పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - షష్ఠాశ్వాసము
మారీచుండు మాయామృగంబై చనుదెంచుట (సం. 3-262-24)
క. కనకమృగరూపమునఁ జని | యినవంశ్యుఁడు సతియు నున్నయెడ మెలఁగుటయుం
గని జానకి కౌతూహల | మునఁ బ్రియుఁ బ్రార్థించె హరిణపుంగవుఁ బట్టన్‌.
323
ఆ. ధరణిసుతయు విధియుఁ దన్నుఁ బ్రేరేపంగ | వివశబుద్ధి యగుచు నవనివిభుఁడు
మృగముఁ బట్టఁ దివిరె మృగనేత్రఁ గావ స | ద్వినుతబలు సుమిత్రతనయు నునిచి.
324
క. అసదృశకార్ముకధరుఁడై | మసలక యామృగము వెనుక మర్దితరిపుఁ డే
పెసఁగంగ నరుగఁ దొడఁగెను | వెస రుద్రుఁడు యజ్ఞమృగము వెనుకొనుమాడ్కిన్‌.
325
వ. అట్టి యవసరంబున. 326
మ. పఱచున్‌ దవ్వుగఁ, జేయలంతి నిలుచుం, బట్టీక యాసాసలం
బిఱువోవుం, బొదలందు డిందుఁ, బొడమున్‌, బిట్టుల్కి వే దాఁటుఁ, గ్ర
మ్మఱి చూచుం, జెవి దార్చి నిల్చు, మలయున్‌, మట్టాడు, గోరాడు, నే
మఱినట్లుండుఁ దృణంబు మేయు నెలయున్‌ మాయామృగం బిమ్ములన్‌.
327
వ. ఇ ట్లతిదూరంబుగా నెలయించి యలయించిన నది రాక్షసమాయగా నూహించి రాఘవుం డమోఘబాణంబు దొడిగి తడయక యమ్మృగంబు నేసిన. 328
క. వాలమ్ము దాఁకి యొఱలుచు | నాలోనన రాము నెలుఁగునట్టి యెలుఁగు గా
‘హా! లక్ష్మణ! సీతా!’ యని | కూలి కపటమృగము తన్నికొనుచుం జచ్చెన్‌.
329
తరువోజ ఆ యెలుఁ గేర్పడ నవనీతనూజ | యాలించి తల్లడం బడరు చిత్తమున
‘నోయన్న! లక్ష్మణ! యొలసి మీయన్న | యుగ్రరాక్షసబాధ నొందంగఁ బోలు;
నాయతభుజ! వింటె యమ్మహాభాగుఁ | డత్యంతదుఃఖార్తుఁ డై నిన్నుఁ జీరె;
బోయి వే కావు విస్ఫురితపుణ్యైక | భూషణోదార! యప్పురుషరత్నంబు’.
330
వ. అనిన నతం డా మానిని కి ట్లనియె. 331
ఆ. ‘అబల! వెఱవకుండు; మఖిలలోకములను | రాఘవేశ్వరునకు రణములోన
నెదురఁ గలఁడె శూరుఁ డెవ్వాఁడు? నతనికి | నెట్టియెడల దురిత మేల పొందు?
332
క. ఇనవంశోత్తముఁ డిప్పుడ | చనుదెంచుఁ బ్రియంబు నొందు జలజానన!’ నా
విని జానకి లక్ష్మణు నెడ | జనితాశంక యయి క్రోధసంభ్రాంతమతిన్‌.
333
సీ. ‘నీతలం పెఱుఁగుదు; నీ కేల వలవని | జాలి నీ కి ట్లేల సంభవించె?
నతిఘోరశస్త్రవిషాగ్నులయం దొంట | వేగంబ ప్రాణముల్‌ విడుతుఁగాక
యే నేల నిను వరియింతు? బెబ్బులికాంత | యక్కట! నక్కపొం దాస పడునె?’
యని యిట్లు సత్పురుషాగ్రణి సౌమిత్రిఁ | బడఁతి యప్రియములు వలుకుటయును,
 
ఆ. జెవులు మూసికొనుచుఁ జిత్తంబు గలఁగ ల | క్ష్మణుఁడు దత్‌క్షణంబ మహిత శౌర్యుఁ
డతులబాణచాపహస్తుఁడై తనయన్న | చనిన చొప్పునంద చనఁ దొడంగె.
334
వ. అయ్యవసరంబున దశాననుండు. 335
మ. కమనీయం బగు జన్నిదంబు శిఖయుం గౌపీనమున్‌ ధాతువ
స్త్రము దండంబును గుండియుం గుశపవిత్రంబుం గడున్‌ వృద్ధభా
వము సంధిల్లఁ ద్రిదండివేషధరుఁడై వచ్చెం బథిశ్రాంతి దే
హమునం దోఁపఁగ సీతయున్నెడకు మాయాదక్షుఁ డక్షీణతన్‌.
336
తే. వాని నిక్కంపుమునియ కా వగచి రాము | వనిత గడుభక్తిఁ బూజించి వన్యఫలము
లొసఁగుటయు వానిఁ జేకొననొల్ల కసుర | మదనవివశుఁడై యిట్లను మగువఁజూచి.
337
మత్తకోకిల ‘ఏను దానవనాయకుండ నహీనసత్త్వుఁడ రావణా
ఖ్యానిరూఢుఁడ లంక నాఁగ జగత్ప్రసిద్ధము మత్పురం
బానతాంగి! మదీయవల్లభ వై భజింపఁగ రాదె ది
వ్యానుభోగము లిష్టచేష్టితహారియౌవనలీలలన్‌.
338
క. ఎక్కడి రాఘవుఁ డక్కట! | తక్కువ యగు పేదమనుజుఁ దగిలి వనమునం
బెక్కిడుమలఁ బడఁ దగునే! | తక్కుము మది నింక నొండుదలఁపులు తరుణీ!’
339
వ. అనిన విని వైదేహి భయకంపిత దేహ యగుచు నతని కి ట్లనియె. 340
సీ. ‘ఇట్లాడ నర్హమే యే నేడ? నీ వేడ? | నక్షత్రతారాగణంబుతోడ
నాకసం బంతయు నవనిపైఁ గూలిన | వసుమతి వ్రస్సిన, వనధు లెల్ల
నింకినఁ, జంద్రదినేశ్వరు లన్యోన్య | విపులతేజంబులు వీడుపడిన
నే నేల యన్యుని నెడలోనఁ గామింతుఁ? | గరిణి యేనాఁట సూకరముఁ గలయు?
 
ఆ. మహితకమలమధురమధురసాస్వాదన | పరవశాత్మ యైన భ్రమరకాంత
రిత్తబుద్ధి నకట! రేఁగుఁబువ్వుల రసం | బాను నెట్లు? బేలవైతి గాక.’
341
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )