పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - షష్ఠాశ్వాసము
అర్జునుఁడు సౌవీరకుమారులం బన్నిద్దఱఁ జంపుట (సం. 3-255-27)
వ. అంత నంగారకుండును, గుంజరుండును, సృంజయుండును, సుప్తకుండును, శత్రుంజయుండును, సుప్రబుద్ధుండును, శుభంకరుండును, భ్రమంకరుండును, శూరుండును, రథియును, గుహకుండును, బలాఢ్యుండును నను సౌవీరకుమారులు పన్నిరువురు నిక్ష్వాకు శిబి సైంధవ త్రిగర్త సైన్యంబులం గూడి క్రీడి మార్కొని పటుబాణజాలంబులం గప్పిన. 232
మ. అతులక్రోధ విఘూర్ణమానహృదయుండై చండ గాండీవ ని
ర్గత భల్లౌఘములం దదస్త్రవితతుల్‌ ఖండించి సౌవీరసం
తతిఁ బన్నిద్దఱవిండ్లులం దునిమి దోర్దర్పంబు మీఱంగ స
స్మితుఁడై యాతఁడు దచ్ఛిరఃప్రకర విచ్ఛేదంబు సేసెన్‌ వెసన్‌.
233
క. ఆకులముగ శైబ్యుల ని | క్ష్వాకుల, సైంధవులనుం ద్రిగర్తులనుం బో
నీక పొదివి రయమున న | స్తోకపరాక్రముఁడు దునిమి తూఁటాడె వడిన్‌.
234
వ. అప్పుడు రణభూమి యంతయు శవమయం బయ్యె, నంబరం బంతయుం గబంధమయం బయ్యెఁ; జారు కేయూర వీరాంకవిభూషితంబులైన బహుచరణచ్ఛేదంబులును, గార్ముకతూణీరకాండఖండంబులు, నక్షకూబర రథాంగకేతనత్రివేణుకశకలంబులును, బుండరీకవ్యజనచామర భంగంబులుం, గరవాలపరిఘ శక్తిగదా ముసలపట్టిసప్రాస లేశంబులు, నెక్కడఁ జూచిన రాసులై యుండెఁ; గీలాల పూరంబును మాంసపంకంబును గేశ శైవాలంబును నైన యపూర్వనదీప్రవాహంబునందు బహువిధక్రవ్యాదగణంబు లవగాహంబు సేయుచుఁ బ్రకటకోలాహలవ్యాకులం బగుచుండె; నివ్విధంబున. 235
క. గాండివపవనప్రేరిత | చండాంబకఘోరశిఖల శతమఖతనయో
ద్దండదహనుఁ డొకమాత్ర న | ఖండితసౌవీరసైన్యకానన మేర్చెన్‌.
236
వ. అట్టి క్రందున జయద్రథుండు ద్రౌపదిని దిగ విడిచి రథంబు దోలుకొని పఱచె; నంత ధర్మజుండు ధౌమ్య సమన్విత యై యున్న పాంచాలిం గని నిజరథంబుపై నిడికొనియె; సైంధవు పలాయనం బెఱింగి యర్జునుండు శత్రుసేనాహననసంరంభంబున నున్న భీమసేనున కిట్లనియె. 237
తే. ‘వీతలజ్జుఁడై పఱచె సౌవీరవిభుఁడు | పొనుఁగుప్రజ నేల యాఱడిఁ దునిమి వైవ
నద్దురాత్ముని వెనుకొని యసువు లిపుడు | గొనఁగవలయు, లే లెమ్ము సద్వినుతశౌర్య!
238
వ. అనిన నతండు గయ్యంబు సాలించి ధర్మతనయుం జూచి. 239
క. ‘జననాథ! ద్రుపదసుతఁ దో | డ్కొని ధౌమ్యుఁడు నీవుఁ గవలు గుఱుకొని మగుడం
జనుఁ డాశ్రమంబునకు నే | మును సైంధవువెనుకఁ గూడ ముట్టెదము వెసన్‌.
240
క. అతలంబునఁ గ్రుంగిన న | ద్భుతముగ దివమునకు నెగసి పోయినఁ బగతున్‌
హతుఁ జేయక మగుడము; విని | హతుఁడుగఁ జేయుదుము దివిజు లడ్డం బైనన్‌’.
241
తే. అనిన ధర్మజుఁ డిట్లను నద్దురాత్ముఁ | బొలియఁ జేయుట దగదు దుస్సలఁ దలంచి;
వాని నొకతప్పునకు సైఁప వలదె? యాంబి | కేయమహిషికి ఖేదంబు సేయఁ దగునె?’
242
వ. అనినం బాంచాలి భీమార్జునులతోడ ‘నప్పాపాత్ముని దెసం గృప సేయ వలవ; దవశ్యంబును వాని వధియించి, నాకుం బ్రియంబు గావించునది; యట్టి ద్రోహి యెల్ల భంగుల వధ్యుం’ డనియెఁ; దదనంతరంబ ధర్మనందనుండు ధౌమ్య ద్రౌపదీ నకుల సహదేవ సహితుండై, మగిడి నిజాశ్రమంబునకుం జనియె; నిట భీమ విజయులు రథంబులు రయంబునం దోలుకొని చని, క్రోశమాత్రాంతరంబున సైంధవుం గని; రప్పుడు కిరీటి దూరాపాత విశిఖంబుల జయద్రథురథ్యంబులం బడనేసిన. 243
క. తల్లడ పడి యరదము డిగి | విల్లును నమ్ములును విడిచి వెల్ల నగుచు మే
నెల్లఁ జెమర్పఁగ నూర్పులు | పెల్లుగ నమ్మనుజపశువు పెలుచం బఱచెన్‌.
244
ఆ. వానిఁ జూచి నగుచు వార ‘లోరోరి! యిం | కెందుఁ బోవ వచ్చుఁ బంద! నిలువు;
మిట్టికడిమి నమ్మియే ప్రల్లదంబులు | సేయఁ దొడఁగి’ తనుచు డాయుటయును.
245
వ. మరలి చూచి వాఁ డొక్క గుల్మమధ్యంబుఁ దూఱుటయుఁ గని భీమసేనుండు రోషసందష్టాధరుం డగుచు రథంబు డిగ్గ నుఱికి. 246
క. ఒడిసి తలవట్టి నేలం | బడఁ దిగిచిన, వాఁడు పెనఁగఁ బడుటయుఁ జిక్కన్‌
మెడఁ ద్రొక్కి గాఢముష్టిం | బొడిచె మొగం బవియ రక్తపూరము దొరుఁగన్‌.
247
క. ఒడలెల్లఁ బిండికూడుగఁ | బొడిచి యెగయ నెత్తి త్రిప్పి భూస్థలి మీఁదన్‌
బడవైచి యురము మొగమును | నడిచెను వడముడి తలప్రహారకుశలుఁడై.
248
వ. ఇట్లు బెట్టుగా నడఁచినఁ బగతుండు వివశుం డగుటయుం జూచి యర్జునుం ‘డోహో! యింత సాలు; నింక నొచ్చినం బ్రాణ విముక్తుం డగుం గావున నజాత శత్రువచనంబులు దలంచి, వీనిఁ గరుణింపు’ మనిన నతండు గవ్వడి దెసఁ గనుంగొని, ‘ధర్మనందనుం డెప్పుడుఁ గరుణయకాని కార్యంబు చేటుపాటు విచారింపఁజొరండు; నీవును నతనిభంగిన బేలవై; తిద్దురాత్ము నెట్లు సైఁప వచ్చు?’ నని పలికె; ననంతరంబ. 249
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )