్త ము
క్తాతతశైలకందర గుహాంతర సుప్త మృగేంద్రకేసర
వ్రాతము వేడ్క సూఁచికొన వారక చేరుటగాదె క్రోధని
ర్ఘాతమహోగ్రు భీముఁ జెనకం దలపోయుట నీకు నెమ్మెయిన్‌.
176
మ. చలజిహ్వాగ్రవిలీఢవిస్ఫురిత దంష్ట్రాభీషణం బైన బె
బ్బులిఁ గోలం గొని వ్రేసి త్రోసి తొలఁగం బోవచ్చినన్‌ వచ్చుఁ గా
క లసత్క్రూరశరాగ్నిదుస్సహుని నగ్గాండీవి నల్గించి యె
వ్వలనన్‌ మానధనాఢ్యులై బ్రతికిపోవన్‌ వచ్చునే యేరికిన్‌.
177
ఉ. బోరన విస్ఫులింగములు వొడ్మఁగ నుగ్రవిషంబు గ్రక్కుచుం
గ్రూరవిచేష్టనాలుకలు గ్రోయు మహోరగరాజయుగ్మముం
జేరి పదాహతిం గినియఁ జేయఁ దలంచుట గా నెఱుంగు దు
ర్వారులు మాద్రిపుత్త్రుల కవజ్ఞ యొనర్పఁ దలంచు టేర్పడన్‌.
178
ఉ. ఆలములోన వీఁక నమరాసురకోటికి నైన దుర్జయుల్‌
వాలినవీరు లవ్విభులు; వారికి నెగ్గొనరించి పోయి పా
తాళము సొచ్చి డాఁగినను దప్పదు మృత్యువు నీకు నక్కటా!
కాలము నిండె; నీవశము గాదు విధాతృని చెయ్ది త్రోవఁగన్‌.
179
క. తేలును గర్కటియును దెగు | కాలమునకుఁ జూలుదాల్చుగతిఁ బార్థుల యి
ల్లాల నయిన నాదెస దు | శ్శీలుఁడవై తిది వినాశచిహ్నము గాదే!’
180
వ. అనిన జయధ్రథుండు నవ్వుచు నవ్వెలంది కి ట్లనియె. 181
ఉ. ‘వారిజనేత్ర! పాండుసుతవర్గము నేఁ డిఁట మాకు వింతయే?
భీరులఁ బోలె నేల వెఱపించెదు మాటల మమ్ము? వింటె! సౌ
వీరకులప్రసూతులము వీరుల మే; మితర క్షితీశ సా
ధారణబుద్ధి సేయకు ముదాత్తచరిత్రుల మైన మాదెసన్‌.
182
వ. వలవని మాటలం దేర్చినం దీరదు; వేగంబ యల్ల కనకరథం బొండె నల్లమహాగజంబు నొండె నెక్కుము; బీరంపుమాట లాడక ప్రియవచనంబుల నస్మత్ప్రసాదభాజనంబ వగు’ మనిన విని యాజ్ఞసేని వాని కిట్లనియె. 183
ఆ. ‘వీరపత్ని నయ్యు వీరసహోదరి | నయ్యు నీకుఁ జూడ ననదవోలె
నున్నదాన; నెట్టు లున్నను నాకు నిన్‌ | దెలుప నేల పలుకు తియ్య మేల?
184
చ. అతులితవృష్ణి కేకయబలావళితోఁ బటుశంఖఘోష భీ
షితభువనత్రయుం డగుచు శీఘ్రతురంగరథాధిరూఢుఁ డై
జితదనుజాన్వయుండు యదుసింహుఁడు వెన్నుఁడు ముట్టి నిన్‌ బరి
క్షతబలుఁ జేయు నాకు దెసగల్గు టెఱింగెదు గాక యత్తఱిన్‌.
185
సీ. గాండీవరేఖ యాఖండలు చాపంబు | కరణిగాఁ, దద్గుణక్వణము ఘోర
గర్జగా, నవిరళగంభీరవీరర | సాపూర్ణమై సంతతావలిప్త
శత్రుప్రతాపోష్ణ సమయంబు శమితంబు | గా, మిత్రబర్హికేకారవంబు
లెసఁగంగఁ దోఁతెంచి యింద్రనందన మహా | జలధరం బాయతసాయకోరు
 
ఆ. వృష్టి ముంచుటయును వెరఁగంది నిలువంగ | నలవిగాక పఱచు నప్పు డైన
నాత్మదోషవృత్తికై మనంబున వగ | చెదవు గాక! యిపుడు సెప్ప నేల?
186
ఉ. ఘోరగదావిదారణ విఘూర్ణితశాత్రవకుంభికుంభముల్‌
చీరుచు మౌక్తికంపుతతిచే రణభూమి నలంకరించు కే
లీరసలోలుఁ డై సమదలీల బకాంతకుఁ డేఁగుదేరఁ గ
న్నారఁగఁ జూచి కాక యిటు లంతకు నీమది త్రుళ్ళడంగునే?
187
క. ననుఁ బెఱవనితల చందం | బున నవమానింప నీకుఁ బోలదు మత్పా
వనపాతివ్రత్యమహిమ | ననిశము నేకీడు నెందు నందదు నన్నున్‌.’
188
వ. అని పలికి ద్రౌపది యద్దురాత్ముండు దన్నుఁ బట్ట సమకట్టు క న్నెఱింగి తమపురోహితు ధౌమ్యునిం బేర్కొని యాక్రోశించిన, నతం డతిరయంబునఁ జనుదెంచు నాలోన. 189
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )