| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - షష్ఠాశ్వాసము |
| ఆ. |
వాఁడియైన కత్తి వాతి యమ్మునఁ గొని | పగతుశిరము చెక్క లెగయ గొఱిగి నరుల కెల్లఁ జూడ నవ్వగునట్లుగాఁ | గలయ నైదు గూఁకటుల నొనర్చె. |
250 |
| వ. | ఇట్లు రాజవేషంబు వికల్పితంబు సేసి యమ్మహాభుజుండు వాని కిట్లను ‘నోరీ! బ్రదుకవలతేని నేఁడు మొదలుగా నెల్ల సభలయందును ‘బాండవదాసుండ’ నని పలుకునది’ యనిన వాఁడును దండాఘాతభయంబున ‘నట్లచేయుదు’ ననియె; నంత నయ్యిరువురు నతనిం బెడకేలు గట్టి రథంబుపై నిడికొని నిజాశ్రమంబునకుం జని ధర్మపుత్త్రునకు నివేదించి, ‘వీఁడె పాండవ దాసుం’ డనిన, నతం ‘డట్లేని వీని విడువుం’ డనియెఁ; బాంచాలియు జయద్రథుం జూచి నవ్వుచు ‘నిప్పాపాత్ముండు భవదీయ దాసుం డయ్యెం గావున వీనిం బో విడువుం’ డని విడిపించె; నా సైంధవుండును ధర్మజునకుఁ దత్సభా గతులైన మునులకు మ్రొక్కిన, నజాత శత్రుం డి ట్లనియె. | 251 |
| ఆ. |
‘ఎట్టి కష్టుఁ డైన నిట్టిపాపము సేయ | నెత్తికొనునె! ధరణి నీవు దక్క. నరుగు మింక; నేమి యందుము నిన్ను నిం | ద్రియవిలోలు నల్పు ధృతివిహీను. |
252 |
| వ. | ఇంక నెవ్వారికి నిట్టి కొఱగాములు సేయక బుద్ధిమంతుఁడవై యుండు’ మనిన నతండు లజ్జావనత వదనుం డగుచు నచ్చోటు వాసి, గంగాద్వారంబున కరిగి యందు. | 253 |
| శా. |
ఆదిత్యార్చితపాదపద్ము జగదేకాధీశు నీశుం ద్రిలో కాదిం గామవిభేదిఁ బర్వతసుతాహ్లాదైకసంపాది నిః ఖేదుం డై శివు నాత్మలో నిలిపి యక్షీణవ్రతారూఢతం బాదాంగుష్ఠము నేల మోపి తప మొప్పం జేసె సద్భక్తిమైన్. |
254 |
| ఉ. |
వానికి నమ్మహేశ్వరుఁడు వత్సలుఁ డై పొడసూపి, ‘యీప్సితం బైనది వేఁడు’ మన్న, నతఁ డానతుఁడై ‘పరమేశ! విక్రమా హీనులఁ బాండునందనుల నేవుర సైన్యయుతంబుగా ననిం బూని జయించు నట్టి వరముం గృపసేయుము నాకు’ నావుడున్. |
255 |
| క. |
‘ఇది వొసఁగదు పాండవులం | గదనమున జయింప నలవిగా దింద్రాది త్రిదశులకు; వినవె! యైనను | వదలక నీకోర్కి దీర్పవలయున యెట్లున్. |
256 |
| చ. |
విజయుఁ డొకండు తక్క నతివీరులఁ బార్థుల నున్న నల్వురన్ నిజ మొకనాఁటి కయ్యమున నీవు జయింపుము; ఫల్గునుండు స ర్వజగదజయ్య విక్రముఁడు; వాని నెదుర్కొని నాకు నైనఁ బో ర జితునిఁ జేయు టెంతయు భరం బగు; నిక్కము వల్కితిం జుమీ! |
257 |
| వ. | అస్మ త్ప్రసాదవిశేషంబునం జేసి వాని కిట్టి ప్రభావంబు గలిగె; నదియునుం గాక. | 258 |
| క. |
నిఖిలాస్త్రశస్త్రవిద్యా | సఖుఁ డపరాజితయశోవిశాలుఁడు విష్ణుం డఖిలేశ్వరుఁ డతనికిఁ బ్రియ | సఖుఁ డటె! యవ్వీరు గెల్వ శక్యమె నీకున్?’ |
259 |
| వ. | అని పలికి యీశ్వరుం డంతర్హితుం డయ్యె; సింధుపతియు నిజదేశంబునకుం జనియె’ ననిన విని జనమేజయుండు వైశంపాయనున కిట్లనియె. | 260 |
| తే. |
‘ధర్మపత్నీసమేతులై తద్వనంబు | నం దపారదుఃఖాతురు లగుచు నున్న రాజముఖ్యులు సత్యైకరతులు పాండు | సుతులు మఱి యేమి సేసిరి సూరిముఖ్య!’ |
261 |
| వ. | అనిన నతం డిట్లనియె; నట్లు ద్రౌపదీమోక్షణం బొనరించిన పిదపం గామ్యకవననివాసుండై భూసుర నివహంబుతో నున్న ధర్మజుపాలికి మార్కండేయుం డరుగు దెంచిన, ననుజసహితంబుగాఁ బ్రత్యుద్గతుండై యమ్మునివరుం బ్రభూతసపర్యల సంతుష్టహృదయుం గావించి, యవ్విభుండు పాంచాలియెడ జయద్రథు చేసిన దుర్వ్యవసాయంబు వానిం బరిభవించుటకునై తమ పడిన యాయాసంబును నమ్మహాత్మున కెఱింగించి ‘మహనీయ శౌర్యధైర్య ధర్మారంభ సమగ్రుల మైన మా కివ్విధంబున నఖిలసామ్రాజ్యభోగ వియోగంబై దుస్తరం బగు వనవాసంబు సంప్రాప్తం బయ్యెం గావున విధికృతం బెవ్వనికి నెబ్భంగుల నలంఘ్యం బని తలంచెద’ నని పలికి మఱియు ని ట్లనియె. | 262 |
| తే. |
‘ద్రుపదనందనక్రియఁ గడుదుఃఖపడిన | నృపవధూటియు నాయట్ల నియతశోక వనధి నిర్మగ్నుఁ డైన భూవరసుతుండుఁ | గలఁడె వినఁ జూడ ననఘ! యెక్కాలమునను?’ |
263 |
| వ. | అనిన నతనికి నత్తపోనిధి యి ట్లనియె. | 264 |
| క. |
‘కడు దుఃఖము నొందితి నని | యుడుగక యిటు వగచె దేల యుర్వీశ్వర! నీ పడు టేటిది? రఘురాముఁడు | గడఁగి యిడుమ వడఁడె! తొల్లి కాఱడవులలోన్. |
265 |
| ఉ. |
ఆ విభుకాంత గాదె జనకాత్మజ రావణుచే గృహీత యై పోవదె; వానరప్రకరముల్ వెసఁ దోడుగ నేఁగి యా ధరి త్రీవిభుఁ డబ్ధిఁ గట్టఁడె, వధింపఁడె దివ్యశరంబులన్ దశ గ్రీవునిఁ; గ్రమ్మఱం జని యకిల్బిషరాజ్యవిభూతి నొందఁడే? |
266 |